Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా సినిమాకు ఒమిక్రాన్ దెబ్బ‌

By:  Tupaki Desk   |   30 Dec 2021 6:30 AM GMT
పాన్ ఇండియా సినిమాకు ఒమిక్రాన్ దెబ్బ‌
X
పాన్ ఇండియా సినిమాల‌కు ఒమిక్రాన్ దెబ్బ‌..! భారీగానే త‌గ‌ల బోతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. కోవిడ్ దెబ్బ‌తో కుదేలైన సినీ ఇండ‌స్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేప‌థ్యంలో సెకండ్ వేవ్ కొంత భాయాందోళ‌న‌కు గురిచేసింది కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సినా సెకండ్ వేవ్ ప్ర‌కంప‌ణ‌ల నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. దాంతో కొంత మంది స్టార్లు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది.

అదే ప‌రిస్థితి మ‌ళ్లీ ఉత్ప‌న్నం కాబోతోందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇందుకు అద్దంప‌డుతున్నాయి. దేశ వ్యాప్తంగా స‌రికొత్త వైర‌స్ ఒమిక్రాన్ జ‌డ‌లు విప్పుతున్న వేళ ఈ సంక్రాంతి కి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల‌నుకున్న భారీ చిత్రాల‌కు అతి పెద్ద స‌వాల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో త‌ప్పితే మిగ‌తా ఏరియాల్లో చాలా చోట్ల ఒమిక్రాన్ దెబ్బ‌తో నైజ్ క‌ర్ఫ్యూలు, లాక్ డౌన్ ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. చాలా చోట్ల ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒమిక్రాన్ ఎఫెక్ట్ కార‌ణంగా నైట్ క‌ర్ఫ్యూలు విధించే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం తెలుగు సినిమాల‌కు ప్ర‌ధాన గండంగా మారింది.

తెలుగు నుంచి వ‌స్తున్న పాన్ ఇండియా చిత్రాలు `ఆర్ ఆర్ ఆర్‌`. రాధేశ్యామ్‌. ఇందులో ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా వున్న ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన ఈ చిత్ర బృందం ఈ మూవీని జ‌న‌వ‌రి 7న సంక్రాంతి ఫెస్టివెల్ కి ముందే పండ‌గ వాతావ‌ర‌ణాన్ని అందించ‌డానికి రెడీ అవుతోంది.

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన సినిమా కావ‌డం, ఇందులో బాలీవుడ్ స్టార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించ‌డం.. అంతే కాకుండా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరీస్ న‌టించ‌డంతో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్ప‌డింది. మ‌న దేశంలోనే కాకుండా ఇత‌ర దేశాల్లోనూ భారీ క్రేజ్ ని ద‌క్కించుకుంది. నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేసిన రాజ‌మౌళి వారం పాటు అక్క‌డే టీమ్ తో మ‌కాం వేసి మ‌రీ ప్రాచారం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదే సినిమాతో పాటు జ‌న‌వ‌రి 14న గ్లోబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` విడుద‌ల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం మ‌రో టైటానిక్ ప్రేమ‌క‌థ‌గా వుండ‌బోతోంద‌ని ట్రైల‌ర్ రుజువు చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా స‌క్సెస్ కావ‌డంతో ప్ర‌మోష‌న్స్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే రిలీజ్ కి రెడీగా వున్న ఈ రెండు చిత్రాల పాలిట విల‌న్ గా మార‌బోతోంది ఒమిక్రాన్‌.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప‌రిస్థితులు అదులోనే వున్నా కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు విధించ‌డంతో పాటు లాక్ డౌన్ ల‌కు అవ‌కాశాలు వుండ‌టంతో త‌మ సినిమాల విడుద‌ల‌ను వాయిదా వేయాల‌నే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే రాజ‌మౌళి మాత్రం `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ఎట్టిప‌రిస్థితుల్లో వాయిదా వేసేది లేద‌ని క్లారిటీ ఇచ్చేశార‌ని బాలీవుడ్ ట్రేడ్ ఎన‌లిస్ట్ అర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించ‌డంతో `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ఆగ‌ద‌ని తేలిపోయింది.

ఇక తేలాల్సింది `రాధేశ్యామ్‌` గురించే కాబ‌ట్టి యువీ సంస్థ నుంచి కూడా క్లారిటీ రావాల్సి వుంది. యువీ సంస్థ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోయినా `రాధేశ్యామ్‌` రిలీజ్ లో ఎలాంటి మార్పు వుండ‌ద‌ని తెలుస్తోంది. కార‌ణం ఇంకా ఒమిక్రాన్ ప్ర‌కంప‌ణ‌లు తీవ్ర స్థాయికి చేర‌లేదు కాబ‌ట్టి అంత ప్ర‌భావం ఏమీ వుండ‌క పోవ‌చ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల వాద‌న‌. దీంతో ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.