Begin typing your search above and press return to search.

అరవింద సమేత.. అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   30 July 2018 3:59 AM GMT
అరవింద సమేత.. అసలేం జరుగుతోంది?
X
ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో ఒక సినిమా చిత్రీకరణ దశలో ఉండగా దాని విశేషాలేవీ బయటికి పొక్కకుండా చూసుకోవడం చాలా కష్టమైపోతోంది. షూటింగ్ స్పాట్లో మొబైళ్లు వాడకుండా నిషేధం విధించినా కూడా లీక్స్ ఆగట్లేదు. ఎలాగోలా దృశ్యాల్ని కెమెరాలోకి ఎక్కించేస్తున్నారు. సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారు. అందులోనూ బాగా క్రేజున్న కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే ఈ బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ‘అరవింద సమేత’ చిత్ర బృందం ఇప్పుడు ఈ ఇబ్బందితోనే తలలు పట్టుకుంటోంది. ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్-నాగబాబుల ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాని గురించి చాలా చర్చ నడిచింది.

సినిమాలోని కీలక సన్నివేశానికి సంబంధించి దృశ్యం ఇలా లీక్ కావడంతో ‘అరవింద సమేత’ టీం షాకైంది. షూటింగ్ స్పాట్ కు ఎవరూ మొబైళ్లు తేకూడదని షరతు విధించి.. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయినా కూడా లీక్స్ ఆగలేదు. తాజాగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో జీన్స్ మీద పొడవాటి తెల్లటి జుబ్బా లాంటిది వేసుకుని నడుస్తున్నాడు తారక్. ఇది సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలు తీస్తుండగా క్లిక్ చేసిన ఫొటో అంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఆ ఫ్లాష్ బ్యాక్ సాగుతుందట. అందులో పూర్తిగా ఎన్టీఆర్ ఇలాంటి డ్రెస్సింగ్‌ తోనే కనిపిస్తాడట. ఈ పిక్ లీక్ కావడంతో చిత్ర బృందాన్ని టెన్షన్ పెడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా మళ్లీ ఇలా జరగడం పట్ల త్రివిక్రమ్ చాలా సీరియస్ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సినిమా నుంచి వరుసగా ఇలా లీక్స్ రావడం ఇండస్ట్రీ జనాలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.