Begin typing your search above and press return to search.

త్రివిక్రమే మళ్లీ ప్రాణం పోయాలి..

By:  Tupaki Desk   |   30 May 2016 11:30 AM GMT
త్రివిక్రమే మళ్లీ ప్రాణం పోయాలి..
X
అమెరికాలో రిలీజవ్వడమే గొప్ప అనుకునే స్థితి నుంచి ఏకంగా 50 కోట్ల గ్రాస్ వసూలు స్థాయికి ఎదిగింది తెలుగు సినిమా. అన్ని సినిమాలూ ‘బాహుబలి’ లాగా 50 కోట్లు కొల్లగొట్టేయలేకున్నా.. ఓ పెద్ద సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా రూ.10-15 కోట్ల దాకా వసూళ్లు వచ్చేస్తున్నాయక్కడ. గత కొన్నేళ్లలో అమెరికా అంతటా ఇంతింతై అన్నట్లు తెలుగు సినిమా మార్కెట్ విస్తరించడంతో.. ఈ సమ్మర్లో భారీ సినిమాల మీద చాలా హైప్ నెలకొందక్కడ. ఐతే ఈ సమ్మర్లో యుఎస్ బయ్యర్లకు.. ప్రేక్షకులకు షాకుల మీద షాకులు తగిలాయి. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ కొట్టిన దెబ్బలు అలాంటిలాంటివి కాదు. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘సరైనోడు’ కూడా యుఎస్‌ లో సరిగా ఆడలేదు. బంగారు బాతులా పెంచుకుంటున్న యుఎస్ మార్కెట్.. ఈ సినిమాల దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. బయ్యర్లయితే మామూలు షాక్ లో లేరు.

ఇలాంటి టైంలో ఓ మీడియం రేంజి సినిమా మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.. అదే ‘అఆ’. క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ఇష్టపడే యుఎస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా తెరకెక్కిన సినిమా ఇది. మామూలుగానే త్రివిక్రమ్ సినిమాలకు యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అత్తారింటికి దారేది అక్కడ అనూహ్యమైన వసూళ్లు సాదించింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నా మిలియన్ మార్కు దాటింది. ఇక ‘అఆ’ మీద మంచి అంచనాలే ఉన్నాయక్కడ. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో 130కి పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సమ్మర్లో వచ్చిన భారీ సినిమాల దెబ్బకు దెబ్బతిని ఉన్న యుఎస్ మార్కెట్ కు మళ్లీ జీవం పోస్తాడని త్రివిక్రమ్ మీద ఆశతో ఉన్నారంతా. అక్కడి ప్రేక్షకులు కూడా ఆశగా త్రివిక్రమ్ సినిమా కోసం చూస్తున్నారు. మరి త్రివిక్రమ్ అంచనాల్ని ఏమేరకు అందుకుంటాడో చూడాలి.