Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా?

By:  Tupaki Desk   |   22 Oct 2018 5:43 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా?
X
నిన్న అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్ సందర్భంగా బాలయ్య కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదిక మీద కనిపించడం అభిమానులకు సంతోషంగానే ఉన్నా బయటికి చెప్పుకోలేని వెలితి వెంటాడుతోందని విన్పిస్తున్న కామెంట్స్ ని బట్టి అర్థమవుతోంది. ఎన్నడూ లేనిది బాలయ్య అన్న హరికృష్ణ పిల్లలను దగ్గరికి తీసుకోవడం ఇలా ప్రత్యేకంగా సినిమా వేడుకగా రావడం సుమారుగా గత పదేళ్లలో ఎన్నడూ జరగలేదు. 2008లో సింహ వేడుకలో తారక్ కనిపించాడు కానీ జూనియర్ కోసం బాలయ్య వచ్చి చాలా ఏళ్ళు దాటింది. అప్పుడు అన్నయ్య హరికృష్ణ ఉన్నాడు కదా అని సమర్ధించుకోవడానికి లేదు. ఆయన బ్రతికున్నప్పుడే సినిమాలు రాజకీయాలకు స్వస్తి చెప్పి విశ్రాంతికి పరిమితమయ్యారు.

నందమూరి కుటుంబం నుంచి సినిమా రంగంలో ప్రాతినిధ్యం ఇమేజ్ ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఉంది. అయినా సినిమాల ప్రమోషన్ పరంగా బాలయ్య ఏనాడూ కళ్యాణ్ రామ్-తారక్ లను దగ్గరకు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. పైపెచ్చు జో అచ్యుతానంద సినిమా విడుదల సమయంలో నారా రోహిత్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం - తారకరత్న రాజా చెయ్యి వేస్తే గురించి ఓ రెండు ముక్కలు చెప్పడం ఫ్యాన్స్ స్మృతిపధం నుంచి తొలగిపోలేదు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందులోనూ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదల నేపధ్యంలో ఇలా దగ్గర కావడం వెనుక ఎవరి ప్రమేయం ఉందోనని గట్టి చర్చలే జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో లోకేష్ ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో టిడిపి వ్యవహారాలకు తారక్ ను కావాలనే దూరం పెట్టారని ఇప్పుడు మళ్ళి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ప్రోద్బలంతోనే తారక్ ను దగ్గరకు తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పైగా తనను తారక్ ను కలుపుకుని ఎవరూ మాలాంటి సినిమాలు చేయలేరని చెప్పిన బాలయ్య వ్యక్తిగతంగా యంగ్ టైగర్ నటన గురించి మాత్రం ఏ పొగడ్త గుప్పించలేదు. ఈ కోణంలోనూ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని వినికిడి.

పవన్ టిడిపితో కటీఫ్ చేసుకున్నాడు కాబట్టి ప్రచారం పరంగా బలంగా ఉండాలి అంటే జూనియర్ అవసరం ఉందని గుర్తించే ఇలా విజయోత్సవ వేడుకను ఉపయోగించుకున్నారా అనే అనుమానం కలగడం సహజం. కొందరు తారక్ వీరాభిమానులు ట్విట్టర్ వేదిక తమ అసంతృప్తిని వెళ్లగక్కారు కూడా. మరి బాలయ్య రాక దేనికి సూచనో వచ్చే కొద్దినెలల్లో తేలిపోతుంది.