Begin typing your search above and press return to search.

మనం ప్రశాంతంగా ‘పద్మావతి’ చూసుకుందాం

By:  Tupaki Desk   |   22 Jan 2018 11:30 PM GMT
మనం ప్రశాంతంగా ‘పద్మావతి’ చూసుకుందాం
X
మూడు నెలల కిందట ‘పద్మావతి’ ట్రైలర్ చూసిన వాళ్లందరికీ కళ్లు విచ్చుకున్నాయి. భారతీయ వెండితెరపై మరో అద్భుతం చూడబోతున్నామన్న భావన కలిగింది. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని రీతిలో.. ఇంకా చెప్పాలంటే దీని విజువల్స్ ‘బాహుబలి’ కన్నా మిన్నగా.. పర్ఫెక్ట్ గా కనిపించాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తి కలిగింది. కానీ ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం.. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగడంతో పరిస్థితి తిరగబడింది. సినిమా ఎలా ఉంటుంది అన్న ఆలోచనే జనాల మనసుల్లోంచి వెళ్లిపోయింది. కేవలం వివాదాలే వార్తలయ్యాయి.

ఐతే అన్ని వివాదాల్నీ దాటుకుని.. సెన్సార్ సమస్యల్ని కూడా అధిగమించి ఎట్టకేలకు ‘పద్మావత్’గా పేరు మార్చుకుని ‘పద్మావతి’ థియేటర్లలోకి దిగబోతోంది. ఇంకో నాలుగు రోజుల్లోనే సినిమా రిలీజవుతుంది. ఇప్పటికీ ఉత్తరాదిన ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజవడమే సందేహంగా ఉంది. మిగతా ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి కూడా అయోమయంగా ఉంది. ఐతే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు పెద్దగా అడ్డంకులు ఎదురయ్యేలా కనిపించట్లేదు. హైదరాబాద్ లో కొంచెం హడావుడి చేస్తున్నారు కానీ.. పెద్ద సమస్య అయితే ఉండకపోవచ్చు. ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనూ రిలీజవుతుండటం విశేషం. త్రీడీలో కూడా రిలీజవుతోంది. రెండు నెలల పాటు ఈ గొడవల వల్ల సినిమా విషయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా పోయింది. ఐతే వివాదాల సంగతలా ఉంచేసి.. ఒక్కసారి వెనక్కి వెళ్లి దీని ట్రైలర్ గుర్తు చేసుకుంటే ఈ సినిమాపై ఆటోమేటిగ్గా ఆసక్తి కలుగుతుంది. దక్షిణాది వాళ్లకు ఈ కథపై ఏ అభ్యంతరాల్లేవు. మన మనోభావాలపై అదేమీ ప్రభావం చూపించేది కాదు. ఒక దృశ్యకావ్యం చూసేందుకు దక్కిని మంచి అవకాశమిది. మరి దీన్ని దక్షిణాది ప్రేక్షకులు ఏమాత్రం ఉపయోగించుకుంటారో.. ఈ చిత్రానికి ఎలాంటి ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.