Begin typing your search above and press return to search.

పారితోషికంలో నంబ‌ర్ -1 హీరోయిన్?

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:47 AM GMT
పారితోషికంలో నంబ‌ర్ -1 హీరోయిన్?
X
అత్యంత భారీగా సంపాదిస్తున్న ప్రభావవంతమైన సెల‌బ్రిటీల‌ జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే అది ఎంతో గౌర‌వంతో కూడుకున్న‌ది. సంఘంలో హోదాను ఇది డిసైడ్ చేస్తుంది. ఆ ర‌కంగా చూస్తే బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ హీరోల‌తో స‌మానంగా పారితోషికాలు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ప్రపంచంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో బాలీవుడ్ ఒకటిగా ప్రచారంలో ఉంది. ఇక్క‌డ క‌థానాయిక‌ల పారితోషికాల‌ పెంపు గురించి చాలాసార్లు సంచ‌ల‌న క‌థ‌నాలు మీడియాలో వ‌చ్చాయి. ముంబై పరిశ్రమకు చెందిన వివిధ సోర్స్ నుంచి వెల్ల‌డైన స‌మాచారం మేర‌కు.. దీపిక ప‌దుకొనే స‌హా ప‌లువురు అందాల నాయిక‌ల‌ పారితోషికం ఇప్పుడు చుక్క‌ల్లో ఉంది.

పారితోషికంలో దీపికా పదుకొణె .. అలియా భట్ లు టాప్ రేంజ్ లో ఉన్నారు. ఆ ఇద్ద‌రూ ఎంపిక చేసుకునే జానర్ ఇతర అంశాల ఆధారంగా వారి ఫీజులు సినిమా నుండి సినిమాకి మారుతూ ఉండగా ఈ భామ‌లు ఒక ఫీచర్ ఫిల్మ్ లో న‌టించాలంటే రూ. 15 కోట్ల రేంజ్ లో వసూలు చేస్తారని తెలిసింది. దీపికా పదుకొణే పఠాన్ - గెహ్రైయాన్ రెండింటిలోనూ భాగం కావడానికి రూ. 15 కోట్లు (నిర్మాతలు OTT విడుదలను ఎంచుకున్న తర్వాత ఇది రూ. 12 నుండి 15 కోట్లకు పెరిగింది) అందుకుంది.

డార్లింగ్స్ కోసం అలియా భట్ రూ. 15 కోట్లు వసూలు చేసింది. అయితే సంజయ్ లీలా భన్సాలీ ఇతిహాసం గంగూబాయితో పాటు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో కూడా భాగం కావడానికి ఆలియా తన ఫీజులను తగ్గించుకుంద‌ని టాక్ వ‌చ్చింది. దీపికా - ఆలియా చాలా కాలంగా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్నారు. సినిమాలను సోలోగా తమ భుజస్కంధాలపై మోయగల సామర్థ్యంతో తమ స్టార్ పవర్ ను నిరూపించుకున్నారు. మరోవైపు దీపికా కూడా గెహ్రైయాన్ లాభాల నుండి బ్యాకెండ్ వాటాను పొందిందని స‌మాచారం. దీపిక ఇటీవ‌ల న‌టిస్తున్న ప్రాజెక్ట్ కే కోసం 18కోట్లు డిమాండ్ చేసింద‌ని టాక్ వినిపించింది. మునుముందు న‌టించే కొన్ని చిత్రాలకు ఇది కొనసాగుతుంది.

పారితోషికాల్లో కత్రినా కైఫ్ - కరీనా కపూర్ ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ ఇద్దరు నటీమణులు రెండు ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు. సుదీర్ఘ కెరీర్ లో వెనుదిర‌గ‌ని స్టార్లుగా ఎదిగారు. మార్కెట్ లో ఆ ఇద్ద‌రికి ఉన్న‌ డిమాండ్ ప్రేక్షకులలో వారి రీచ్ కు నిదర్శనం. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న 'జీ లే జరా' కోసం కత్రినా కైఫ్ దాదాపు రూ. 12 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు సుజోయ్ ఘోష్ ఇంకా పేరు పెట్టని థ్రిల్లర్ కోసం కరీనా కపూర్ రూ. 12 కోట్లు అందుకుంటోంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా- అనుష్క శర్మ ఉన్నారు.

