Begin typing your search above and press return to search.

బయ్యర్లందరూ ‘ఊపిరి’ పీల్చుకున్నట్లేనా?

By:  Tupaki Desk   |   13 May 2016 7:30 AM GMT
బయ్యర్లందరూ ‘ఊపిరి’ పీల్చుకున్నట్లేనా?
X
రెండేళ్ల కిందట నాగార్జున పరిస్థితి చూస్తే.. ఆయన కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లుగా కనిపించింది. ‘భాయ్’ సినిమా రిజల్ట్ చూస్తే.. ఇక ఆయన క్రేజ్ అంతా పోయినట్లే అని.. స్టార్ హీరో స్టేటస్ పక్కనబెట్టేయాల్సిందే అని అనుకున్నారు ఇండస్ట్రీ జనాలు. కానీ రెండేళ్లు తిరిగేసరికి టాలీవుడ్లో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో వరుసగా మూడు సూపర్ సక్సెస్‌ లు అందుకున్నాడు అక్కినేని కథానాయకుడు. 2014 సమ్మర్లో ‘మనం’తో మెమొరబుల్ హిట్ కొట్టి.. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్యే ‘ఊపిరి’తో మరో విజయాన్నందుకున్నాడు. చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన పాత్రలో సైతం తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తూ.. కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సక్సెస్ అందరిదీ అయినా.. మెజారిటీ షేర్ నాగ్ ఖాతాలోకే వెళ్లింది.

ఐతే భారీ బడ్జెట్ సినిమా కావడం వల్ల.. బయ్యర్లకు భారీ ధరలకు సినిమాను అమ్మడం వల్ల ఈ సినిమా వల్ల అందరూ సంతోషంగానే ఉన్నారా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. రూ.60 కోట్ల బడ్జెట్‌ తో సినిమా తీసిన పీవీపీ సంస్థ రెండు భాషల్లో కలిపి ఆ మేరకు బిజినెస్ కూడా చేసింది. ‘సోగ్గాడే..’ ఊపులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ రేట్లు పెట్టి సినిమాను కొన్నారు బయ్యర్లు. ఐతే దాదాపుగా అందరినీ గట్టెక్కించేసింది ఊపిరి. ఆంధ్రాలో అక్కడక్కడా స్వల్పంగా మాత్రమే నష్టాలు వచ్చాయి. నైజాంలో.. అమెరికాలో బయ్యర్లు మంచి లాభాలు అందుకున్నారు.

ఆంధ్రా-రాయలసీమలో కలిపి ఈ సినిమా రూ.14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నైజాం షేర్ రూ.7.5 కోట్లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.21.5 కోట్ల షేర్.. రూ.39 కోట్ల గ్రాస్ వసూలైంది. అమెరికాలో ‘ఊపిరి’ రూ.7 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో రూ.4.5 కోట్ల దాకా వచ్చాయి. మొత్తంగా తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ షేర్ రూ.34.5 కోట్లుగా తేలింది. తమిళ వెర్షన్ రూ.18.5 కోట్లు వసూలు చేసింది. రెండు భాషల్లో కలిపి ఈ సినిమా రూ.52.5 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ రూ.95 కోట్లు కావడం విశేషం.