Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ఒక్కడొచ్చాడు

By:  Tupaki Desk   |   24 Dec 2016 4:53 AM GMT
మూవీ రివ్యూ: ఒక్కడొచ్చాడు
X
చిత్రం : ‘ఒక్కడొచ్చాడు’

నటీనటులు: విశాల్ - తమన్నా - జగపతిబాబు - సంతప్ - వడివేలు - సూరి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: రిచర్డ్ నాథన్
నిర్మాత: హరి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సూరజ్

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కానీ మధ్యలో వరుస ఫ్లాపులతో తన మార్కెట్ ను దెబ్బ తీసుకున్నాడు. తిరిగి ఇక్కడ పాగా వేయడానికి కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. ఫలితం దక్కట్లేదు. తాజాగా ‘ఒక్కడొచ్చాడు’ సినిమాతో తన దండయాత్రను కొనసాగించాడు. మరి దీని సంగతేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (విశాల్) పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి.. సైకాలజీ స్టూడెంట్ అయిన దివ్య (తమన్నా)ను ప్రేమిస్తాడు. ఆమె డీసీపీ చంద్రబోస్ (జగపతిబాబు)కు చెల్లెలు. అర్జున్ కు కొన్ని పరీక్షలు పెట్టి ఆమెతో అతడి పెళ్లికి ఓకే చెబుతాడు చంద్రబోస్. ఐతే పెళ్లికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో అర్జున్.. చంద్రబోస్ కు పెద్ద షాకిస్తాడు. అతను నేరస్థుల నుంచి రికవర్ చేసిన వందల కోట్ల డబ్బును కొట్టేస్తాడు. అప్పుడే అర్జున్ లక్ష్యం వేరే అని తెలుస్తుంది. ఇంతకీ అర్జున్ ఎవరు.. అతడి మిషన్ ఏంటి.. కొట్టేసిన డబ్బుతో అతనేం చేస్తాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మెరిసేదంతా బంగారం కాదన్నట్లు.. తమిళం నుంచి వచ్చే కథలన్నీ కొత్తగా ఉంటాయని.. అవి కొత్త అనుభూతిని పంచుతాయని అనుకోకూడదు. అందుకు ‘ఒక్కడొచ్చాడు’ ఉదాహరణగా నిలుస్తుంది. ఇది మన తెలుగు సినిమాల్లో సహా అన్ని చోట్లా వాడి వాడి అరగదీసిన పాత కథతో తెరకెక్కిన సినిమా. పెద్దోడిని కొట్టు.. పేదోడికి పెట్టు అనే తరహా రాబిన్ హుడ్ కథనే ఆధునిక హంగులతో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సూరజ్. హీరో ముందు అమాయకుడిలా పరిచయమవుతాడు. కానీ తర్వాత జగత్ కంత్రీలా డబ్బంతా దోచేస్తాడు. కొంచెం వెనక్కి హీరో ఎందుకలా చేస్తున్నాడో చూపించే ఒక శాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫార్మాట్లో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయో లెక్కల్లో చెప్పడం కష్టం.

కథ పాతదే అయినా కథనం ఏమైనా కొత్తగా.. ఎంటర్టైనింగ్‌గా ఉందా సర్దుకుపోదాం అంటే అదీ లేదు. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లుగా ఉంటుంది. కామెడీ సీన్లతో సహా అన్నిచోట్లా తర్వాత ఏం జరగబోతోందో సులువుగా చెప్పేయొచ్చు. హీరో కాబట్టి ఏమైనా చేసేస్తాడు. అవతల డీసీపీ అయినా సరే బోల్తా కొట్టక తప్పదు. నాకు మెమొరీ లాస్ అంటూ హీరో డీసీపీని ఆడేసుకుంటుంటాడు. హీరో ఆటలో అందరూ పావులు అయిపోతారు. ఇలా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో సాగిపోతుంది ‘ఒక్కడొచ్చాడు’ వ్యవహారం. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న నీ అంశం చుట్టూ కథ తిరగడం ఒక్కటే ‘ఒక్కడొచ్చాడు’లో కాంటెంపరరీగా అనిపించే అంశం.