వారిద్దరూ బాలీవుడ్ లో తమ పనిని తగ్గించుకున్నారు. అయినప్పటికీ వారు సైన్ చేసిన చివరి చిత్రానికి పెద్ద మొత్తంలో పారితోషికం అందింది. ప్రియాంక చోప్రా 'జీ లే జరా' కోసం 10 కోట్ల రేంజ్ లో అందుకుంది. అయితే 'స్కై ఈజ్ పింక్‌'కి 8 కోట్ల రూపాయలకు సంతకం చేసింది. మరోవైపు అనుష్క త్వరలో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ కోసం వేచి చూస్తోంది. ఈ సిరీస్ కోసం రూ.8 కోట్ల పారితోషికం తీసుకుంది.

బాలీవుడ్ లోని చాలా మంది నటీమణులు ముందస్తు పారితోషికం మోడల్ ను అనుస‌రిస్తారు. శ్రద్ధా కపూర్ కూడా ఇందుకు భిన్నంగా లేదు. రణబీర్ కపూర్ తో లవ్ రంజన్ తదుపరి చిత్రంలో భాగం కావడానికి శ్ర‌ద్ధా రూ. 7 కోట్లు వసూలు చేసింది. తాప్సీ పన్ను లూప్ లాపేట కోసం రూ. 5 కోట్లు అందుకుంది. అయితే విద్యాబాలన్ గత కొన్నేళ్లుగా తన సినిమాలన్నింటికీ రూ.4 కోట్లు వసూలు చేస్తూనే ఉంది. కృతి సనన్ 'గణపథ్' లో న‌టించినందుకు రూ. 4 కోట్లు దక్కించుకుంది. కియారా అద్వానీ రాజ్ మెహతా దర్శకత్వం వహించిన 'జగ్ జగ్ జీయో'ను రూ. 2.50 కోట్లకు పొందింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్- దిశా పటానీ ఒక్కో చిత్రానికి రూ. 2.50 కోట్లు.. 2.00 కోట్లు అందుకుని స్థిరంగా ఉన్నారు. అయితే జాన్వీ కపూర్ .. సారా అలీ ఖాన్ ఇక్కడ కూడా రూ. 2 కోట్ల మార్కెట్ రేంజులో ఉన్నారు. మరోవైపు అనన్య పాండే రూ.1.50 కోట్లకు చేరువ‌గా ఉంది.

పరిశ్రమలో కంగనా రనౌత్ పారితోషికం గురించి ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది. ఒక్కో సినిమాకు రనౌత్ 21 నుంచి 25 కోట్లు వసూలు చేస్తుందని కంగ‌న పీఆర్ వ‌ర్గాలు పేర్కొంటుండగా.. ఆమె పారితోషికం 8 నుంచి 9 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో గుస‌గుస‌లు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల కంగ‌న రేంజు ఇంకా కిందికి ప‌డిపోయింద‌ని టాక్ వినిపిస్తోంది.

ద‌క్షిణాదిలో నంబ‌ర్ 1 నాయిక ఎవ‌రు?

అయితే ఇంత‌మందితో పోటీప‌డుతూ ద‌క్షిణాదికి చెందిన స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ఏకంగా 8 కోట్ల పారితోషికం అందుకుంటోంది. నిజానికి దీపిక ప‌దుకొనే- ఆలియా భ‌ట్ రేంజులో లేక‌పోయినా న‌య‌న‌తార కూడా ''క‌త్రిన‌- క‌రీనా- అనుష్క శ‌ర్మ‌'' రేంజులో అందుకుంటోంద‌న్న టాక్ వినిపిస్తోంది. చాలా మంది అగ్ర తార‌ల హోదాలో ఉన్న బాలీవుడ్ నాయిక‌ల‌తో పోలిస్తే న‌య‌న‌తార పారితోషికం చాలా ఎక్కువ‌. అయితే ఆ రేంజులో క్రౌడ్ ని పుల్ చేయ‌గ‌ల ద‌క్షిణాది క‌థానాయిక‌గా త‌న రేంజు వేరే లెవ‌ల్ లో ఉంది. సౌత్ లో అంద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ షారూక్ స‌ర‌స‌న అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఖాన్ కి కూడా న‌య‌న్ ల‌క్కీ ఛామ్ గా మార‌నుంది.