Begin typing your search above and press return to search.

సైన్స్ పరిశోధన చేస్తే జైళ్లో వేశారు

By:  Tupaki Desk   |   18 Sep 2015 10:59 AM GMT
సైన్స్ పరిశోధన చేస్తే జైళ్లో వేశారు
X
చదవేస్తే ఉన్నమతి పోయిందని సామెత... విద్యార్థుల విషయంలో వాడే ఈ సామెతను ఇప్పుడు అమెరికాలోని టీచర్ల విషయంలో వాడాల్సివస్తోంది. అవును... వారి తొందరపాటు కారణంగా 9వ తరగతి చదువుతున్న కుర్రాడొకరు జైలు ఊచలు లెక్కబెట్టాల్సివచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం... కొత్త ఆవిష్కరణలు చేయాలని ఉపాధ్యాయులు చెప్పడంతో కొత్త మోడల్ అలారం గడియారం చేసుకుని వచ్చిన ఆ అబ్బాయిని బాంబు తెచ్చాడంటూ జైళ్లో బంధించారు.

అమెరికాలోని టెక్సాస్ లో ఓ పాఠశాలలో అహ్మద్ మహ్మద్ 9వ తరగతి చదువుతున్నాడు. పేద్ద ఇంజినీరు కావాలన్నది ఆయన కల. నిత్యం ఏదో ఒక ఆవిష్కరణ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆయనకు తగ్గట్లుగానే ఓ రోజు స్కూళ్లో కొత్త ఆవిష్కరణ ఏదైనా చేసి తీసుకురమ్మని చెప్పారు. ఇంకేముంది తన బుర్రంతా ఉపయోగించి కొత్తరకం అలారం వాచ్ తయారుచేశాడు. దాన్ని స్కూలుకు తీసుకెళ్లాడు. కానీ... అది మొత్తం వైర్లు - బ్యాటరీలతో కనిపించగానే టీచర్లు బాంబు అనుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా అదేంటో పరిశీలించకుండా అహ్మద్ ను జైళ్లో వేశారు. ఆ తరువాత బాంబ్ స్క్వాడ్ దాన్ని పరిశీలించడంతో బాంబు కాదని...కుర్రాడు వాచీ తయారుచేసి తెచ్చాడని తేలింది. దీంతో టీచర్లు, పోలీసులు నాలుక్కరుచుకున్నారు.

ఈ విషయంపై అక్కడి మీడియా కోడై కూయడంతో బరాక్ ఒబామా స్పందించారు. అహ్మద్ ను తన ఇంటికి ఆహ్వానించారు. 14 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఆవిష్కరణకు మెచ్చుకున్నారు. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా దీనిపై స్పందించి అహ్మద్ ను ఆహ్వానించారు. జైలుకెళ్తే వెళ్లాడు కానీ అహ్మద్ పేరు ఒక్కసారిగా అమెరికా అంతటా మార్మోగిపోయింది.