Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా మారుతున్న ఎన్టీఆర్ పాట‌

By:  Tupaki Desk   |   11 April 2022 9:31 AM GMT
వైర‌ల్ గా మారుతున్న ఎన్టీఆర్ పాట‌
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం 'ట్రిపుల్ ఆర్' ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఈ చిత్రం రిలీజ్ కోసం యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురుచూశారు. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌రిత్ర‌ని తిరిగ‌రాస్తోంది. ఇప్ప‌టికే పీకె, బాహుబ‌లి రికార్డుల్ని స‌మం చేసిన స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం తాజాగా 1000 కోట్ల మైలు రాయిని దాటేసి స‌రికొత్త రికార్డుల దిశ‌గా దూసుకుపోతోంది.

ఫ‌స్ట్ వీక్ లో 700 కోట్ల‌కు మించి క‌లెక్ట్ చేసిన 'ట్రిపుల్ ఆర్' సెకండ్ వీక్ లో దాదాపు 260 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. మూడ‌వ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం త్వ‌ర‌లో మ‌రిన్ని రికార్డుల్ని తిర‌గ‌రాయ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు 231 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. రానున్న రోజుల్లో ఈ ఫిగ‌ర్ మారింత‌గా మారే అవ‌కాశం వుంద‌ని అక్క‌డి ట్రేడ్ అన‌లిస్ట్ లు అంటున్నారు.

ఈ మూవీపై ఈ రేంజ్ క్రేజ్ కి ప్ర‌ధాన కార‌ణం.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల పాత్ర‌ల‌ని రాజ‌మౌళి మ‌లిచిన తీరు, వారిపై చిత్రీక‌రించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ల‌తో పాటు ఇంట‌ర్ వెల్ బ్లాక్‌, క్లైమాక్స్ ఘ‌ట్టాలు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు రోమాంచిత అనుభూతిని క‌లిగిస్తుండ‌టంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు మాస్ ఆడియ‌న్స్ ఈ చిత్రానికి ఐదు భాష‌ల్లోనూ బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. దీంతో ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇక ఈ మూవీకి ఎన్టీఆర్ పై చిత్రీక‌రించిన పాట కూడా ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతూ సినిమాకు మ‌రింత క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. ఎన్టీఆర్ ని బంధించి చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిక‌గా దండిస్తున్న నేప‌థ్యంలో వ‌చ్చే 'కొమురం భీముడో కొమురం భీముడో..' పాట సినిమా రిలీజ్ త‌రువాత మ‌రింత వైర‌ల్ గా మార‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాట‌ని కీర‌వాణి త‌న‌యుడు, యువ సంగీత ద‌ర్శ‌కుడు కాల‌భైవ‌ర ఆల‌పించారు.

గ‌త కొన్నేళ్ల క్రితం ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ 'రంగుల క‌ల‌' (1983) చిత్రం కోసం పాడిన 'మ‌ద‌నా సుందారి మ‌ద‌నా సుందారి..' అంటూ సాగే పాట‌ని స్ఫూర్తిగా తీసుకుని 'కొమురం భీముడో' సాంగ్ ని ట్రిపుల్ ఆర్ కోసం రాయించిన‌ట్టుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. పదాలు మారినా ఆ పాట టెంపోని ఫాలో అవుతూ ఈ పాట‌ని రాశారు. ఇదిలా వుంటే ఈ పాట‌ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీఆర్ పై చిత్రీక‌రించిన 'కొమురం భీముడో..' సాంగ్ ఇప్ప‌డు నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌ని ప‌లు స్టేజ్ ల‌పై స్ఫూఫ్ లుగా ప్ర‌ద‌ర్శిస్తూ ఫ్యాన్స్ మ‌రింత వైర‌ల్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో విడుద‌లైన 'ట్రిపుల్ ఆర్‌'లోని ఈ పాట దేశ వ్యాప్తంగా వున్న అన్ని భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఒడిశాకు చెందిన కొంత మంది యువ‌కులు ఈ పాట‌కు స్ఫూఫ్ ని చేశారు. ఓ అభిమాని ఎన్టీఆర్ లా క‌ట్టేసి మ‌రో అభిమాని ర‌మ్‌ చ‌ర‌ణ్ లా బ్రిటీష్ అధికారిగా మారి కొర‌డాతో కొడుతూ ఈ పాట‌ని రీక్రియేట్ చేసిన తీరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంతే కాకుండా కొంత మంది ఎన్టీఆర్ పులి ఫైట్ ని కూడా రీక్రియేట్ చేస్తూ ఆ వీడియోల‌ని నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. సినిమాపై రోజు రోజుకూ క్రేజ్ త‌గ్గుతున్నా ఎన్టీఆర్ పై చిత్రీక‌రించిన 'కొమురం భీముడో' సాంగ్ మాత్రం వైర‌ల్ అవుతుండ‌టం విశేషం.