Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - నాని - నాగార్జున.. ఎవరు ‘బిగ్ బాస్’?

By:  Tupaki Desk   |   28 July 2019 5:03 AM GMT
ఎన్టీఆర్ - నాని - నాగార్జున.. ఎవరు ‘బిగ్ బాస్’?
X
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున శనివారం తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియను బాగా పూర్తి చేశారన్న టాక్ వినిపిస్తోంది. సస్పెన్స్ - కామెడీ - అదిలింపు - బెదిరింపు ఇలా అన్ని నవరసాలను శనివారం చాలా బాగా వర్కవుట్ చేసి బిగ్ బాస్ షోను అలరించారు.

మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా ఇరగదీశారనే చెప్పవచ్చు. తనదైన టైమింగ్ తో షోను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. శివబాలాజీ - నవదీప్ - ముమైత్ ఖాన్ - హరితేజ లాంటి అందరికీ తెలిసిన ముఖాలు కావడంతో ఆ షో రక్తికట్టింది. హౌస్ మేట్స్ తప్పు చేసిన పక్షంలో ఎన్టీఆర్ చాలా సీరియస్ గా స్పందిస్తూ వారికి హెచ్చరికలు పంపేవారు. ఎన్టీఆర్ వార్నింగ్ లకు హౌస్ మేట్స్ భయపడిన సందర్భాలున్నాయి. అలాగే కామెడీ టైమింగ్ లో వారితో కలిసిపోవడంలో కూడా ఎన్టీఆర్ తనదైన మార్క్ చూపించాడన్న ప్రశంసలు దక్కాయి.

ఇక రెండో సీజన్ లో నాని కూడా గ్రాండ్ గా మొదలు పెట్టారు. కానీ ఎన్టీఆర్ అంత పరుషంగా.. స్టిక్ట్ గా ఉండలేకపోయారని - హౌస్ ను నడిపించలేరన్న విమర్శలు సోషల్ మీడియా సాక్షిగా - పలు మీడియా సంస్థల సాక్షిగా జనాలు అభిప్రాయపడ్డారు. అయితే రెండో సీజన్ లో కౌశల్ ఆర్మీ వల్ల నాని కూడా ట్రోల్స్ బారిన పడి వ్యక్తిగతంగా ఇబ్బందులు కూడా పడ్డారు. నానికి ఇండస్ట్రీలో వచ్చిన మంచి పేరు... బిగ్ బాస్ లోకి వచ్చాక హౌస్ మేట్స్ ను డీల్ చేసే విషయంలో అనవసరంగా విమర్శలు ఎదుర్కొన్నాడన్న ప్రచారం జరిగింది. అందుకే నాని మూడో సీజన్ కు వైదొలిగాడన్న గుసగుసలు వినిపించాయి.

ఇక మూడో సీజన్ లో నాని తప్పుకోవడంతో నాగార్జున ఆ బాధ్యతలు చేపట్టారు. షో ప్రారంభానికి ముందే లైంగిక వేధింపులు అంటూ కేసులు - హైకోర్టు వరకు వెళ్లింది. అయితే నాగార్జున షోను లాంచ్ చేసిన తీరు ఇప్పుడు ఈ శనివారం ఎలిమినేషన్ ప్రక్రియను నడిపించిన తీరు ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ లోని బిగి.. నానిలోని నెమ్మదితనం కలగలిపి కర్రవిరగకుండా పాము చచ్చేలా నాగార్జున తన అపార అనుభవంతో చాలా బాగా మేనేజ్ చేశాడని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కమెడియన్ మహేష్ ను ‘కర్రోడు’ అని తిట్టిన టీవీ నటుడు రవికృష్ణకు సుతిమెత్తగా స్ట్రాంగ్ గా నాగార్జున ఇచ్చిన వార్నింగ్.. ఆతర్వాత వారిద్దరినీ కలిపిన తీరు ప్రశంసలు అందుకుంది.

ఇలా ముగ్గురు హోస్ట్ లు మూడు భిన్న ధోరణులతో బిగ్ బాస్ ఇంటిని ఈ మూడేళ్లు నడిపించారు. ఎన్టీఆర్ - నానిలు తమ తమ స్టైల్లో ముందుకు తీసుకెళ్లగా.. నాగార్జున ఇప్పుడు సీరియస్ ను - కామెడీని కలగలపి సందర్భానుసారంగా హావభావాలను పలికిస్తూ ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకుండా బిగ్ బాస్ ను నడిపిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.