Begin typing your search above and press return to search.

'అజ్ఞాతవాసి’ ఫలితంపై స్పందించిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   6 Oct 2018 9:23 AM GMT
అజ్ఞాతవాసి’ ఫలితంపై స్పందించిన ఎన్టీఆర్
X
నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందనుకున్న ‘అజ్ఞాతవాసి’.. చివరికి తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్‌ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న ముద్రను ఈ చిత్రం చెరిపేసింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కు చాలా చెడ్డ పేరొచ్చింది. అలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్.. అతడితో సినిమాను మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా కోసం ఇన్నేళ్లు ఎదురు చూసి.. చివరికి ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత జట్టు కట్టాడే అని ఫ్యాన్స్ ఆందోళనలో పడిపోయారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ధైర్యంగా అడుగేశాడు. ‘అరవింద సమేత’ తన కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని అతను ధీమాగా చెబుతున్నాడు. మరి ఈ సినిమా మొదలవడానికి ముందు ‘అజ్ఞాతవాసి’ ఫలితం మీపై ఎలాంటి ప్రభావం చూపించలేదా అని మీడియా వాళ్లు అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పాడు తారక్.

తన కెరీర్లోనూ ఎన్నో ఫ్లాపులు ఉన్నాయని.. అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోయానని.. విజయాలు అందుకున్నానని.. ఒకరి గత సినిమా ఆడనంత మాత్రాన తర్వాతి సినిమా మీద ఆ ప్రభావం ఉంటుందని తాను అనుకోనని తారక్ అన్నాడు. ‘అజ్ఞాతవాసి’ ఫలితం తాలూకు ప్రభావం ‘అరవింద సమేత’పై ఉంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అతను స్పష్టం చేశాడు. ప్రతి సినిమా భిన్నమైన ప్రయాణం అని.. హిట్లు.. డిజాస్టర్లు అన్నవి కామన్ అని చెప్పాడు. ‘అరవింద సమేత’ పూర్తిగా త్రివిక్రమ్ మార్కు సినిమా అని.. ఆయన కన్న కలలో తాను భాగం అయ్యానని ఎన్టీఆర్ అన్నాడు. త్రివిక్రమ్ గొప్ప కథ రాశాడని.. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దాడని.. ఈ చిత్రం చాలా కాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని.. ఇలాంటి సినిమాలో నటించడం తన అదృష్టమని ఎన్టీఆర్ చెప్పాడు.