Begin typing your search above and press return to search.

ఓటీటీ రివ్యూ: తమన్నా ''11త్ అవ‌ర్'' సిరీస్ 'ఆహా' అనిపించిందా..?

By:  Tupaki Desk   |   10 April 2021 9:45 AM GMT
ఓటీటీ రివ్యూ: తమన్నా 11త్ అవ‌ర్ సిరీస్ ఆహా అనిపించిందా..?
X
ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని వీక్షకులకు అందిస్తూ ఆదరణ పొందుతున్న మొట్టమొదటి 100% తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ''ఆహా''.. ఇప్పుడు ''11త్ అవ‌ర్'' అనే అతి పెద్ద ఒరిజినల్ సిరీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ తో స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ సిరీస్ టీజర్ - ట్రైలర్ తోనే ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న '11త్ అవ‌ర్' సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

పురుషాధిక్య కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ మహిళా సీఈఓ తన కంపెనీని ఎలా కాపాడుకొంది అన్న ఇతివృత్తంతో ఈ '11త్ అవ‌ర్' ఒరిజినల్ సిరీస్ రూపొందింది. ఈ కథంతా ఒక రాత్రిలో జరుగుతుంది. ఓ హోటల్‌ లో రాత్రి 11 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు జరిగే పరిణామాలను చూపిస్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అరత్రికా రెడ్డి(తమన్నా) బ్యాంకుకి ఒక్క రాత్రిలో పదివేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆమె ఎలా డబ్బులు చెల్లించింది? తన కంపెనీని ఎలా కాపాడుకుంటుంది? దీని కోసం ఆమె ఎలాంటి మార్గాలను ఎంచుకుంది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.

'8 అవర్స్‌' అనే బుక్‌ ఆధారంగా చేసుకుని రైటర్‌ ప్రదీప్‌ ఉప్పలపాటి ఈ 'లెవన్త్‌ అవర్‌' కథను రాసుకున్నారు. ఈ కథ మహిళా ప్రాధాన్యత గురించి చెబుతున్నప్పటికీ ఎక్కడా మగవాళ్లను తక్కువ చేయకుండా చూపించారు. ఇందులో బిజినెస్ విమెన్ అరత్రికా రెడ్డి పాత్రలో తమన్నా పెర్ఫామెన్స్‌ కు మంచి మార్కులు పడ్డాయి. ఒక వైపు డైలాగ్స్‌, మరో వైపు ఎమోషన్స్‌ తో ఆమె పాత్రలో కనిపిస్తుంటాయి. అలానే అరుణ్ ఆదిత్ - వంశీ కృష్ణ - రోషిణి ప్రకాష్ - జయప్రకాష్ - శత్రు - మధుసూదన్ రావు - పవిత్ర లోకేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ నటనతో మెప్పించారు.

'11త్ అవ‌ర్' సిరీస్ ఉన్నతమైన నిర్మాణ విలువలతో రూపొందింది. దీనికి సినిమాటోగ్రఫీ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు పనితనం వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. అయితే అనవసర డ్రామా ఎక్కువ కావడం.. అక్కడక్కగా నెమ్మదిగా సాగే కథనం ఈ సిరీస్ లో మైనస్ గా చెప్పవచ్చు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగా చేయాల్సి ఉంది. మొత్తం మీద తమన్నా 'నవంబర్ స్టోరీస్' తర్వాత నటించిన ఈ ఒరిజినల్ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే '11త్ అవ‌ర్' సిరీస్ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.