Begin typing your search above and press return to search.

'షావుకారు' జానకి ప్రతిభకు కొలమానం .. పద్మశ్రీ

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:42 AM GMT
షావుకారు జానకి ప్రతిభకు కొలమానం .. పద్మశ్రీ
X
శ్రమకి తగిన ప్రతిఫలం .. ప్రతిభకు తగిన గుర్తింపు కొంతమందికి ఆలస్యంగా దక్కుతాయి. అలాంటివారి జాబితాలో 'షావుకారు' జానకి కూడా కనిపిస్తారు. నటిగా 50 దశకం నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన 'షావుకారు' జానకి 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రం తరఫున 'షావుకారు' జానకి 'పద్మశ్రీకి ఎంపిక అయ్యారు. ఆమె అభిమానులందరికీ ఇది ఆనందాన్ని కలిగించే విషయం.

'షావుకారు' జానకి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1932 డిసెంబర్ 11వ తేదీన జన్మించారు. జానపద చిత్రాల ర్రాజకుమారిగా చెప్పుకునే కృష్ణకుమారికి 'షావుకారు' జానకి సొంత అక్కయ్య. ఇద్దరు అక్కాచెలెళ్లు ఒకే సమయంలో చిత్రపరిశ్రమలో రాణించడం నిజంగానే విశేషమే. 'షావుకారు' జానకిని చూస్తే ఆమెలో ధైర్యం .. తెగింపు .. స్వతంత్ర భావాలు కనిపిస్తాయి. అవి తమ తండ్రి గారి పెంపకమని 'షావుకారు' జానకి చెబుతుంటారు. కొన్ని కారణాల వలన, ఆమె 15 ఏళ్లకే వివాహం చేసుకోవలసి వచ్చింది. పసి బిడ్డను చంకనేసుకుని అవకాశాల కోసం స్టూడియోలకు వెళ్లిన సంఘటనలు ఆమె జీవితంలో కనిపిస్తాయి.

'షావుకారు' సినిమా చేసే సమయానికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు. ఆ సినిమాలో ఆమె 'ఒరేయ్ పోలాయ్' అంటూ సందడి చేసిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. అప్పటికే ఆరితేరిపోయిన గోవిందరాజుల సుబ్బారావునే ఆటపట్టించే ఆ పాత్రలో ఆమె నటన .. అందులోని సహజత్వం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇక అప్పటి నుంచి 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఇక 'డాక్టర్ చక్రవర్తి' సినిమాలో ఏఎన్నార్ భార్యగా ఆయనను అనుమానించే పాత్రలో ఆమె హావభావాలు అద్భుతమనే చెప్పాలి. ఇక 'సంసారం ఒక చరంగం' సినిమాలో పనిమనిషి 'చిలకమ్మ' పాత్రలో షావుకారు జానకి తమ విశ్వరూపం చూపించారు.

నిజానికి సావిత్రి .. జమున .. కృష్ణకుమారి వీళ్లంతా కూడా అందంతో పాటు అభినయం ఉన్న కథానాయికలు. ఒక కథానాయికకు ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు. కానీ 'షావుకారు' జానకి అంత పొడగరి కాదు .. తనతోటి హీరోయిన్ల కంటే అందగత్తె కూడా కాదు. ఈ కారణంగా గుమ్మం వరకూ వచ్చిన అవకాశాలు చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతోనే అలుపెరగని పోరాటం చేశారు. తనలో గ్లామర్ పాళ్లు తక్కువనే విషయం తనకి తెలుసనీ, అందువల్లనే నటనపై .. ముఖ్యంగా డైలాగ్ డెలివరీపై దృష్టి పెట్టేసి కెరియర్ ను నెట్టుకొచ్చానని ఒక సందర్భంలో ఆమెనే చెప్పారు. అప్పట్లో జగ్గయ్య .. 'షావుకారు' జానకి ఇద్దరి ఎదురుగా నిలబడి డైలాగ్ చెప్పాలంటే చాలామంది ఆర్టిస్టులకు చెమటలు పట్టేవట.

అలా 'షావుకారు' జానకి సుదీర్ఘమైన తన కెరియర్లో వందల సినిమాల్లో నటించారు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. కాలక్రమంలో తన వయసుకి తగినట్టుగా అమ్మ పాత్రలను .. బామ్మ పాత్రలను కూడా చేస్తూ మెప్పించారు. ఇంతకాలానికి ఆమె ప్రతిభకు కొలమానంగా పద్మశ్రీ వరించడం 'షావుకారు జానకితో పాటు ఆమె అభిమానులందరికీ సంతోషాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి.