Begin typing your search above and press return to search.

ఓవ‌ర్ టు టాలీవుడ్ : సాంబారు క‌థ‌లా ఇవి ! కాదు క‌దా!

By:  Tupaki Desk   |   20 April 2022 9:32 AM GMT
ఓవ‌ర్ టు టాలీవుడ్ : సాంబారు క‌థ‌లా ఇవి ! కాదు క‌దా!
X
తెలుగు చిత్ర సీమ‌ను చూసి నేర్చుకోవాల‌ని భార‌తీయ సినీ దిగ్గ‌జాలుగా పేరొందిన చాలా మంది అంటున్నారు. ప్ర‌స్తుతం నెల‌కొని ఉన్న మూవీ ట్రెండ్ ను త‌మ‌దైన రీతిలో నిర్వ‌చిస్తున్నారు. విశ్లేషిస్తున్నారు కూడా ! అస‌లు సిస‌లు వ్యాపార సూత్రాలు లేదా పాఠాలు అన్న‌వి ఇక్క‌డి నుంచే పుట్టుకు వ‌స్తున్నాయి అని, అవి యావ‌త్ ప్ర‌పంచ సినిమా వ్యాపారాన్నే శాసిస్తున్నాయ‌ని నిపుణులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఆ విధంగా మన సినిమా ఇప్పుడు రిఫ‌రెన్స్ కోడ్ అయింది.కోలీవుడ్ కు కూడా ఇదే ల్యాండ్ మార్క్ కానుంది. త‌మిళ తంబీలు మ‌న నుంచి నేర్చుకోవాల‌ని త‌పిస్తున్నారు.

ఒక‌ప్పటి త‌మిళ సినిమాకూ, ఇవాళ్టి త‌మిళ సినిమాకూ ఎంతో తేడా ఉంద‌ని భార‌తీ రాజా లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు సైతం అభిప్రాయ‌పడుతున్నారు. ఇప్ప‌టి త‌మిళ సినిమా తీరు బాలేద‌న్న అసంతృప్తి కూడా వేదిక‌ల‌పై బాహాటంగానే వెల్ల‌డి చేస్తూ, మన తెలుగు సినిమాలను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ ఇక్క‌డి నుంచి నేర్చుకోండి అని దిశ‌ను నిర్దేశం చేస్తుండ‌డం గ‌ర్వించద‌గ్గ ప‌రిణామం.

ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌ల‌యిన ట్రిపుల్ ఆర్ కానీ అంత‌కుమునుపు విడుద‌ల‌యి సంచల‌నాల‌ను న‌మోదు చేసిన పుష్ప కానీ సీజ‌న్ తో సంబంధం లేకుండా విజ‌యాలు న‌మోదు చేసిన చిత్రాలే ! క‌థా ప‌రంగా క‌థ‌న ప‌రంగా కొన్ని త‌ప్పిదాలు ఉన్నా కూడా ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ ప‌రంగా కానీ లేదా కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కానీ మ‌న మేకింగ్ టాలెంట్ ను చూసి అబ్బుర‌ప‌డుతున్నారు పొరుగున ఉన్న త‌మిళ తంబీలు.

ఇటీవ‌లే అక్క‌డ ఓ టాక్ న‌డుస్తోంది కూడా ! నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించి తీసే సినిమాకు సంబంధించి క‌థ ప‌రంగా మ‌నం వెచ్చిస్తుంది ఎంత ప‌ది కోట్లు కూడా కాదు అని, దీనిపై పున‌రాలోచించుకుని నాణ్య‌మైన సినిమాల రూప‌క‌ల్ప‌నకు అంతా ఏక‌తాటిపై నిలిచి కృషి చేయాల‌ని ఇటీవ‌ల అక్క‌డి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ ప్ర‌ముఖుడు కామెంట్లు చేశారు. వీటిని సైతం భార‌తీ రాజా స‌మ‌ర్థించారు.

అదే క్ర‌మంలో త‌మిళ సినిమాలో వైవిధ్యం లోపిస్తుంద‌ని కూడా అన్నారు. ఒకనాటి బాలీవుడ్ ను ఊపేసిన మాస్ ట్రెండ్స్ ను ఇప్పుడు టాలీవుడ్ మ‌ళ్లీ, మ‌ళ్లీ తెరపైకి తెస్తూ క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంద‌ని ఇత‌ర భాష‌లకు చెందిన సినీ ప్ర‌ముఖులు కూడా మ‌న ద‌ర్శ‌కులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్క‌డి వారి ప్ర‌తిభ‌ను ఎంత‌గానో మెచ్చుకుంటున్నారు.