Begin typing your search above and press return to search.

కోలీవుడ్ కి అమ్యూజ్ మెంట్ పార్క్ స‌రే కానీ!

By:  Tupaki Desk   |   10 Dec 2022 12:30 PM GMT
కోలీవుడ్ కి అమ్యూజ్ మెంట్ పార్క్ స‌రే కానీ!
X
గొప్ప‌లు చెప్పుకోడానికి బావుంటాయి.. కానీ వినేవాళ్ల‌కే కంప‌రం!! మేం అక్క‌డ అది చేశాం.. ఇక్క‌డ ఇది చేశాం!! అని చెబుతుంటే వినేవాళ్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. మొన్న వెట‌ర‌న్ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న `ఆర్గానిక్‌ మామ-హైబ్రిడ్‌ అల్లుడు` (నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ -మీనా జంట‌గా) ప్ర‌మోష‌న్స్ లో టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత‌లు అయిన కె.అచ్చిరెడ్డి సౌతిండియా చాంబ‌ర్ అధ్య‌క్షులు సి. కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఒక వ్యాఖ్య ఫిలింన‌గ‌ర్ లో విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

ఇంత‌కీ 50 సినిమాలు పైగా నిర్మించిన సీనియ‌ర్ నిర్మాత‌ అచ్చిరెడ్డి ఏమ‌న్నారు? అంటే... టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మంది దిగ్గజాలైన లీడర్స్ ను చూసింది. ప్రస్తుతం ఆ క్వాలిటీస్‌ ఉన్న వ్యక్తి అనుక్షణం ఇండస్ట్రీ బాగుండాలి అని నిస్వార్ధంగా కోరుకునే సి. కల్యాణ్‌ గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీగా.. సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులుగా భారతీయ సినిమాకు ఆయన ఎన్నో సేవలు అందించారు.

ఇండస్ట్రీకి ఏదో చేయాలనే ఆయన తపనకు రూపాన్నిస్తూ చెన్నైలో భారీస్థాయిలో ఓ అమ్యూజ్ మెంట్‌ పార్క్ ను తమిళనాడు ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్నారు. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణంగా మారుతుంది. ఆల్‌ ఇండియా ఫిలిం ఫెడరేషన్‌ వారి సహకారంతో ఒక ఫిలిం అవార్డ్స్ నిర్వ‌హ‌ణ‌కు రూపకల్పన చేస్తున్నారు సి. కల్యాణ్‌. ఆయ‌న‌ సహకారంతో చాలా చేయ‌బోతున్నాం`` అని అన్నారు.

ఎస్వీకే స‌హా సీనియ‌ర్లు ఉన్న ఈ వేదిక‌పై సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ కూడా ఉన్నారు. అయితే ఘ‌నాపాటీలంతా ఒకే వేదిక‌పై ఉండి కూడా టాలీవుడ్ డెవ‌ల‌ప్ మెంట్ గురించి కానీ.. ప‌రిశ్ర‌మ‌లో యువ‌త‌రం నైపుణ్యం పెంచేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి కానీ అస్స‌లు చ‌ర్చించ‌క‌పోవ‌డం శోచ‌నీయం. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చి ఇన్నేళ్లు అయినా ఇప్ప‌టివ‌ర‌కూ తాము నిర్మిస్తామ‌న్న‌ పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్ రానే లేదు. యానిమేష‌న్ హ‌బ్ లు ఫిలింహ‌బ్ లు పుట్టుక రానేలేదు. ఇండస్ట్రీ య‌థావిధిగానే ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. న‌వ‌త‌రంలో మెరిక‌ల్లాంటి వారు ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తున్నా వారికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డంలో ఈ సీనియ‌ర్లు అంతా విఫ‌ల‌మ‌వుతున్నార‌నడంలో సందేహాలు లేవ‌ని కూడా విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్షులు మంచు విష్ణు ఎన్నిక‌ల ముందు చెప్పిన గొప్ప‌ల‌ను కూడా చాలా మంది ఆర్టిస్టులు ప్ర‌స్థావిస్తున్నారు. తాను గెల‌వ‌గానే ఆర్టిస్టుల కోసం సొంతంగా నిధులు వెచ్చించి భారీ భ‌వంతిని నిర్మించి న‌టీన‌టుల‌కు గిఫ్టిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దానికి సంబంధించిన స‌రైన వివ‌రం ఏదీ బ‌య‌ట‌కు రాలేదు.

కోలీవుడ్ కి అమ్యూజ్ మెంట్ పార్క్ క‌ట్టామ‌ని చెబుతున్న పెద్ద‌లు దీనిని ప్ర‌శ్నించ‌లేదు. అంతేకాదు అక్క‌డా ఇక్క‌డా (ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో) జ‌రిగే డెవ‌ల‌ప్ మెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ తెలుగు చిత్ర‌సీమ‌లో జ‌ర‌గాల్సిన అభివృద్ధి గురించి ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. ప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల్లో పెద్ద‌లు అనుభ‌వ‌జ్ఞులు ఎంద‌రో ఉన్నా కానీ నేటిత‌రానికి దిశానిర్ధేశ‌నం చేసే విధంగా ఏదైనా పెద్ద స‌కార్యాన్ని మాత్రం త‌ల‌పెట్ట‌లేద‌న్న‌ది నిజం. ఇక తెలంగాణ నుంచి వ‌చ్చే యువ‌త‌రం ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల కోసం ఇప్ప‌టికీ వెంప‌ర్లాడుతూనే ఉన్నా వారికి అవ‌కాశాలు అంతంత మాత్ర‌మే. దీనికి కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తున్న‌ది ఏమిటో కూడా స‌ద‌రు సినీపెద్ద‌లు విశ్లేషించింది లేదు.

ప్ర‌శ్నించింది కూడా లేదు.. ప్ర‌భుత్వాల‌కు భ‌జంత్రీలు వాయించ‌డం త‌ప్ప పెద్ద‌లు చేసేదేంటో కూడా అర్థం కాద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 90ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర‌ను క‌లిగి ఉన్న టాలీవుడ్ ఇప్పుడు వ‌డి వ‌డిగా పాన్ ఇండియా స్థాయిలో స‌త్తా చాటుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పెద్ద‌ల ఆలోచ‌నా ధోర‌ణి మ‌రింత అద‌న‌పు వ‌న‌రుల‌ను పెంచే దిశ‌గా సాగాల‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ప్ర‌తి వేదిక‌పైనా వీలున్నంత మేర తెలుగు సినిమా ఉన్న‌తి గురించి ఏం చేయాలో చెప్పే పెద్ద‌లే చిత్ర‌సీమ‌కు ప్ర‌స్తుతం అవ‌స‌రం!! అని కామెంట్ చేస్తున్నారు. న‌వ‌త‌రం న‌టీన‌టుల‌కు అత్యుత్త‌మ శిక్ష‌ణ‌.. దిశానిర్ధేశ‌నంతో పాటు.. నేటిత‌రం యువ‌ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు ఇత‌ర శాఖ‌ల్లో ప్ర‌తిభావంతుల‌కు స‌రైన అవ‌గాహ‌ణా కార్య‌క్ర‌మాల‌ను పెంచ‌డానికి సినీపెద్ద‌లు ఒక ప్ర‌త్యేక సెల్ ని ఏర్పాటు చేయాల‌ని కూడా ప‌లువురు సూచిస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ సాంకేతికంగా ఎదిగేందుకు ఉన్న ఆస్కారాలేమిటో చ‌ర్చించాల‌ని కూడా సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.