Begin typing your search above and press return to search.

ఓటీటీలు 'ఓవర్ ది టాప్' అంతే...!

By:  Tupaki Desk   |   24 Oct 2020 3:30 AM GMT
ఓటీటీలు ఓవర్ ది టాప్ అంతే...!
X
ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'ఓటీటీ'.. అంటే 'ఓవర్ ది టాప్'. ఇండియాలో ఓటీటీల హవా ఇప్పుడిప్పుడే మొదలైందని చెప్పవచ్చు. కరోనా కారణంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. ఇన్నాళ్ళూ ఇండియన్ సినిమాకు థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగా ఎలాంటి లోటూ ఉండకపోవడంతో అటువైపు చూడాల్సిన అవసరం రాలేదు. అయితే గత ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఓటీటీలు విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన జనాలు ఎంటెర్టైన్మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయించారు. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో వచ్చే కంటెంట్ ని చూడటం అలవాటు చేసుకున్నారు. అందులోనూ థియేటర్స్ మూతబడి ఉండటంతో కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్స్క్రైబర్స్ ని వ్యూయర్ షిప్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు.

వీక్షకులకు ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - స‌న్ నెక్ట్స్ - ఎమెక్స్ ప్లేయర్ - జీ 5 - ఆల్ట్ బాలాజీ - ఊట్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలుగు కంటెంట్ ని స్ట్రీమింగ్ చేస్తూ 'ఆహా' ఓటీటీ కూడా ఆదరణ దక్కించుకుంది. అయితే రాబోయే రోజుల్లో ఇండియాలో పేరుకు తగ్గట్టే ఓటీటీలు ఓవర్ ది టాప్ గా నిలవనున్నాయని ఓ సర్వే వెల్లడించింది. భవిష్యత్ లో వ్యూయర్ షిప్ పెంచుకుని ఓటీటీలకు ఇండియా అతి పెద్ద మార్కెట్‌ కానుందని తెలుస్తోంది. పీడబ్ల్యూసీ ఇండియా అంచనా ప్రకారం 2024 నాటికి ఇండియా అత్యధిక ఓటీటీ వీక్షకులున్న దేశంగా అవతరించనుంది. గతేడాది వీడియో ఆన్ డిమాండ్ ద్వారా 700 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.5200 కోట్లు ఆదాయం రాగా.. 2024 నాటికి ఈ మొత్తం 2.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20 వేల కోట్లు) చేరబోతోందని అంచనా వేశారు. ఇండియాలో మీడియా మరియు ఎంటెర్టైన్మెంట్ రంగం వాటా మరో నాలుగేళ్లలో 54 బిలియన్ డాలర్లలు చేరబోతుండగా.. అందులో ఓటీటీ విభాగం వాటా 5.2 శాతం ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది.