Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ మరో వారం భీమ్ గా మారబోతున్నాడట!

By:  Tupaki Desk   |   9 Sep 2021 9:30 AM GMT
ఎన్టీఆర్‌ మరో వారం భీమ్ గా మారబోతున్నాడట!
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్ ముగిసింది అంటూ ప్రచారం జరిగింది. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం అధికారికంగా గుమ్మడికాయ కొట్టినట్లుగా ప్రకటన చేయలేదు. ఇటీవల సినిమా షూటింగ్‌ ప్యాచ్ వర్క్ జరుగుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలిసింది. తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం ఆర్ ఆర్‌ ఆర్‌ కోసం ఎన్టీఆర్‌ మరో వారం రోజుల డేట్లు కేటాయించాడట. షూటింగ్‌ ఇప్పటికే ముగిసినా కూడా కొన్ని షాట్స్ విషయంలో రాజమౌళి సంతృప్తిగా లేరని.. కొన్ని ప్యాచ్‌ వర్క్‌ షాట్స్ ను ఎన్టీఆర్‌ పై చిత్రీకరించేందుకు గాను వచ్చే వారంలో ప్లాన్‌ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్‌ రెండు నెలల క్రితమే షో కోసం కొన్ని రోజులు షూటింగ్‌ లో పాల్గొన్ని కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి చేశాడు. ప్రస్తుతం రెండవ దఫా ఎవరు మీలో కోటీశ్వరులు షో షూట్‌ లో పాల్గొంటున్నారు. వారం నుండి పది రోజుల్లో జెమిని టీవీ షో షూటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ కొమురం భీమ్ వేషం వేయబోతున్నాడు.

ఆర్ ఆర్‌ ఆర్‌ కోసం వారం నుండి పది రోజుల పాటు కొమురం భీమ్‌ పాత్ర షూట్ లో పాల్గొంటాడని సమాచారం అందుతోంది. ఈసారి రామ్ చరణ్ తో కాంబో సన్నివేశాలు ఉంటాయా అనే విషయంలో స్పష్టత లేదు. రామ్‌ చరణ్ కూడా మళ్లీ అల్లూరి వేశం వేయబోతున్నాడా అంటే క్లారిటీ ఇవ్వడం లేదు. మొత్తానికి ఎన్టీఆర్‌ మాత్రం ఆర్ ఆర్ ఆర్‌ సినిమా చిత్రీకరణ కు మళ్లీ హాజరు అవ్వబోతున్నాడు అనేది మీడియా వర్గాల టాక్‌. ఎప్పుడైతే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ముగిస్తారో ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ మరియు ఎన్టీఆర్ ల కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ మరియు రామ్ చరణ్‌ లు నటించడంతో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతటి భారీ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్‌ చేసే ప్రతి సినిమాను కూడా అభిమానులు అదే రేంజ్ లో ఊహించుకుంటారు. కనుక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత కూడా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా ఇంకా వింటున్న కొత్త కథలు అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే అంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ను ఇండియన్ సినీ అభిమానులు కొమురం భీమ్‌ గా ఏమేరకు ఆధరిస్తారు అనేది చూడాలి.