Begin typing your search above and press return to search.

మన ఇళ్లు.. మన థియేటర్.. కొత్త ట్రెండ్..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 12:30 AM GMT
మన ఇళ్లు.. మన థియేటర్.. కొత్త ట్రెండ్..!
X
మనిషి జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో.. అంతే స్థాయిలో వినోదం కూడా అవసరం. ఈ రెండింటిలో ఏది తగ్గినా ఆ వ్యక్తి జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ మాత్రం రాకమానదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వినోదానికి కేటాయించే సమయం కూడా తగ్గిపోతుంది.

అయితే వినోదం అనేది ప్రస్తుతం రకరకాల రూపాల్లోకి మారుతుంది. ఒకప్పుడు వినోదం అంటే సినిమాలు.. ఫ్రెండ్స్ తో షికార్లు.. ఆటలు.. పాటలు అంతే. ఎప్పుడైతే ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చిందో పైవన్నీ దాదాపు గా కట్ అయిపోయింది. అంతా మొబైల్.. డెస్క్ టాప్ లకు అతుక్కుపోతున్నారు.

కరోనా ఎంట్రీ ఇచ్చాక సినిమా థియేటర్ వెళ్లడం గగనమైపోయింది. నలుగురు కలిసి సినిమాలు.. షికార్లు అనే ముచ్చటే లేదు. అంతా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. కరోనా పరిస్థితులు తగ్గాక సైతం సినీ ప్రియులు థియేటర్లకు రావడానికి మునుపటిలా ఆసక్తి చూపించడం లేదని ఇటీవల విడుదలైన సినిమాలకు వస్తున్న టాక్ ను చూస్తే అర్థమవుతుంది.

ప్రేక్షకులు కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు.. హిట్ టాక్ తెచ్చకున్న సినిమాలను చూసేందుకే థియేటర్ కు వస్తున్నారు. అయితే కొన్నినెలులుగా పట్టణాలు.. గ్రామాల్లోని ఇళ్లన్నీ కూడా మిని థియేటర్లుగా మారిపోతున్నాయి. ఇది క్రమంగా వ్యాపిస్తుండటంతో మన ఇల్లు.. మన థియేటర్ కాన్సెప్ట్ ట్రెండ్ గా మారిందా? అన్న చర్చ తాజాగా జోరుగా నడుస్తోంది.

నిర్మల్ జిల్లాలో 150 ఇళ్లు మినీ థియేటర్లుగా ముస్తాబయ్యాయి. వీటిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌండ్ సిస్టం.. నవీకరించిన తెరలు.. మిరుమిట్లు గొలుపే లైటింగ్ సిస్టమ్స్ వంటి సదుపాయాలు మల్టిప్లెక్స్ థియేటర్లను తలపిస్తున్నాయి. కొన్నాళ్లుగా థియేటర్లకు దూరంగా ఉంటున్న వారంతా హోం థియేటర్ల సంస్కృతికి బాగా అలవాటు పడుతున్నారు.

ఓటీటీల్లో సినిమాలు చూసే వారంతా ఇంటినే మినీ థియేటర్ గా మారుస్తున్నారు. మరికొందరు ఈ కాన్సెప్ట్ ను బిజినెస్ గా మారుస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక గదిలో మినీ థియేటర్ ను ఏర్పాటు చేయడంతోపాటుగా లైబ్రరీ.. మెడిటేషన్.. డైనింగ్ హాల్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

వీటిని పెళ్లిళ్లు.. శుభకార్యాల వీడియోలు తీయడానికి.. ఆన్ లైన్ పాఠాలు.. యూట్యూబ్ వీడియోలను చిత్రీకరించేందుకు అద్దెకు ఇస్తున్నారు. దీని వల్ల అటూ ఆదాయంతో పాటుగా ఇంటిల్లిపాది ఇంట్లో ఎంచక్క థియేటర్లో సినిమా చూసిన ఆనందాన్ని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రెండ్ ఎంత కాలం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.