Begin typing your search above and press return to search.

జై.. లవ.. కుశ.. ‘బిగ్ బాస్’కు వస్తే..

By:  Tupaki Desk   |   18 Sept 2017 11:48 AM IST
జై.. లవ.. కుశ.. ‘బిగ్ బాస్’కు వస్తే..
X
జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా మొదలుపెట్టాకే.. ‘బిగ్ బాస్’ షోకు కూడా శ్రీకారం చుట్టాడు. ఒకేసారి రెంటికే డేట్లు కేటాయించి.. రెండు షూటింగుల్లోనూ పాల్గొన్నాడు. దీని ప్రభావం దాని మీద.. దాని ప్రభావం దీని మీద కొంత ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా జై-లవ-కుశ.. ఈ ముగ్గురినీ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి తీసుకెళ్లి పెడితే వాళ్లు ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్న ఎన్టీఆర్ కు ఎదురైంది. దీనికి తారక్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ముందుగా కుశ గురించి చెబుతూ.. తుంటరివాడైన అతను ఇక్కడ ఉండలేక గోడ దూకేస్తాడని చెప్పాడు తారక్. ఇక లవ మంచోడని.. అతడిని ఏం చేయమన్నా చేస్తాడని.. స్విమ్మింగ్ పూల్ లో దూకి అక్కడే ఉండమన్నా అలాగే ఉంటాడని చెప్పాడు. జై ప్రస్తావన రాగానే.. వాడితో చాలా కష్టం.. మొత్తం అల్లకల్లోలం చేసేస్తాడు.. బిగ్ బాస్ హౌస్ నే తగలబెట్టేస్తాడు అని చెప్పాడు తారక్. ఈ మూడు క్యారెక్టర్ల లక్షణాలు మీలో ఉన్నాయా.. ఎంతెంత స్థాయిలో ఉన్నాయి అని అడిగితే.. ఉన్నాయని.. సమానమని చెప్పాడు తారక్. లవ లాగా తాను కొంచెం మంచోడినే అని.. కుశ లాగా తుంటరి వాడినని.. జై లాగా తనలో చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయని అన్నాడు. ఈ మూడు పాత్రలకు సంబంధించి తనకు నచ్చిన డైలాగులు చెప్పమని ఎన్టీఆర్ ను అడిగితే.. ‘‘మనం అన్నది అబద్ధం.. నేను మాత్రమే నిజం’’ అనే జై డైలాగ్ ను నత్తితో పలికి అలరించాడు తారక్. లవ పాత్రకు సంబంధించి ‘‘ఇది పుస్తకంలో అయితే పాఠం అవుతుంది. జీవితంలో అయితే గుణపాఠం అవుతుంది’’.. కుశ పాత్రకు సంబంధించి.. ‘‘నాకు కొట్టేయడమూ తెలుసు. కొట్టడమూ తెలుసు’’ అనే డైలాగులు ఫేవరెట్ అని చెప్పాడు.