Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డబ్బింగ్ ఎనిమిది గంటలే

By:  Tupaki Desk   |   27 Jan 2016 5:30 AM GMT
ఎన్టీఆర్ డబ్బింగ్ ఎనిమిది గంటలే
X
నెలల తరబడి షూటింగ్ చేస్తారు ఓ సినిమాకు. మరి డబ్బింగ్ చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది. కనీసం వారమైనా పడుతుందని అనుకుంటాం. అలా కాకుండా కొంచెం వేగంగా కానిచ్చేసినా రెండు మూడు రోజులైనా టైం పెట్టక తప్పదనుకుంటాం. అందులోనూ డబ్బింగ్ విషయంలో కొంచెం స్పెషల్ కేర్ అవసరమైనపుడు కచ్చితంగా టైం పడుతుంది. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ఎన్టీఆర్ కేవలం 8 గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేసేశాడట. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 13కే రిలీజ్ చేయాలన్న సంకల్పంతో ఇంత వేగంగా డబ్బింగ్ పూర్తి చేశానని.. అదే సమయంలో తన కెరీర్ లో ఎన్నడూ లేనంత ప్రత్యేకమైన శ్రద్ధ ఈ సినిమా డబ్బింగ్ కోసం పెట్టాల్సి వచ్చిందని ఎన్టీఆర్ వెల్లడించాడు.

‘‘సుకుమార్ గారు ఈ సినిమా గురించి చెప్పేటపుడే.. ఇందులో విలన్ తో పోట్లాట ఏమీ ఉండదని.. అంతా మాట్లాడుకోవడమే ఉంటుందని చెప్పాడు. డబ్బింగ్ చెప్పేటపుడు కూడా హై పిచ్ వాడొద్దని చెప్పారు. హీరో పాత్ర ఇంటలెజెంట్ అని.. రెగ్యులర్ సినిమాల్లో లాగే గట్టిగా మాట్లాడినా, అరిచినా బాగోదని అన్నారు. అసలు నటించేటపుడు కనురెప్పలు కూడా ఎక్కువగా ఆడించొద్దని.. తెలివైన వాడి లక్షణం అదని, అవతలి వాళ్లు మన భావాల్ని పట్టుకోకుండా అలా చేస్తారని చెప్పాడు. అందుకే డబ్బింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నా. మైక్ కు కొంచెం దూరం వెళ్లి లైట్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పాను. వాయిస్ విషయంలో కూడా కొంచెం మార్పు చూపించాను. అందుకే నా గత సినిమాలన్నింటితో పోలిస్తే ఇందులో నా వాయిస్, డబ్బింగ్ చాలా కొత్తగా అనిపిస్తాయి’’ అని ఎన్టీఆర్ వెల్లడించాడు.