Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ప్ర‌యారిటీ అన్న‌కే!

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:30 AM GMT
ఎన్టీఆర్ ప్ర‌యారిటీ అన్న‌కే!
X
త‌న అన్న క‌ళ్యాణ్‌ రామ్‌ కే తొలి ప్ర‌యారిటీ ఇస్తున్నాడు ఎన్టీఆర్‌. అన్న చెప్పినట్టుగా ఆయ‌న సంస్థ‌లోనే సినిమా చేయాల‌ని డిసైడైపోయాడు. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `నాన్న‌కు ప్రేమ‌తో` చేస్తున్న ఎన్టీఆర్ కోసం ఎంతోమంది దర్శ‌కులు, నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. కొర‌టాల శివ - గోపీచంద్ మ‌లినేని - హ‌రీష్‌ శంక‌ర్‌... ఇలా ద‌ర్శ‌కుల జాబితా చాలా పెద్ద‌దే. ఆయా ద‌ర్శ‌కులు వాళ్ల వాళ్ల నిర్మాత‌ల‌తో క‌లిసి ఎన్టీఆర్‌ తో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకొంటున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈసారి త‌న అన్న క‌ళ్యాణ్‌ రామ్‌ కోసమే ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఎన్టీఆర్‌ తో త‌న నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమా చేయాల‌ని క‌ళ్యాణ్‌ రామ్ ఎప్ప‌ట్నుంచో అనుకొంటున్నాడు. వ‌క్కంతం చెప్పిన క‌థ ఎన్టీఆర్‌ కి కూడా బాగా న‌చ్చింది. ఆ కాంబినేష‌న్‌ లో సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో వార్త‌లొస్తున్నాయి కూడా. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్టు రెండేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు `నాన్న‌కు ప్రేమ‌తో` సినిమా పూర్త‌యిన త‌ర్వాత వ‌క్కంతం వంశీ సినిమానే సెట్స్‌ పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఎన్టీఆర్ ఇటీవ‌ల గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌డంతో క‌ళ్యాణ్‌ రామ్‌ - వ‌క్కంతం వంశీ స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుకొంటున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి `కిక్‌2`తో క‌ళ్యాణ్‌ రామ్‌ కి భారీగా న‌ష్టాలొచ్చాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న మ‌రో సినిమా నిర్మించ‌లేడేమో అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకొన్నాయి. అయితే ఎన్టీఆర్ అన్న‌కు అండ‌గా నిలుస్తూ తాత పేరుతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌ లో నేను న‌టిస్తాన‌ని ముందుకొచ్చాడ‌ట‌. దీంతో వ‌క్కంతం వంశీ ప్రాజెక్టుకి క‌ద‌లిక వ‌చ్చిన‌ట్ట‌యింది. సినిమాని ఫిబ్ర‌వ‌రిలో మొద‌లుపెడ‌తార‌ని తెలుస్తోంది. కిక్‌2 విడుద‌ల‌లో ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు కూడా ఎన్టీఆరే జోక్యం చేసుకొని క‌ళ్యాణ్‌ రామ్‌ కి అండ‌గా నిలిచాడు. ఇప్పుడు ఆ న‌ష్టాల్ని పూడ్చ‌డానికి కూడా తాను సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. అన్న‌ద‌మ్ముల అనుబంధం అంటే అదే మ‌రి!!