Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'పడి పడి లేచె మనసు'

By:  Tupaki Desk   |   21 Dec 2018 6:27 PM GMT
మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు
X
చిత్రం : ‘పడి పడి లేచె మనసు’

నటీనటులు: శర్వానంద్ - సాయి పల్లవి - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - కల్పిక - మురళీ శర్మ - సంపత్ - ప్రియా రామన్ - అజయ్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: జేకే
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి

శర్వానంద్-సాయి పల్లవి లాంటి చక్కటి జంట.. హను రాఘవపూడి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడు.. ఈ కాంబినేషన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పడి పడి లేచె మనసు’. ఈ రోజే మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

కోల్ కతాలో చదువు పూర్తి చేసి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సూర్య (శర్వానంద్).. అనుకోకుండా మెడికో అయిన వైశాలి (సాయిపల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట పడి పడి.. చివరికి ఆమెను కూడా ప్రేమలోకి దించుతాడు. ఐతే తన తల్లిదండ్రుల జీవితంలో జరిగిన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అతను వైశాలితో పెళ్లికి నిరాకరిస్తాడు. ఒకరినొకరు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఆ స్థితిలో సూర్య.. వైశాలి ఒక ఏడాది పాటు ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఒప్పందానికి వస్తారు. మరి ఏడాదిలో ఏం జరిగింది.. తిరిగి వీళ్లిద్దరూ ఏడాది తర్వాత కలిశారా.. ఆపై కలిసి జీవితాన్ని పంచుకున్నారా లేదా అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

హను రాఘవపూడి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు. అతడికి మంచి ఆలోచనలుంటాయి. భిన్నమైన కథలు ప్రయత్నిస్తాడు. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో అతడి శైలే వేరు. కానీ ఒక పూర్తి కథను బిగితో చెప్పమంటే మాత్రం చేతులెత్తేస్తాడు. చక్కగా కథను మొదలుపెట్టి.. ఒక దశలో పతాక స్థాయికి తీసుకెళ్లి దబేల్ మని పడేస్తాడు. అతనిప్పటిదాకా తీసిన మూడు సినిమాలదీ ఇదే వరస. ఐతే అందరూ ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈసారి మారి ఉంటాడని.. ‘పడి పడి లేచె మనసు’ విషయంలో ఆ బలహీనతను అధిగమించడానికి గట్టిగా ప్రయత్నించి ఉంటాడేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ హను మళ్లీ అదే తప్పు చేశాడు. ఒక కథను అందంగా మొదలుపెట్టి.. అంతే అందంగా నడిపించి.. ప్రేక్షకులకు ఒక మంచి ఫీలింగ్ కలిగించి.. అక్కడి నుంచి కింద పడేశాడు. ప్రథమార్ధం వరకు పైకి లేచి.. ఆ తర్వాత కింద పడే.. ‘పడి పడి లేచె మనసు’ ఆ తర్వాత ఎక్కడా లేవదు.

తన కథల్లో ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం చూపించడానికే ప్రయత్నిస్తాడు హను. ఈసారి కూడా అతనో కొత్త విషయం చెప్పడానికే చూశాడు. కానీ కథలో కొత్తగా అనిపించే పాయింటే ఈ చిత్రానికి శాపంగా మారింది. అంటే ఆ పాయింట్ బాగా లేదని కాదు. దాన్ని డీల్ చేసిన విధానమే తేలిపోయింది. ప్రథమార్ధంలో పెద్దగా కథ లేకపోయినా.. ప్రేమ వ్యవహారం రొటీనే అయినా.. ప్రేమ సన్నివేశాల్ని పండించడంలో హను అభిరుచి.. ట్రీట్ మెంట్ లో ఉండే ఫ్రెష్ నెస్.. శర్వానంద్-సాయిపల్లవిల పెర్ఫామెన్స్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అన్నీ చక్కగా కుదిరి ‘పడి పడి లేచె మనసు’ ఒక దశ వరకు చక్కగా.. ఆహ్లాదకరంగా సాగిపోతుంది. కొన్ని సన్నివేశాలు అసంబద్ధంగా ఉన్నప్పటికీ శర్వా-పల్లవి జోడీ వాటిని కప్పి పుచ్చుతుంది. భిన్నంగా అనిపించే కోల్ కతా నేపథ్యం.. కంటికింపైన విజువల్స్.. వీనుల విందైన సంగీతం కూడా తోడై ప్రథమార్ధం ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది.

తొలి గంటలో కథేమీ లేకపోయినా.. లీడ్ పెయిర్.. టెక్నీషియన్ల అండతో హను సునాయాసంగా సమయాన్ని లాగించేశాడు. ఐతే ప్రేమకథ అన్నాక ప్రథమార్ధం వరకు రొమాంటిక్.. ఫన్నీ సీన్స్ తో బండి లాగించేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయంలో చాలామంది దర్శకులు విజయవంతం అవుతారు. అందులోనూ రొమాంటిక్ పార్ట్ డీల్ చేయడంలో హను చెయ్యి తిరిగినవాడు. అతడి బలమే అది. పైగా శర్వా-సాయిపల్లవి లాంటి జోడీ దొరికేసరికి అతడి పని చాలా సులువైపోయింది. కానీ ఎక్కడైతే కథను మలుపు తిప్పాల్సి వచ్చిందో.. ప్రేమికుల మధ్య సంఘర్షణను చూపించాల్సి వచ్చిందో అక్కడి నుంచే హను పట్టు విడిచాడు. అప్పటిదాకా హుషారుగా కనిపించిన హీరో.. ఇంటర్వెల్ వచ్చింది కదా అన్నట్లుగా చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఉన్నట్లుండి ‘స్వయంవరం’లో వేణులా మారిపోయి పెళ్లి వద్దని పట్టుదలకు పోవడంతో ఇదేం ట్విస్టు అనిపిస్తుంది. అక్కడ మొదలయ్యే అసహజత్వం సినిమా అంతటా కొనసాగుతుంది.

