Begin typing your search above and press return to search.

ఫిలింన‌గ‌ర్ లో 'మా' సొంత‌ భ‌వంతి!

By:  Tupaki Desk   |   23 Jun 2019 2:20 PM GMT
ఫిలింన‌గ‌ర్ లో మా సొంత‌ భ‌వంతి!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సొంత భవంతి ఓ క‌ల‌గా మారిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 900 మంది ఆర్టిస్టులు ఉన్న అతిపెద్ద అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపై ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఓ వైపు ద‌క్షిణ భార‌త న‌టీన‌టుల సంఘం (న‌డిగ‌ర్‌ సంఘం-1400 మంది స‌భ్యులు) భ‌వంతి నిర్మాణానికి దాదాపు 20 కోట్ల మేర బ‌డ్జెట్ ని ప్ర‌తిపాదించి దేశ‌విదేశాల్లో నిధి సేక‌ర‌ణ చేస్తున్నారు. ఈ సంఘానికి విశాల్ ప్యానెల్ కోటి విరాళం ప్ర‌క‌టించింది. అలాగే గ‌త ఏడాది మ‌లేషియాలో నిర్వ‌హించిన భారీ ఈవెంట్ ద్వారా కోట్ల‌లో నిధి సేక‌రించారు. మునుముందు ఇలాంటి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని చేసి భారీ ఎత్తున నిధి సేక‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు ఆర్టిస్టుల‌కు సంబంధించి అత్యంత కీల‌క‌మైన మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భ‌వంతి నిర్మాణం అంటే అందుకు కోట్ల‌లో నిధి అవ‌స‌రం అవుతుంది. దానిని సేక‌రించేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇక నిధుల గోల్ మాల్ అంటూ గ‌తంలో మా అధ్య‌క్షుడు శివాజీ రాజా పై విమ‌ర్శ‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికి వివాదాలు స‌ద్దుమ‌ణిగాయి. తిరిగి నిధి సేక‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు మా రెడీ చేస్తోంద‌ట‌. అయితే ఇప్ప‌టికే మా సొంత భ‌వంతి కోసం చిరంజీవి అతిధిగా నిర్వ‌హించిన విదేశీ ఈవెంట్ స‌క్సెసై కొంత నిధి చేకూరింది. మునుముందు మ‌హేష్‌.. అల్లు అర్జున్.. ప్ర‌భాస్.. ఎన్టీఆర్ లాంటి స్టార్ల‌తో ఈవెంట్లు చేస్తామ‌ని మా కొత్త సంఘం ప్ర‌క‌టించింది. అయితే కొత్త అధ్య‌క్షుడు వ‌చ్చాక ఎందుక‌నో నిధి సేక‌ర‌ణ ఈవెంట్లు మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగ‌డంపై విమర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇలాంటి వేళ నేడు జ‌రిగిన మా తొలి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లో మా సొంత భ‌వంతి నిర్మాణంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మా సొంత భ‌వంతి కోసం మెగాస్టార్ చిరంజీవి త‌న‌వంతు సాయం చేస్తాన‌ని అన్నారని న‌రేష్ తెలిపారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కొంత భూమిని ఆర్టిస్టుల కోసం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని.. అయితే దానిని ఫిల్మ్‌ నగర్‌లో ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని మా అధ్య‌క్షుడు న‌రేష్ తెలిపారు. భవిష్యత్‌లో హీరోలు.. ఆర్టిస్టుల‌తో మమేకమై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేయాల‌నుకుంటున్నామని వెల్ల‌డించారు.