Begin typing your search above and press return to search.

ముందు అనుకున్నది నాన్నకు ప్రేమతో కాదు

By:  Tupaki Desk   |   10 Jan 2016 11:30 AM GMT
ముందు అనుకున్నది నాన్నకు ప్రేమతో కాదు
X
సుకుమార్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో ముందు అనుకున్నది అసలు ‘నాన్నకు ప్రేమతో’ సినిమానే కాదట. తనకు ముందు వేరే కథ చెప్పాడని.. అది కూడా తనకు చాలా నచ్చిందని.. ఐతే అనుకోకుండా ‘నాన్నకు ప్రేమతో చేయాల్సి వచ్చిందని ఎన్టీఆర్ చెప్పాడు. ‘‘సుకుమార్ తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఆరేడేళ్ల కిందటే మా మధ్య సినిమా గురించి చర్చ జరిగింది. ఆయన ‘జగడం’ చూసి మతిపోయింది. 2013 అక్టోబర్ లో ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం. ఓ లైన్ చెప్పారు. అద్భుతంగా అనిపించింది. బాగా కనెక్టయిపోయాను. ఐతే తర్వాత నిర్మాత ప్రసాద్ గారి అబ్బాయి బాపి సుకుమార్ ఇంకో కథ అనుకుంటున్నాడు అని చెప్పాడు. సర్లే బాగుంటే అదే చేద్దాం అనుకున్నాం. తన తండ్రి ఆసుపత్రిలో ఉండగా వచ్చిన ఆలోచన లోంచి ఓ లైన్ చెప్పారు సుకుమార్. ఇది ఇంకా బాగా అనిపించింది. అది విన్నపుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు. అలా ‘నాన్నకు ప్రేమతో’ మొదలైంది. యూనిట్లోని 8 మంది ఈ కథతో బాగా కనెక్టయ్యారు. మాకు కనెక్టయింది జనాలకు కూడా కనెక్టవుతుందన్న నమ్మకంతో ఈ సినిమా మీద నమ్మకంగా ఉన్నాం’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.

సుకుమార్ గురించి తాను బయట విన్నదానికి, వాస్తవానికి పోలికే లేదని ఎన్టీఆర్ చెప్పాడు. ‘‘సుకుమార్ వర్కింగ్ స్టయిల్ గురించి జనాలు ఏవేవో చెప్పారు. నేను కూడా కంగారు పడిపోయాను. ఒక షాట్ తీయడానికి చాలా టైం తీసుకుంటాడని.. రెండు మూడు రకాల వెర్షన్స్ పెట్టుకుంటాడని.. బాగా లేట్ చేస్తాడని.. ఇలా ఏవేవో విన్నాను. కానీ తను ఏం తీస్తున్నాడో, తనకేం కావాలో క్లియర్‌ గా తెలిసిన దర్శకుడు సుకుమార్‌. హీరో ఎలా కూర్చోవాలి.. పెన్ను ఎలా పట్టుకోవాలి.. అనే చిన్న విషయాల్లోనూ క్లారిటీతో ఉండే దర్శకుడాయన. జులైలో షూటింగ్ మొదలుపెడితే సినిమా జనవరికి విడుదలవుతోంది. దీన్ని బట్టే సినిమాను ఎంత వేగంగా పూర్తి చేశాడో అర్థం చేసుకోవచ్చు. తను స్క్రిప్టు విషయంలో టైం తీసుకుంటాడు తప్పితే.. సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు’’ అని చెప్పాడు.