Begin typing your search above and press return to search.

ఆస్కార్ బరిలో తెలుగు లఘు చిత్రం..!

By:  Tupaki Desk   |   6 Dec 2021 5:30 PM GMT
ఆస్కార్ బరిలో తెలుగు లఘు చిత్రం..!
X
డిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ఆలోచనలతో వచ్చే యంగ్ స్టర్స్ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకొని లఘు చిత్రాలుగా మలిచి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక అంశాలను కథాంశాలుగా తీసుకొని రూపొందించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్, జాతీయ స్థాయిలో - అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అలాంటి వాటిలో ''మనసానమః'' షార్ట్ ఫిలిం కూడా ఒకటి.

గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి ''మనసానమః'' లఘు చిత్రాన్ని తెరకెక్కించాయి. విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన ఈ షార్ట్ ఫిలింలో ధృషిక చందర్ - శ్రీవల్లి రాఘవేందర్ - పృథ్వీ శర్మ కీలక పాత్రలు పోషించారు. గతేడాది యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం.. పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్ - బప్టా వంటి ప్రతిష్టాత్మక అవార్డులకు కూడా క్వాలిఫై అయ్యింది.

ఆస్కార్-2022 క్వాలిఫై లిస్టులో ఉన్న 'మనసానమః' కు డిసెంబర్ 10వ తేదీ నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు దీపక్ తోపాటు నటీనటులు విరాజ్ - దృషిక - సినిమాటోగ్రాఫర్ రాజ్ - సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'మనసానమః' చిత్ర విశేషాలను.. ఆస్కార్ పోటీలో ఎంపికవడం గురించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో మ్యూజికల్ గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్ లో తీయడం షూటింగ్ టైమ్ లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్ తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. 'మనసానమః' కు ఇంటర్నేషనల్ గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను'' అన్నారు.

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ''దీపక్ కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఎంటో తెలిసింది. గతేడాది లాక్ డౌన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో గౌతమ్ మీనన్ గారి ప్రెజెంట్స్ తో రిలీజ్ చేశారు. అలాగే కన్నడలో 'కేజీఎఫ్' కో ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నాం. ఆస్కార్  క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్ గా ఉన్నాం'' అని చెప్పారు.

హీరోయిన్ దృషిక మాట్లాడుతూ.. ''మనసానమః సినిమాకు ఇంత రెస్పాన్స్, ఇన్ని అవార్డ్స్ రావడం నమ్మలేకపోతున్నాను. నా మొదటి సినిమాకే ఇంతలా అప్రిషియేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు రాదు. యాక్టింగ్ కోర్సులు చేయలేదు. కానీ కథను బిలీవ్ చేసి నటించాము. ఈ షార్ట్ ఫిలింలో నటించడం నాకు నిజంగా ఛాలెంజింగ్ గా అనిపించింది'' అన్నారు.

'మనసానమః' లఘు చిత్రానికి అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపుకు సినిమాటోగ్రాఫర్ రాజ్ - సంగీత దర్శకుడు కమ్రాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆస్కార్ క్వాలిఫై అయి ఓటింగ్ లో తమ సినిమా విన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.