ప్రథమార్ధంలో వచ్చే హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఏమంత ఆసక్తి కలిగించదు. తమన్నా గ్లామర్ విందు మినహా ఈ ట్రాక్ లో ఆకర్షించే అంశాలేమీ పెద్దగా ఉండవు. తమిళంలో తన వాయిస్ తో.. బాడీ లాంగ్వేజ్ తో కామెడీ పండించేస్తుంటాడు సూరి. కానీ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అతను నవ్వించాలంటే సన్నివేశాల్లో బలం ఉండాలి. అది లేకపోవడంతో కామెడీ సీన్లేవీ పండలేదు. ప్రథమార్ధంలో కథ మొదలవడానికి చాలా సమయం పట్టేస్తుంది. ప్రి ఇంటర్వెల్ దగ్గర్నుంచే కొంచెం ఆసక్తి మొదలవుతుంది. తెలుగు కమర్షియల్ సినిమాల తరహాలో ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశాడు దర్శకుడు. అది మరీ అంత సర్ప్రైజ్ ఏమీ కాదు కానీ.. ప్రేక్షకుడిలో ఇక్కడే కొంచెం చలనం వస్తుంది.

ఇక ద్వితీయార్ధం వచ్చేసరికి ఈ టెంపోను కొనసాగించలేకపోయాడు దర్శకుడు. మళ్లీ సినిమా రెగ్యులర్ ఫార్మాట్లో.. అనాసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధంలో వడివేలు కామెడీతోనూ అదే నేటివిటీ సమస్య ఇబ్బంది పెడుతుంది. అరవ జనాలకైనా ఈ కామెడీ నచ్చుతుందా అంటే సందేహమే. బ్రహ్మానందం డబ్బింగ్ కూడా ఈ పాత్రకు బలం కాలేకపోయింది. విశాల్ తనదైన స్టయిల్లో ఫైట్లు చేస్తూ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగిపోతాడు. తమన్నా రెండో అర్ధంలో కనిపించేది చాలా తక్కువ. అసలామె పాత్రలో ఏ విశేషం లేదు. చివర్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొంచెం గుండె బరువెక్కిస్తాయి. ఐతే అంతకుముందు సినిమా సాగిన తీరుకు.. చివర్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కు పొంతన కుదరదు. మొదట్నుంచి సిల్లీగా సాగిన సినిమా.. చివరికి వచ్చేసరికి సీరియస్ టర్న్ తీసుకుంటే ఎలా సింక్ అవుతుంది? విశాల్ ఫైట్లు.. తమన్నా గ్లామర్.. రిచ్ విజువల్స్ మాత్రమే ‘ఒక్కడొచ్చాడు’లో చెప్పుకోదగ్గ పాజిటివ్స్. ఈ పరమ రొటీన్ కమర్షియల్ సినిమాలో అంతకుమించేం లేదు.

నటీనటులు:

విశాల్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం అందంగా.. స్టైల్ గా కనిపించాడు. స్టైలింగ్ అదీ బాగుంది. ఎప్పట్లాగే ఫైట్లు బాగా చేశాడు. నటన పరంగా అతడికి సవాలు విసిరే పాత్రేమీ కాదిది. క్యారెక్టర్ మరీ రొటీన్. తమన్నా జస్ట్ పాటల కోసమే సినిమాలో ఉన్నట్లుంది. నటన పరంగా ఆమెకు ఎలాంటి స్కోప్ లేదు. ఐతే తన అందచందాలతో తమన్నా అలరించింది. జగపతి బాబు పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. ఆయన ఉన్నంతలో తనవంతుగా సినిమాను నిలబెట్టడానికి కొంత ప్రయత్నం చేశారు. సూరి.. వడివేలుల గురించి చెప్పడానికేమీ లేదు. సంపత్.. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘ధృవ’తో ఆకట్టుకున్న హిప్ హాప్ తమిళ కంటెంటుకు తగ్గట్లే మ్యూజిక్ అన్నట్లుగా ఔట్ పుట్ ఇచ్చారు. పాటలు పర్వాలేదు. మ్యూజిక్ ఓకే అనిపించినా.. లిరిక్స్ క్యాచీగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. రిచర్డ్ నాథన్ ఛాయాగ్రహణం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఛేజ్ సీన్స్.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. సినిమా అంతటా విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సూరజ్.. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వచ్చిన అనేకానేక మాస్ మసాలా సినిమాలన్నింటినీ చూసి ఈ కథాకథనాల్ని తయారు చేసినట్లున్నాడు. ఎక్కడా కూడా కొత్తదనం లేదు. దర్శకుడి ముద్రా కనిపించలేదు.

చివరగా: ఒక్కడొచ్చాడు.. ‘రొటీన్’గా వాయించేస్తాడు

రేటింగ్- 2/5


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre