Begin typing your search above and press return to search.

హై ఫీవర్లోనూ ఎన్టీఆర్ షూటింగ్

By:  Tupaki Desk   |   27 Dec 2015 7:07 AM GMT
హై ఫీవర్లోనూ ఎన్టీఆర్ షూటింగ్
X
‘నాన్నకు ప్రేమతో’ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పట్టుదలగా ఉన్నాడో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. సినిమా చివరి షెడ్యూల్ సందర్భంగా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదట ఎన్టీఆర్. హై ఫీవర్ ఉన్నప్పటికీ యూనిట్ సభ్యులు వద్దంటున్నా ఒప్పుకోకుండా షూటింగులో పాల్గొన్నాడట ఎన్టీఆర్. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాటోగ్రాఫర్ విజయ్ కె.చక్రవర్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్టీఆర్ కమిట్ మెంట్ చూసి ఆశ్చర్యపోయానని.. సినిమా అనుకున్న సమయానికి పూర్తవ్వాలని అతను హై ఫీవర్ లోనూ షూటింగులో పాల్గొన్నాడని విజయ్ తన ట్విట్టర్ పేజీలో వెల్లడించాడు.

గత ఏడాది ‘టెంపర్’ విషయంలోనూ ఇలాగే ఎంతో కమిట్ మెంట్ చూపించాడు ఎన్టీఆర్. తన అన్నయ్య జానకిరామ్ హఠాత్తుగా చనిపోయినా ఆ బాధ దిగమింగి కొన్ని రోజుల్లోనే షూటింగులో పాల్గొన్నాడు. కానీ ఎంత కష్టపడ్డా ఆ సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో మాత్రం సంక్రాంతి అడ్వాంటేజీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని పట్టుదలతో ఉన్నాడు. ఎన్టీఆర్ పట్టుదల చూసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా తన తండ్రి మరణం తాలూకు బాధను అణుచుకుని ఆడియో రెడీ చేశాడు. ఈ రోజు సాయంత్రమే ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగానే రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చే అవకాశముంది.