Begin typing your search above and press return to search.

సిక్సర్లు కొట్టా.. డకౌటయ్యా-ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   4 April 2018 7:54 AM GMT
సిక్సర్లు కొట్టా.. డకౌటయ్యా-ఎన్టీఆర్
X
తన కెరీర్ ను క్రికెట్ భాషలో విశ్లేషించే ప్రయత్నం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. తన కెరీర్లో సిక్సర్లు కొట్టానని.. అలాగే కొన్నిసార్లు డకౌట్ కూడా అయ్యానని అతను అన్నాడు. తాను కొట్టిన తొలి సిక్సర్ ‘సింహాద్రి’ అని అతను చెప్పాడు. ఆ సినిమా విజయం ఇచ్చినంత ఆనందం మరే సినిమా ఇవ్వలేదని అతనన్నాడు. ఆ తర్వాత కూడా కెరీర్లో కొన్ని సిక్సర్లు కొట్టానని.. కొన్నిసార్లు డకౌటయ్యానని చెప్పాడు. ఇక క్రికెట్ పై తనకున్న ఆసక్తి గురించి చెబుతూ.. తన తండ్రి వల్లే ఈ ఆటపై తనకు ఆసక్తి పెరిగిందని చెప్పాడు. తన తండ్రికి క్రికెట్ అంటే ప్రాణమన్నాడు. తాను ఎదిగే వయసులో తనకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టమని.. తనకు ఆయన స్ఫూర్తిగా నిలిచాడని ఎన్టీఆర్ తెలిపాడు.

తాను బ్యాడ్మింటన్ ఆటగాడినని చెప్పిన ఎన్టీఆర్.. క్రికెట్ ఆడటం కంటే చూడటం చాలా ఇష్టమన్నాడు. ఒకప్పుడు సచిన్ అంటే చాలా ఇష్టమని.. ఈ తరంలో ధోనిని ఇష్టపడతానని ఎన్టీఆర్ వెల్లడించాడు క్రికెటర్లు కొన్ని గంటల పాటు మైదానంలో అన్ని భావోద్వేగాల్ని కట్టి పెట్టేసి పూర్తిగా ఆటమీదే మనసు లఘ్నం చేస్తారని.. వాళ్లను చూసి మనమెంతో నేర్చుకోవచ్చని ఎన్టీఆర్ అన్నాడు. తాను తన తండ్రిని చూసి క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నట్లుగానే.. తనను చూసి తన కొడుకు అభయ్ రామ్ ఈ ఆటపై ఇష్టం పెంచుకుంటాడేమో చూడాలని చెప్పాడు. ప్రస్తుతం అభయ్ థర్మోకాల్ బ్యాట్ కొనుక్కుని ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నాడని ఎన్టీఆర్ తెలిపాడు.