Begin typing your search above and press return to search.

బాలయ్య అభిమానులు భయపడక్కర్లేదు

By:  Tupaki Desk   |   26 Jun 2016 11:30 AM GMT
బాలయ్య అభిమానులు భయపడక్కర్లేదు
X
బాలకృష్ణ-పి.వాసు.. ఈ కాంబినేషన్ తలుచుకుంటేనే నందమూరి అభిమానులకు వణుకు పుడుతుంది. బాలయ్య అసలే బ్యాడ్ ఫేజ్ లో ఉంటే.. ‘మహారథి’ సినిమాతో ఆయన్ని మరింత కిందికి తొక్కేశాడు వాసు. బాలయ్య కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది మహారథి. ఐతే అలాంటి దర్శకుడితో మళ్లీ బాలయ్య సినిమా చేయబోతున్నాడని ఓ వార్త బయటికి రాగానే అభిమానుల్లో కొంత కంగారు మొదలైంది. క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తూ.. దాని తర్వాత పి.వాసు దర్శకత్వంలో సినిమానా అని ఆందోళన చెందారు.

కానీ తాజా సమాచారం ప్రకారం పి.వాసు దర్శకత్వంలో బాలయ్య నటించట్లేదట. కన్నడ సూపర్ హిట్ ‘శివలింగ’ను తెలుగు-తమిళ భాషలు రెండింట్లోనూ లారెన్స్ హీరోగా తెరకెక్కించాలని ఫిక్సయ్యాడట పి.వాసు. ముందు తమిళం వరకు మాత్రమే లారెన్స్ ను హీరోగా అనుకున్నప్పటికీ తర్వాత తెలుగు వెర్షన్ కూడా అతడితోనే తీయాలని నిర్ణయించుకున్నాడు. బాలయ్యే వద్దన్నాడా.. లేక పి.వాసు నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియదు కానీ.. ‘శివలింగ’ రీమేక్ లో అయితే బాలయ్య నటించట్లేదు. ఈ మధ్య ఈ సినిమా 100 రోజుల వేడుకకు బాలయ్య హాజరవడంతో ‘శివలింగ’ రీమేక్ లో ఆయన నటిస్తాడన్న ప్రచారం మొదలైంది. ‘సాలా ఖడూస్’ ఫేమ్ రితికా సింగ్ లారెన్స్ సరసన కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లారెన్స్ పటాస్ రీమేక్ ‘మొట్ట శివ కెట్ట శివ’తో పాటు స్వీయ దర్శకత్వంలో కాంఛన సిరీస్ కొత్త సినిమాలోనూ నటిస్తున్నాడు.