Begin typing your search above and press return to search.

ఓటీటీల అత్యుత్సాహం అస‌లుకే..

By:  Tupaki Desk   |   19 May 2022 6:32 AM GMT
ఓటీటీల అత్యుత్సాహం అస‌లుకే..
X
ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ఓటీటీ పెద్దగా ప‌రిచ‌యం లేదు. క‌రోనా ముందు వ‌ర‌కు మ‌న వాళ్లు ఓటీటీల‌ని పెద్ద‌గా ప్రోత్స‌హించిందీ లేదు. వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కూడా. అయితే క‌రోనా కార‌ణంగా ఒక్క‌సారిగా సీన్ మారింది. నెల‌ల కొద్దీ అంతా ఇంటి ప‌ట్టునే వుండ‌టంతో వినోదం కోసం టీవిని ఆశ్ర‌యించారు. అదీ బోర్ కొట్ట‌డంతో ఓటీటీల బాట ప‌ట్టారు. ఓ ర‌కంగా భారీ స్థాయిలో వీటికి ఎట్రాక్ట్ అయ్యారు కూడా. క‌రోనా దెబ్బతో ఓటీటీల‌కు ఆదాయం పెరిగింది. స‌బ్స్ స్క్రైబ‌ర్స్ కూడా రికార్డు స్థాయిలో న‌మోద‌య్యారు.

అంత వ‌ర‌కు బాగానే వుంది. అల‌వాటు ప‌డ్డారు క‌దా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు తాజాగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నాయి. స‌బ్స్ స్క్రిప్ష‌న్ తో పాటు అద‌నంగా న‌చ్చిన క్రేజీ సినిమా చూడాలంటే డ‌బ్బులు క‌ట్టాల్సిందే అంటూ కొత్త నాట‌కం మొద‌లు పెట్టాయి. ఇదే ఇప్ప‌డు ప్రేక్ష‌కుల‌ని తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ క్రేజీ సినిమా చూడాలంటే అద‌నంగా డ‌బ్బులు చెల్లించాల్సిందే అంటూ వినియోగ‌దారుల‌ని అడ్డంగా బుక్ చేయ‌డం మొద‌లు పెట్టాయి.

ఇటీవ‌ల పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన 'ట్రిపుల్ ఆర్‌', కేజీఎఫ్ 2 చిత్రాల స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్‌, జీ5 సంస్థ‌లు ఈ సినిమాల‌తో పే ప‌ర్ వ్యూ అనే కొత్త విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చాయి. ఇదే ఇప్ప‌డు నెటిజ‌న్ ల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తోంది. ఏడాదికి రూ.699 స‌బ్స్ స్క్రిప్ష‌న్ క‌ట్టించుకుంటున్న జీ5 త‌న ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పాన్ ఇండియా క్రేజీ మూవీ ట్రిపుల్ ఆర్ ని చూడాలంటే మ‌రింత మొత్తం చెల్లించాల్సిందే అంటూ షాకిచ్చింది. ఇదే త‌ర‌హాలో ఏడాదికి రూ .14499 రూపాయ‌లు క‌ట్టించుకుంటున్న అమెజాన్ ప్రైమ్ అదీ చాల‌ద‌న్న‌ట్టు 'కేజీఎఫ్ 2' కోసం రూ. 199 క‌ట్టాల్సిందే అంటూ ప్ర‌క‌టించింది.

ఈ రెండు ఓటీటీల్లో స‌బ్స్ స్క్రిప్ష‌న్ క‌ట్టిన కోట్ల మంది నెటిజ‌న్ లు 'కేజీఎఫ్ 2', ట్రిపుల్ ఆర్ ల కోసం అద‌నంగా వ‌సూలు చేస్తుండ‌టంతో నెటిజ‌న్ లు ఈ రెండు ఒటీటీ దిగ్గ‌జాల‌కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక‌పై ఈ రెండు ఓటీటీల్లో స‌బ్స్ స్క్రిప్ష‌న్ చేసుకోమంటూ హెచ్చ‌రిస్తూ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజీలో ట్యాగ్ చేస్తూ దారుణంగా కామెంట్ లు పెడుతున్నారు.

అయితే ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అత్యాశ‌కు పోయి ప్ర‌వేశ పెట్టిన పే ప‌ర్ వ్యూ ఫార్ములా దారుణంగా బెడిసికొట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ రెండు ప్ర‌నవేశ పెట్టిన కొత్త విధానానికి గండి కొడుతూ నెటిజ‌న్ లు ఈ క్రేజీ చిత్రాల‌ని ఫ్రీగా పైర‌సీ చేస్తూ హెచ్ డీ ప్రింట్ ల‌ని ఫ్రీగా డౌలోడ్ చేసుకుంటున్నార‌ట‌. దీంతో ఓటీటీ వ‌ర్గాలు అత్యాశ‌కు పోయి ఇరుక్కుపోయామా? అని మ‌ద‌న‌ప‌డుతున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ మారింది. అర‌చేతిలోకి ప్ర‌పంచం స్మార్ట్ ఫోన్ రూపంలో రావ‌డంతో ప్ర‌తీదీ ఈజీ అయిపోయింది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కూడా క్ష‌ణాల్లోనే టొరెంట్ ల‌లో దొరికిపోతున్నాయి. దీంతో భారీ ఖ‌ర్చు చేసి ఓటీటీల్లో సినిమాలు చూడాల‌ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఎందుకు అనుకుంటాడు. ఇప్ప‌టికైనా జ‌రిగిన త‌ప్పిదాన్ని ఓటీటీలు గ్ర‌హించి వున్న స‌బ్స్ స్క్రిప్ష‌న్ ని స‌భ్యుల‌ని కాపాడుకుంటే మంచిది.