‘పడి పడి పడి లేచె మనసు’ ద్వితీయార్ధం గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ప్రథమార్ధంలో కలిగిన మంచి ఫీలింగ్ పోగొట్టడానికి హను ఎంత చేయాలో అంతా చేశాడు. అర్థ రహితంగా అనిపించే హీరో హీరోయిన్ల ప్రవర్తనతో ప్రేక్షకులకు ‘మతి’ తప్పుతుంది. ‘ప్రేమమ్’లో సాయిపల్లవిని చూసి ఇన్ స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ.. హీరోయిన్ గతం మరిచిపోవడం మీద ఒక డ్రామా నడిపించాడు హను. అదెంత సిల్లీగా ఉంటుందంటే.. ఏదైనా సినిమా బాగా ఫ్రస్టేట్ చేస్తుంటే అసహనంతో ప్రేక్షకులు ప్రతి డైలాగుకీ రిటర్న్ పంచులేయడం మొదలుపెడతారు.. ఆ స్థితికి తీసుకెళ్లిపోతుంది ఈ డ్రామా వ్యవహారం. ద్వితీయార్ధం ఒక్కసారిగా చల్లబడిపోవడంతో శర్వానంద్.. సాయిపల్లవి సైతం ఏమీ చేయలేకపోయారు పాపం. అతకని సన్నివేశాల్లో వాళ్లిద్దరూ మనసు పెట్టి నటిస్తుంటే చూడ్డానికి జాలేస్తుంది తప్ప పాత్రలతో మాత్రం ఎమోషనల్ కనెక్ట్ కనిపించదు. ఏ సన్నివేశం ఎందుకొస్తోందో అర్థం కాని అయోమయం వల్ల ఒక దశ దాటాక ఏంటీ నాన్సెన్స్ అనిపిస్తుంది. చివర్లో ట్విస్ట్ రివీల్ చేసి అప్పటిదాకా నడిచిన వ్యవహారాన్ని జస్టిఫై చేయడానికి ఏదో ట్రై చేశారు కానీ.. అదేమంత కన్విన్సింగ్ గా లేదు. మొత్తంగా చెప్పాలంటే హను మంచి వనరులు దొరికినా.. ఒక దశ వరకు అన్నీ ఉపయోగించుకుని కథను బాగానే నడిపించినా.. సగం నుంచి తడబడిపోయాడు. ఎప్పట్లాగే మధ్యలో కాడి వదిలేశాడు.

నటీనటులు:

శర్వానంద్.. సాయిపల్లవిల గురించి చెప్పేదేముంది? అందరూ ఆశించినట్లుగా ఇద్దరూ పోటీ పడి నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు. ఇద్దరూ సమవుజ్జీలా కనిపించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలం. సినిమా చివరికి ఎలాంటి ఫీలింగ్ కలిగించినా.. వీరి పెర్ఫామెన్స్ కోసం ఒకసారి చూడొచ్చనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో అయితే ఎవరికి వారే అనిపించారు. కొన్ని చోట్ల మాత్రం సాయిపల్లవి డామినేట్ చేసింది. ఇంటర్వెల్ మలుపు దగ్గర సాయిపల్లవి హావభావాలు కట్టి పడేస్తాయి. శర్వా కొన్ని సీన్లలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐతే మిగతా నటీనటులెవరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి ఒక్కడు కనిపించినంతసేపు నవ్వించాడు. మిగతా నటీనటులెవరూ అంతగా కథకు ఉపయోగపడలేదు. మరళీ శర్మ.. సంపత్ లాంటి పెద్ద నటుల పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయి. ప్రియా రామన్ పాత్రలోనూ ఏ విశేషం లేదు. వెన్నెల కిషోర్ కు కూడా పెద్దగా స్కోప్ లేకపోయింది. సునీల్ అయితే పూర్తిగా వేస్టయిపోయాడు. కల్పిక.. అజయ్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘పడి పడి లేచె మనసు’ ఉన్నతంగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ప్రేమకథకు సరిగ్గా సరిపోయే సంగీతం అందించాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలోనూ మంచి ఫీల్ ఉంది. జేకే ఛాయాగ్రహణం కూడా సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశం ఆహ్లాదంగా అనిపించేలా కెమెరాతో మ్యాజిక్ చేశాడు జేకే. కోల్ కతా నగరాన్ని చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరిని అభినందించాల్సిందే. ఐతే తనకు మరోసారి మంచి వనరులు సమకూరినా దర్శకుడు హను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఎప్పట్లాగే ప్రేమ సన్నివేశాల్ని అందంగా తీర్చిదిద్దడంలో హను బలం కనిపిస్తుంది. అతడి అభిరుచిని చాలా సీన్లలో గమనించవచ్చు. సినిమా అంతటా డైలాగులు బాగున్నాయి. కృష్ణుడు-రుక్మిణిల ప్రేమాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేమకథను నడపడం బాగుంది. కానీ కాన్ ఫ్లిక్ట్ పాయింట్ దగ్గరే హను ట్రాక్ తప్పాడు. ద్వితీయార్ధంలో దర్శకుడిగా అతడి ముద్రేమీ కనిపించదు. స్క్రీన్ ప్లేనే చాలా గందరగోళంగా తయారైంది. అతడి చేతుల్లోంచి సినిమా జారిపోయింది.

చివరగా: పడి పడి లేచె మనసు.. లేచి పడిన సినిమా

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre