Begin typing your search above and press return to search.

ఎన్ ఆర్ ఐ సినిమా - రిస్క్ ఎక్కువ లాభం తక్కువ

By:  Tupaki Desk   |   12 Sep 2018 6:15 AM GMT
ఎన్ ఆర్ ఐ సినిమా - రిస్క్ ఎక్కువ లాభం తక్కువ
X
సినిమా పరిశ్రమలో పెట్టుబడులు లాభాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో వాటితో పాటే భయపెట్టే నష్టాలు కష్టాలు కూడా ఉంటాయి. వీటిని గుర్తించి అన్నింటికీ సిద్ధపడితేనే ఇక్కడ విజయమో వీర స్వర్గమో దక్కుతుంది. కాకపోతే ఇక్కడ స్వర్గం అంటే నష్టం అనే అర్థంలో చూడాలి. ఈ మధ్య కాలంలో ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూటర్స్ గా పలు సంస్థలు సినిమా నిర్మాతలుగా అవతారం ఎత్తడం చూస్తూనే ఉన్నాం. అక్కడ మార్కెట్ బాగా విస్తృతంగా మారడంతో పాటు రిస్క్ తీసుకుని భారీ పెట్టుబడి పెట్టి సినిమా కనక సక్సెస్ అయితే కోట్ల లాభాలు కళ్ళజూసుకోవచ్చు అనే అంచనా వాళ్ళను ఇటువైపు ఆకర్షించేలా చేస్తోంది. కాకపోతే వచ్చిన అందరూ సక్సెస్ కాలేకపోవడమే అసలు ట్విస్ట్. ఇప్పటిదాకా వచ్చిన వాటిని చూస్తే కనక ఒక్క మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తనదైన ముద్ర వేసుకోగలిగింది. తీసిన మూడు సినిమాలు శ్రీమంతుడు-జనతా గ్యారేజ్-రంగస్థలం ఒకదాన్ని మించి ఒకటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడంతో ఈ నిర్మాతల ద్వయం ఏకకాలంలో నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టి పెద్ద నిర్మాణ సంస్థలకే సవాల్ విసురుతోంది. కానీ ఇది అందరి విషయంలో జరిగింది కాదు.

గతంలో మైత్రి కన్నా చాలా ముందుగా టాలీ 2 హాలీ-14 రీల్స్ లాంటివి ఈ రంగంలో ఉన్నాయి. 14 రీల్స్ మొదట్లో మంచి విజయాలు నమోదు చేసుకుంది కానీ ఈ మధ్యకాలంలో ఏది కలిసిరావడం లేదు. లై ఇచ్చిన నష్టాల నుంచి ఇంకా కోలుకోలేదని టాక్. ఇక నిర్వాణ సినిమా-ఎస్ ఆర్టి ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఇదే కథ. నిర్వాణ ఎన్నో అంచనాలతో విడుదల చేసిన మను కనీస స్థాయిలో కూడా మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. ఎస్ ఆర్టి సంస్థ తరఫున తాళ్లూరి పేరుతో తీసిన చుట్టాలబ్బాయి - నేల టికెట్టు మరీ తీసికట్టు ఫలితాలు చేతికిచ్చాయి. ఈ నేపధ్యంలో త్వరలో ఈ రంగంలోకి రావాలి అనుకుంటున్నా ఎన్ ఆర్ ఐలు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మైత్రిది తప్ప అందరిదీ ఫెయిల్యూర్ స్టోరీ. దెబ్బకు ఎన్ ఆర్ ఐ అంటే నో రిటర్న్స్ ఇన్ సినిమా అనే అర్థం వస్తోందని విశ్లేషించుకుంటున్నారు. దీని కంటే డిస్ట్రిబ్యూషన్ కే పరిమితం కావడం బెటర్ అనే అభిప్రాయం కూడా కొందరి నుంచి వ్యక్తమవుతోందట.