Begin typing your search above and press return to search.

‘అమెజాన్’ వడ్డింపు మొదలు.. అదే బాటలో మిగిలిన ఓటీటీలు

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:58 AM GMT
‘అమెజాన్’ వడ్డింపు మొదలు.. అదే బాటలో మిగిలిన ఓటీటీలు
X
కార్పొరేట్ కు.. ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న తేడా గురించి ఎంత చెప్పినా ఏదో తేడా కొడుతున్నట్లుగా ఉంటుంది. కానీ.. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రంచాలా బాగా అర్థమవుతుంది. కార్పొరేట్ లో మొదట ఉచితంతో మొదలు పెట్టి.. బాగా అలవాటైన తర్వాత ముక్కుపిండి వసూలు చేయటం ఒక అలవాటన్న సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఇదే బాటలోకి పయనిస్తుందన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి కారణం తాజాగా దాని చందా ధరల్ని భారీగా పెంచేయటమే. దేశ ప్రజలకు ఓటీటీలు అలవాటు లేనప్పుడు.. ఆ అనుభూతిని పరిచయం చేసే వేళలో చౌక ధరలతో అలవాటు చేసి.. తాజాగా ఒక్కసారిగా యాభై శాతానికి చందాధరను పెంచేయటం గమనార్హం.

మామూలుగా అయితే.. ఓటీటీ ఫ్లాట్ ఫాం అలవాటు కావటానికి భారత ప్రజలకు కాస్త ఎక్కువ సమయమే పట్టేది.

తెలుగు ప్రజలకు అంత త్వరగా ఎక్కేది కాదు. కానీ.. ఎప్పుడైతే కరోనా.. దాని వెంట వచ్చిన లాక్ డౌన్ దెబ్బకు.. ఏమీ తోచని జనాలకు ఓటీటీ వినోదం రుచి పరిచయం కావటమే కాదు.. ఇప్పుడో అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు ఒకటో రెండో.. ఓటీటీలకు చందాదారులుగా ఉండే దానికి బదులుగా.. ఇప్పుడు పలు ఓటీటీలకు చందాదారులుగా మారిపోయారు. దీనికి తోడు.. ఒక చందాదారుడు.. మూడు.. నాలుగు కనెక్షన్లకు యాడ్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఓటీటీల జోరు ఎక్కువైంది.

ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే తన చందా ధరల్ని భారీగా పెంచేస్తూ తాజాగా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఏడాదికి రూ.999 ఉన్న చందాను ఏకంగా రూ.1499కు పెంచేశారు. నెలవారీ చందాను రూ.129 నుంచి రూ.179కు చేయటం గమనార్హం. మూడు నెలల చందాను రూ.329 నుంచి రూ.459కు పెంచారు. పెంచిన ధరల్ని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న విషయాన్ని అమెజాన్ స్పష్టం చేయలేదు. ఈ మధ్యనే డిస్నీ హాట్ స్టార్ తమ చందా ధరను పెంచటం తెలిసిందే. అంతకు ముందు ఉన్న రూ.399 స్థానే.. దాన్ని రూ.499కు పెంచేయటం తెలిసిందే. తాజాగా అమెజాన్ వంతు వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫాంలు కూడా అమెజాన్ బాట పట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. అలవాటు చేయటం.. ఆ తర్వాత ముక్కు పిండి వసూలు చేయటం అలవాటే. ఆ విషయం మరోసారి రుజువైందని చెప్పాలి.