Begin typing your search above and press return to search.

భ‌ల్లూక ప‌ట్టు ప‌డుతున్న విశ్వ‌న‌టుడు!

By:  Tupaki Desk   |   27 Aug 2022 4:50 AM GMT
భ‌ల్లూక ప‌ట్టు ప‌డుతున్న విశ్వ‌న‌టుడు!
X
విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ న‌టించిన‌ 'విక్రమ్' తమిళ చిత్ర పరిశ్రమ స‌హా విడుద‌లైన అన్నిచోట్లా గొప్ప ప్ర‌శంస‌ల‌తో విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ వెర్ష‌న్ తో క‌మ‌ల్ గణనీయమైన లాభాలను ఆర్జించాడు. రాజకీయాల కోసం తాత్కాలికంగా సినిమాలను పక్కనపెట్టిన కమల్ హాసన్ లో ఈ విజ‌యం గొప్ప‌ ఉత్తేజం నింపింది. ఇప్పుడు సినిమా కెరీర్ పై మ‌రింత‌ ఆసక్తి పెరిగింద‌ని త‌మిళ సినీవ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

విక్ర‌మ్ చిత్రం విజ‌యాన్ని ఆలంబ‌న‌గా తీసుకుని వెనువెంట‌నే మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని క‌మ‌ల్ హాస‌న్ చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ట్టు త‌మిళ మీడియా వ‌ర్గాలు సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌రిస్తున్నాయి. కమల్ హాసన్ నుండి తక్షణమే ముందుకు వెళ్ళే మొదటి ప్రాజెక్ట్ లలో ఒకటి 'భారతీయుడు 2'. 1996 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ భార‌తీయుడు (ఇండియ‌న్) కి సీక్వెల్ ఇది. భార‌తీయుడు చిత్రం అప్ప‌ట్లో హిందీ వెర్షన్ లో కూడా బాగా ఆడింది. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ లో సీక్వెల్ తో కూడా పెద్ద హిట్టు కొట్టాల‌ని క‌మ‌ల్ ప్లాన్ చేస్తున్నారు.

శంకర్ ఇప్పుడు ఇండియన్ 2 పై పూర్తిగా దృష్టి పెడతాడని చెన్నైకి చెందిన సోర్సెస్ చెబుతున్నాయి. అయితే రామ్ చరణ్ తో శంక‌ర్ చిత్రం ఆర్.సి 15 వాయిదాకు ఇది కార‌ణ‌మ‌వుతోంది. భారతీయుడు సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి నిల‌పాల‌ని కమల్ హాసన్ వ్యక్తిగతంగా శంకర్ ని అభ్యర్థించడంతో మ‌రో మాట లేకుండా శంక‌ర్ దానికి ఓకే చెప్పాడ‌ట‌. దీంతో రామ్ చరణ్ త‌న సినిమా షూట్ కోసం లాంగ్ టైమ్ వెయిట్ చేయాల్సిందేన‌ని తాజాగా త‌మిళ మీడియాలో క‌థ‌నాలు హోరెత్తుతున్నాయి.

క‌మ‌ల్ న‌టించిన విక్ర‌మ్ చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో విజయం సాధించింది. ఇలాంటి స‌మ‌యంలో శంక‌ర్ లాంటి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న డైరెక్ట‌ర్ సినిమాని ముందుకు పుష్ చేస్తే అది త‌న కెరీర్ కి బిగ్ అస్సెట్ గా మారుతుంద‌ని క‌మ‌ల్ భావిస్తున్నార‌ట‌.

మ‌రో పాన్ ఇండియా హిట్టుతో రేసులో దూసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంద‌ని క‌మ‌ల్ భావిస్తున్నారు. ఇక లైకాతో శంక‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు క‌మ‌ల్ చాలా చొర‌వ చూపారు. అది స‌క్సెస్ అయ్యింది గ‌నుకే శంక‌ర్ మ‌న‌సు మార్చుకుని భార‌తీయుడు 2 పై దృష్టి సారిస్తున్నారు.

ఇక క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 ని తిరిగి పెద్ద స్థాయిలో రావాల‌నుకోవ‌డానికి కార‌ణం ఇటీవ‌ల సౌత్ సినిమా హిందీలో దుమ్ము రేపుతుండ‌డం కూడా ఒక కార‌ణం. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ - పుష్ప త‌ర‌హాలోనే తాను కూడా రేసులో ఉండాల‌ని అనుకుంటున్నాడు. అందుకే అత‌డు రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓవ‌రాల్ గా చూస్తుంటే విశ్వ‌న‌టుడు భ‌ల్లూక ప‌ట్టు ప‌ట్టేట్టున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.