Begin typing your search above and press return to search.

ఎక్కడా 'శేఖర్' హడావిడి కనిపించదేం?!

By:  Tupaki Desk   |   6 April 2022 1:30 PM GMT
ఎక్కడా శేఖర్ హడావిడి కనిపించదేం?!
X
తెలుగులో ఎక్కడ చూసినా మలయాళ రీమేకుల జోరు కొనసాగుతోంది. ఒక వైపున చిరంజీవి .. మరో వైపున పవన్ కల్యాణ్ .. ఇంకో వైపున వెంకటేశ్ .. ఇలా స్టార్ హీరోలంతా మలయాళ కథలను తెలుగులో పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక రాజశేఖర్ కూడా ఒక మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా పేరే 'శేఖర్'. ఈ సినిమాకి రాజశేఖర్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించగా, జీవిత దర్శకత్వం వహించారు. 2018లో మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్.

మలయాళ చిత్రం 'జోసెఫ్'లో జోజు జార్జ్ ప్రధానమైన పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయకుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. కొన్ని కారణాల వలన ఆయన జీవితం అసంతృప్తిగా సాగుతూ ఉంటుంది. తన స్నేహితులతో కలిసి తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పోలీస్ డిపార్టుమెంట్ ఆయన సహాయ సహకారాలను తీసుకుంటూ ఉంటుంది. అలా ఒక కేసు విషయంగా ఆయన ఒక మర్డర్ జరిగిన ప్రదేశానికి వెళతాడు.

అక్కడ ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా .. సహజత్వంతో సాగే కథాకథనాలు మనసును పట్టుకుంటాయి.

మలయాళంలో ఎలాంటి పాటలు ఉండవు. తెలుగులో మన నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రాజశేఖర్ కూతురు శివాని కూడా నటించింది. సినిమాలోను కూతురు పాత్రనే ఆమె పోషించడం విశేషం.

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. ఆ తరువాత కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనేది తెలియడం లేదు.

'ఆచార్య' సినిమా రిలీజ్ తరువాత మిగతా సినిమాలన్నీ కూడా లైన్ మీదకి వచ్చే ఆలోచనలో ఉన్నాయి. అలా ఈ సినిమా కూడా మే నెల నుంచి అప్ డేట్స్ వదిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ - జీవిత కాంబినేషన్లో మరో హిట్ పడుతుందేమో చూడాలి.