Begin typing your search above and press return to search.

'నోటా' ప్రీ రిలీజ్‌ లెక్కలు

By:  Tupaki Desk   |   4 Oct 2018 12:59 PM GMT
నోటా  ప్రీ రిలీజ్‌ లెక్కలు
X
విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ సక్సెస్‌ హ్యాంగోవర్‌ నుండి ఇంకా బయటకు రాకుండానే ‘నోటా’ చిత్రంతో రెడీ అయ్యాడు. ప్రేక్షకులు కూడా ఇంకా గీత గోవిందంను ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు. అప్పుడే ‘నోటా’ రావడంతో అంతా కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ‘గీత గోవిందం’ 50 రోజులు పూర్తి చేసుకున్న మూడు రోజుల్లోనే రాబోతున్న ‘నోటా’పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో ఆసక్తి రెట్టింపు స్థాయిలో ఉంది.

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ లెక్కల విషయానికి వస్తే ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు ముందు ఈ చిత్రాన్ని ప్రారంభించారు కనుక నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తెలివిగా 13 కోట్ల బడ్జెట్‌ లోనే ప్లాన్‌ చేశాడు. దర్శకుడు ముందుగా 10 కోట్లు అనుకున్నా కూడా చివరకు వడ్డీలు - ఇతరత్ర ఖర్చులు కలిపి 13 కోట్ల వరకు వెళ్లింది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రైట్స్‌ భారీ మొత్తంకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో పాటు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ మరియు ఇతర డిజిటల్‌ రైట్స్‌ కలిపి ఆరు కోట్ల వరకు ఇప్పటికే నిర్మాత ఖాతాలోకి వచ్చింది. ఇంకా నిర్మాతకు ఏడు కోట్ల వరకు రావాల్సి ఉంది. ప్రమోషన్‌ ఖర్చులు మరియు ఇతరత్ర మొత్తం కలిపి 10 నుండి 11 కోట్ల వరకు నిర్మాతకు రావాల్సి ఉంది.

ఈ చిత్రంపై నమ్మకం మరియు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ నేపథ్యంలో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా సొంతంగా ఈచిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడులో విడుదల చేస్తున్నాడు. సినిమాకు వచ్చిన క్రేజ్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఈజీగా వారాంతంలో నిర్మాతకు బ్యాలన్స్‌ ఉన్న ఆ 11 కోట్లను రాబట్టడం ఖాయం అని, మిగిలిన మొత్తం కూడా లాభాలే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఒక మోస్తరు విజయాన్ని సాధించినా కూడా ఏకంగా 50 కోట్ల మేరకు నిర్మాత లాభాలను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్‌ అయితే శాటిలైట్‌ రైట్స్‌ ను భారీ మొత్తానికి అమ్మాలని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ‘నోటా’తో నిర్మాత భారీగా లాభాలు దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.