Begin typing your search above and press return to search.

వివాదం విద్వేషం లేని సినిమాకే ఆస్కార్?

By:  Tupaki Desk   |   10 Sep 2022 1:30 AM GMT
వివాదం విద్వేషం లేని సినిమాకే ఆస్కార్?
X
ఆస్కార్ 2023 బ‌రిలో నిలిచే భార‌తీయ సినిమా ఏదీ? అంటే ఇప్ప‌టికే ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన పేరు ఆర్.ఆర్.ఆర్. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం భార‌త‌ స్వాతంత్య్ర స‌మ‌రయోధుల స్ఫూర్తిని ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. ఈ సినిమాని ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ పంథాలో రూపొందించినా కానీ అశేష ప్ర‌జాద‌రణ పొందింది. ఈ చిత్రంలో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లు బిగ్ స‌ర్ ప్రైజింగ్ గా నిలిచాయి. ఎంపిక చేసుకున్న క‌థాంశం ఉప‌యోగించిన టెక్నిక్ స‌హా ప్ర‌తిదీ ఉత్కంఠ‌ను రేకెత్తించాయి. కేవ‌లం భార‌త‌దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రం ప్ర‌ముఖుల‌ ప్ర‌శంస‌లు అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో విదేశీయులు విప‌రీతంగా ఆద‌రించారు.

అయితే ఈ సినిమాతో పాటు ఆస్కార్ బ‌రిలో నిలిచే మ‌రో సినిమా ఏది? అన్న ప్ర‌శ్న‌కు వివేక్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన `ది కాశ్మీర్ ఫైల్స్` వైపు కొన్ని వేళ్లు చూపించాయి. ఈ సంవత్సరంలో ఊహించని బ్లాక్ బస్టర్ మూవీ ఇది. బాలీవుడ్ లో భారీ చిత్రాలు ప‌రాజ‌యాలు పాల‌వుతుండ‌గా ఇది ఊర‌ట‌నిచ్చిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది రైట్ వింగ్ ఐడియాల‌జీ ఉన్న‌వాళ్లు దీనిని వ్యక్తిగతంగా ప్రచారం చేశారు. హాల్స్‌ను బుక్ చేసుకున్నారు. ప్రజలకు ఉచితంగా టిక్కెట్లు పంపిణీ చేశారు. ఇండియాస్ ఫిల్మ్ ఫెడరేషన్ (FFI) ఆస్కార్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సినిమాపై చ‌ర్చ‌కు తెర లేప‌గా.. సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలు ది కాశ్మీర్ ఫైల్స్ ఎంపికవుతుంద‌ని కూడా ఆశిస్తున్నారు.

ఇదే విష‌య‌మై ద‌ర్శ‌కుడిని ప్ర‌శ్నిస్తే స‌ర్ ప్రైజింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. మీరు `ది కాశ్మీర్ ఫైల్స్` కోసం ఆస్కార్ నామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా.. అతను తన భుజాలు తట్టి ``నాకు తెలియదు. ఇది జ్యూరీకి సంబంధించినది. వారు నిర్ణయించుకోవాలి`` అని అన్నారు. నేను ప్రస్తుతం గోవాలో ఉన్నాను. నా తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నాను. కాబట్టి నిజాయితీగా.. దేనికీ నేను బాధపడటం లేదు`` అని వెల్ల‌డించారు. ఈ స‌మాధానాన్ని బ‌ట్టి త‌న‌కు ఆస్కార్ పై ఆశ‌లు లేవ‌ని అర్థ‌మ‌వుతోంది. త‌న దృష్టి అంతా త‌దుప‌రి సినిమాపైనే. `ది ఢిల్లీ ఫైల్స్` పేరుతో సినిమా తీసేందుకు ప్ర‌స్తుతం అత‌డు ప్లాన్ చేస్తున్నారు. వ్యాక్సిన్స్ నేప‌థ్యంలో మ‌రో సంచ‌ల‌న క‌థాంశాన్ని అత‌డు ఎంపిక చేసుకున్నార‌ని స‌మాచారం.

అయినా చాలామంది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కి వెళ్లాల‌ని కోరుకుంటున్నారు. ఇంత‌కీ ఆస్కార్ లో ప్ర‌భావం చూపే సినిమా ఏదీ? అంటే.. ఆర్.ఆర్.ఆర్ ఇండియా విభాగం నుంచి పోటీబ‌రిలో గొప్ప ప్ర‌భావం చూప‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. మరోవైపు అగ్నిహోత్రి `కాశ్మీర్ ఫైల్స్` ఒక నిర్దిష్ట సమాజంపై ద్వేషం పెంచిన చిత్రంగా క‌నిపించ‌డంతో దానిని ఆస్కార్ జూరీ ప‌రిగ‌ణిస్తుందా? అన్న‌ది సందిగ్ధంగా మారింది. వివాదం విద్వేషం లేని సినిమాల‌కు మాత్ర‌మే ప‌ట్టంగ‌ట్టేందుకు ఆస్కారం ఉంది. పైగా రియ‌ల్ స్టోరీ క‌నెక్టివిటీతో తెర‌కెక్కించిన ఫిక్ష‌న‌ల్ మూవీగా ఆర్.ఆర్.ఆర్ కి గొప్ప ఇమేజ్ ఉంది. అది ఆస్కార్ జూరీ దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. ల‌గాన్ స‌హా ఎన్నో సినిమాలు భార‌త‌దేశం నుంచి ఆస్కార్ బ‌రిలోకి వెళ్లాయి. కానీ ఇంత‌వ‌ర‌కూ సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితం ద‌క్క‌లేదు.

ముంబై మురికివాడ‌ల నేప‌థ్యంలో క‌థాంశాన్ని ఎంచుకుని ఒక విదేశీ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` కి ఆస్కార్ ద‌క్కింది. మ‌న ద‌క్షిణాదికి చెందిన ప్ర‌తిభావంతుడు ఏ.ఆర్. రెహ‌మాన్ ఆస్కార్ ల పంట పండించుకున్నారు. అదొక్క‌టే మ‌న‌కు సంతృప్తి. ఇప్పుడు భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ ద‌క్కుతుందా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.