Begin typing your search above and press return to search.

దీపావళి పండుగను 'సినిమా పండుగ'గా మారుస్తున్న ఓటీటీలు..!

By:  Tupaki Desk   |   31 Oct 2020 1:00 PM GMT
దీపావళి పండుగను సినిమా పండుగగా మారుస్తున్న ఓటీటీలు..!
X
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో బొమ్మ పడకుండానే ఎనిమిది నెలలు గడిచిపోయింది. లాక్ డౌన్ వల్ల మూతపడిపోయిన థియేటర్స్ - మల్టీప్లెక్సెస్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరుచుకోమని సూచించింది. అయినా సరే థియేటర్స్ ఓపెన్ చేయడానికి.. సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో దీపావళికి థియేటర్స్ తెరుస్తారని భావించినప్పటికీ డిసెంబర్ నెల వరకు కుదరకపోవచ్చని పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది. ఇదే క్రమంలో ఓటీటీలు సత్తా చాటుతున్నాయి. కొత్త కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన సినిమా చూసే వెసులుబాటు ఉండటంతో వీక్షకులు ఓటీటీలకు ఓటేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ నెలలో ఓటీటీలలో స్ట్రీమింగ్ కి పెడుతున్న క్రేజీ మూవీస్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

నవంబర్ 4న మహానటి కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మిస్‌ ఇండియా' చిత్రాన్ని నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదల చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చిన్నతనం నుంచి వ్యాపార రంగంలో రాణించాలని కలలు కంటూ.. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. నవీన్ చంద్ర - జగపతి బాబు - రాజేంద్ర ప్రసాద్ - సీనియర్ నరేష్ - నదియా - కమల్ కామరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదాపడి ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది.

దీపావళి కానుకగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన కామెడీ చిత్రం హార్రర్ 'లక్ష్మీ' నవంబరు 9న డిస్నీ+హాట్‌ స్టార్‌ లో విడుదల కానుంది. రాఘవ లారెన్స్ - శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ''కాంచన'' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. 'లక్ష్మీ' చిత్రానికి కూడా రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. భూతాలు దెయ్యాలకు భయపడే ఓ యువకుడికి అనుకోకుండా దెయ్యం పట్టుకుంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌ తో కామెడీ - హారర్ కి సందేశాన్ని జతచేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్ - ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్ - షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ - తుషార్‌ ఎంటర్‌టైన్‌ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

నవంబరు 12న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కానుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యం అందించడానికి ఓ గ్రామానికి చెందిన యువకుడు కనే అసాధ్యమైన కలే ఈ చిత్రం. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ గునీత్ మోంగా మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి - కరుణాస్ - వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

నవంబర్ 12న హిందీ మూవీ 'లూడో' నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదల కానుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ అభిషేక్‌ బచ్చన్‌ - రాజ్‌ కుమార్‌ రావు - పంకజ్‌ త్రిపాఠి - ఆదిత్యా రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అనురాగ్‌ బసు దర్శకత్వం వహించారు. నాలుగు కోణాల్లో సాగే నాలుగు విభిన్నమైన కథలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. నవంబరు 13న రాజ్‌ కుమార్‌ రావ్‌ - నుస్రత్ బరుచా ప్రధాన పాత్రల్లో నటించిన 'ఛాలంగ్‌' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదలకానుంది. స్పోర్ట్స్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హన్సల్‌ మెహతా తెరకెక్కించారు. ఇదే క్రమంలో నవంబరు 13న పాయల్‌ రాజ్‌ పుత్ - చైతన్య కృష్ణ నటించిన 'అనగనగా ఓ అతిథి' సినిమా 'ఆహా' లో విడుదల కాబోతోంది. ఈ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ కి కన్నడ దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించారు.

దీపావళి సందర్భంగా నవంబర్ 14న సిద్ధు జొన్నలగడ్డ - సీరత్‌ కపూర్‌ జంటగా నటించిన 'మా వింత గాధ వినుమా' సినిమా 'ఆహా' లో విడుదల కానుంది. ఆదిత్య మండ‌ల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. నయనతార అమ్మవారి పాత్రలో నటించిన 'అమ్మోరు తల్లి' సినిమా నవంబరు 14న డిస్నీ+హాట్‌ స్టార్‌ లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి తమిళ నటుడు ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వం వహించారు. 'అంధకారం' అనే సినిమా నవంబరు 24న నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదల కాబోతోంది. అలానే సైకో థ్రిల్లర్‌ గా రూపొందిన 'గతం' సినిమా నవంబరు 6న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఇలా రకరకాల సినిమాలను అందుబాటులో ఉంచుతూ ఈ నవంబర్ నెల మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఓటీటీలు రెడీగా ఉన్నాయి.