Begin typing your search above and press return to search.
‘యన్.టి.ఆర్’గా బాలయ్య.. ఏమిటీ మాయ?
By: Tupaki Desk | 5 July 2018 4:46 PM GMTఎట్టకేలకు మొదలైంది ఎన్టీఆర్ బయోపిక్. మంచి ముహూర్తం చూసి ఈ రోజే ‘యన్.టి.ఆర్’ సినిమాను మొదలుపెట్టారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్ అరంగేట్ర సినిమా ‘మనదేశం’ చిత్రీకరణ మొదలైంది ఈ రోజే. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఆయన బయోపిక్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ‘మనదేశం’ సినిమాలోని ఎన్టీఆర్ రూపంలోనే ఉన్న బాలయ్య లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ఫొటో సడెన్ గా చూస్తే అందులో ఉన్నది బాలయ్యే అనుకుంటాం. అంత బాగా లుక్ తీర్చిదిద్దారు. కానీ ఈ మ్యాజిక్ వెనుక కొంచెం కృత్రిమత్వం కూడా కనిపిస్తోంది. ఇప్పుడున్న రూపంలో బాలయ్యను యంగ్ ఎన్టీఆర్ లాగా చూపించడం అంత సులువు కాదు. ఒక్కసారిగా ఆయన వయసు సగానికి తగ్గిపోయినట్లుగా ఉంది ఈ లుక్ లో. ఈ విషయంలో ఫొటోషాప్ మాయ కూడా కొంచెం ఉన్నట్లుంది. ఆ టచప్స్ అవీ చేశాకే బాలయ్యను యంగ్ ఎన్టీఆర్ లాగా చూపించగలిగినట్లున్నారు.
ఐతే ఫొటో వరకైతే ఇలాంటి మాయలు ఎన్నయినా చేయొచ్చు కానీ.. దృశ్య రూపంలో ఒకప్పటి ఎన్టీఆర్ ను బాలయ్య మ్యాచ్ చేయడం అంత సులువు కాదు. మరి ఆ విషయంలో క్రిష్ అండ్ టీం ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి. హిందీ సినిమా ‘మణికర్ణిక’ పనులన్నీ పూర్తి చేసి బాలయ్య బయోపిక్ లోకి పూర్తిగా దిగిపోతున్నాడు క్రిష్. ఎప్పట్లాగే శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని క్రిష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఆ డెడ్ లైన్ అందుకోవాలంటే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్టయిల్లోనే వేగం చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు క్రిష్ కన్ఫమ్ అయింది రెండు నెలల కిందటే. ఇంతలోనే స్క్రిప్టు ఆకళింపు చేసుకుని చిత్రీకరణకు రెడీ అయిపోవడం విశేషమే. ఇప్పటిదాకా సొంత స్క్రిప్టులతోనే సినిమాలు తీసిన క్రిష్.. ఈసారి మాత్రం ఆల్రెడీ సిద్ధమైన స్క్రిప్టును తన చేతికి తీసుకున్నాడు. మరి ఇందులో తనదైన ముద్ర ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం.