Begin typing your search above and press return to search.

రేర్ వీడియో: బాలీవుడ్ స్టార్స్ తో క్రికెట్ ఆడుతున్న ఎన్టీఆర్ - ఏఎన్నార్..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 1:30 PM GMT
రేర్ వీడియో: బాలీవుడ్ స్టార్స్ తో క్రికెట్ ఆడుతున్న ఎన్టీఆర్ - ఏఎన్నార్..!
X
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ-20 వరల్డ్ కప్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జట్టు సెమీ ఫైనల్ కు చేరింది. ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ఈ టోర్నీలో.. 8 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో వుంది.

టీంఇండియా సెమీస్ లో ఇంగ్లాడ్ ను ఢీకొట్టడానికి రెడీ అవుతుండగా.. మన జట్టు ఫార్మ్ చూసి టీ-20 ప్రపంచ కప్ మనదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లోనూ ఇప్పుడు క్రికెట్ గురించి చర్చ జరుగుతోంది. గతంలో నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు కలసి క్రికెట్ ఆడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

1978 లో ఓ ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్ లో బాలీవుడ్ యాక్టర్స్ తో మన టాలీవుడ్ స్టార్స్ తలపడ్డారు. అప్పట్లోనే హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా కలసి ఆడటం విశేషం. తెలుగు టీమ్ తరపున ఎన్టీఆర్ - ఏఎన్నార్ లతో పాటుగా కృష్ణంరాజు - జయప్రద - రావు గోపాల్ రావు - అల్లు రామలింగయ్య - రాజబాబు - ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలీవుడ్ జట్టులో సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్ - దిలీప్ కుమార్ లతో పాటుగా పలువురు హీరోహీరోయిన్స్ పాల్గొన్నారు. టాలీవుడ్ వెర్సెస్ బాలీవుడ్ కక్రికెట్ మ్యాచ్ క్లిప్పింగ్ ని మురళీ మోహన్ నటించిన ఓ సినిమాలో ఉపయోగించారు. ఆ స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఇందులో నాగేశ్వరరావు అద్భుతంగా బ్యాటింగ్ చేసి అవుట్ అయి వెళ్తుండగా.. హిందీ నటీనటులు క్లాప్స్ కొడుతూ నట సామ్రాట్ ని అభినందించడాన్ని మనం చూడొచ్చు. అలానే ఏఎన్నార్ తర్వాత ఎన్టీయార్ బ్యాట్ పట్టుకొని బరిలో దిగి వైవిధ్యమైన షాట్స్ ఆడాడు. అప్పట్లో వీరంతా తలకు హెల్మెంట్స్ లేకుండానే బ్యాటింగ్ చేయటం విశేషం.

అప్పట్లో సీనియర్ నటులు ప్రారంభించిన ట్రెండ్ నే ఆ తర్వాతి తరం హీరోలు కూడా కొనసాగించారు. టాలీవుడ్ లోనే చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ కెప్టెన్లుగా నాలుగు జట్లుగా ఏర్పడి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే.

అలానే గత కొన్నేళ్లుగా సెలబ్రటీ క్రికెట్ లీగ్ పేరుతో కేవలం సినిమా వారి కోసం టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ ఇండస్ట్రీలకు చెందిన టీమ్స్ పాల్గొంటూ వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరొక టోర్నీతో వస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.