Begin typing your search above and press return to search.

టీజర్: ఊరంతా అనుకునేలా

By:  Tupaki Desk   |   7 April 2019 3:54 PM GMT
టీజర్: ఊరంతా అనుకునేలా
X
ప్రేమకథలు అన్నిటికీ ఒకటే ఆత్మ. పెళ్లికి ముందు ప్రేమకథలు.. పెళ్లి తర్వాత ప్రేమకథలు.. పెళ్లి చూపుల్లో ప్రేమకథలు ఇలా రకరకాలుగా విభజించినా ప్రేమలో ఉండే ఆత్మ మాత్రం ఒక్కటే. ప్రేమికుల లక్షణాలు.. గుణగణాలు ఒకేలా ఉంటాయి. అందుకే ప్రేమకథా చిత్రం తీస్తున్నాం అనగానే ఫలానా సినిమాలా ఉన్నట్టుందే అనిపిస్తుంది. నటులు మారతారు.. నేపథ్యం మారుతుంది.. బ్యాక్ గ్రౌండ్ లో ప్రాపర్టీ మార్పు కనిపిస్తుంది. అంతే తప్ప ప్రేమికులు అక్కడే తిరుగుతుంటారు. వాళ్లను విడదీసే పెద్దలు యథావిధిగా మామూలుగానే కనిపిస్తుంటారు. తాజాగా రిలీజైన `ఊరంతా అనుకుంటున్నారు` టీజర్ లోనూ నవీన్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ లవ్ స్టోరీస్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.

పెళ్లి చూపులకని వెళితే.. నేను కూడా వేరొకరిని ప్రేమించానని చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లే అమ్మాయి (మేఘ).. అవునా అని ఆశ్చర్యపోయే అబ్బాయి (నవీన్ కృష్ణ) .. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మల్లూ బాబు(అవసరాల)తో ప్రేమకథను వర్ణించి చెప్పే కాబోయే పెళ్లి కూతురు.. అంతా బాగానే ఉంది. ఇందులో లవ్ అప్పియరెన్స్ కొత్తగా ఏం లేదు. కాకపోతే మలయాళీగా కనిపించే అవసరాల మాత్రం కొత్తగా అనిపించాడు. నవీన్ కృష్ణ చదువుకున్న కుర్రాడిలా పాత్రలో ఇమిడిపోయి కనిపిస్తున్నాడు. ఇక ఇందులో పెళ్లి చూపుల కోసం వచ్చిన నవీన్ కృష్ణకు కథ చెప్పే అమ్మాయి మేఘ చౌదరి ఆకట్టుకుంది. టీజర్ ఆద్యంతం ఫీల్ గుడ్ అనదగ్గ మ్యాటర్ కనిపిస్తోంది. పచ్చని పల్లె పట్టు వాతావరణం .. కాలువ పై ఆనకట్ట .. మండువా లోగిలిలో పెద్దరికం.. ఇవన్నీ తెలుగుదనం నింపాయి. టీజర్ చివరిలో రావు రమేష్ డైలాగ్ ఇంప్రెస్సివ్. ఒకే వార్తని ఒక్కో పేపర్లో ఒక్కోలా రాస్తారేంట్రా మన ఊరి తింగరితనం తెలిసి మనకోసమే ప్రింటింగ్ చేస్తున్న పేపర్ల ఇవి!! అంటూ మెరిపించాడు. ఇక పెళ్లి చూపులకు వెళితే ఫ్లాప్ బ్యాక్ లు చెప్పుకునే పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు కథలతో బోలెడన్ని సినిమాలొచ్చాయి. వాటన్నిటికంటే నావల్టీ పాయింట్ ఏంటి? అన్నదే ఈ సినిమాకి ఇంపార్టెంట్. బాలాజీ సనాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రౌ ఆస్కిర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

`నందిని నర్సింగ్ హోమ్` అనే చిత్రంతో సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ కృష్ణ మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో చాలా గ్యాప్ తీసుకుని వస్తున్నాడు. తనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా అతడికి నటించేందుకు అవకాశాల పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఈసారి హిట్టు అతడికి చాలా ఇంపార్టెంట్. ఆ హిట్టు ఈసారైనా దక్కుతుందా.. లేదా? అన్నది చూడాలి. ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్ క్యాచీగా ఉంది. ఏమని అనుకుంటున్నారో తెరపై చూడాల్సిందే.