Begin typing your search above and press return to search.

NTR30 మోషన్ పోస్టర్ ఎఫెక్ట్: కొరటాలపై నెగిటివిటీ పోయినట్లేనా..?

By:  Tupaki Desk   |   20 May 2022 10:30 AM GMT
NTR30 మోషన్ పోస్టర్ ఎఫెక్ట్: కొరటాలపై నెగిటివిటీ పోయినట్లేనా..?
X
టాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగిన కొరటాల శివ ఇటీవల తొలిసారిగా తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ లు కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది.

కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు, 'ఆచార్య' సినిమా ప్లాప్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వైఫల్యానికి దర్శకుడు ఒక్కరే కారణమన్నట్లుగా అన్ని వేళ్లు కొరటాల వైపు చూపబడ్డాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ పై నెగిటివిటీ వచ్చింది.

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న #NTR30 సినిమాపై అందరి దృష్టి పడింది. 'జనతా గ్యారేజ్' వంటి హిట్ మూవీ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. కాకపోతే 'ఆచార్య' ఫలితాన్ని చూసి తారక్ ఫ్యాన్స్ లో కాస్త కలవరం ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితులుల్లో ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన #NTR30 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్.. అద్భుతమైన విజువల్స్ కు తోడు తారక్ పలికిన పవర్ ఫుల్ డైలాగ్ తో దర్శకుడు మరోసారి ప్రశంసించబడ్డారు.

''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా'' అంటూ వచ్చిన ఫ్యూరీ ఆఫ్ NTR30 వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

తారక్ రెండు చేతుల్లో రెండు ఆయుధాలు.. సముద్రపు తీరాన ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు.. ఏరులై పారుతున్న రక్తం.. ఇలాంటి అంశాలతో డిజైన్ చేయబడిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. దీంతో కొరటాల శివ తన ట్రేడ్‌ మార్క్ యాక్షన్ చిత్రాలతో మళ్లీ ఫామ్‌ లోకి వస్తాడని అభిమానులే కాదు.. సినీ ప్రేమికులు కూడా భావిస్తున్నారు.

'ఆచార్య' తో ఫస్ట్ ప్లాప్ రుచి చూసిన దర్శకుడు.. NTR30 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటారని నమ్ముతున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది పక్కన పెడితే.. ఖచ్చితంగా ఈ మోషన్ పోస్టర్ కొరటాల శివ మీద కొంచెం నెగెటివిటీని తగ్గించిందని చెప్పవచ్చు.