Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' కు ఓటీటీ ఆఫర్ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   5 Aug 2021 3:45 PM GMT
టక్ జగదీష్ కు ఓటీటీ ఆఫర్ ఎంతంటే..?
X
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''టక్‌ జగదీష్''. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్ మూడో వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఇప్పుడు థియేటర్స్ తెరుచుకుంటున్నా ఈ సినిమా విడుదలపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో నాని చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. చిత్ర బృందం ఆ వార్తలను ఖండించింది. అయితే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చల ప్రకారం 'టక్ జగదీష్' చిత్రాన్ని డిజిటల్ వేదికలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

'టక్ జగదీష్' చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాని 'వి' సినిమాని ఓటీటీలో విడుదల చేయగా.. ఈసారి ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని భావించారు. అయితే ఇప్పుడు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ రావడంతో థియేట్రికల్ స్కిప్ చేసి డిజిటల్ విడుదలకే మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ఫైనల్ స్టేజిలో ఉందని అంటున్నారు. దీని కోసం ప్రైమ్ వారు 37 - 40 కోట్ల మధ్య చెల్లిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదే కనుక నిజమైతే 'టక్ జగదీష్' సినిమా డబ్బింగ్ రైట్స్ - ఆడియో - శాటిలైట్ హక్కులు అన్నీ కలుపుకుని దాదాపు 50 - 55 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని టాక్. కరోనా పరిస్థితుల్లో ఇది భారీ డీల్ అనే అనుకోవాలి. నాని సినిమా ఓటీటీ ఆఫర్ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా, 'టక్ జగదీష్' చిత్రంలో రీతూవర్మ - ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్ లుగా నటించారు. ఇందులో జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘నిన్నుకోరి’ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న 'టక్ జగదీష్' సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.