Begin typing your search above and press return to search.

‘పద్మావత్’కు అది పెద్ద దెబ్బే..

By:  Tupaki Desk   |   10 Jan 2018 5:00 AM GMT
‘పద్మావత్’కు అది పెద్ద దెబ్బే..
X
మొత్తానికి ‘పద్మావత్’గా మారిన ‘పద్మావతి’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. దీనికి సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నిజంగా ఈ సినిమా ఆ తేదీకి వస్తుందా రాదా అన్నది ఇంకా సందేహంగానే ఉంది. ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేక అభ్యంతరాలు లేవనెత్తి.. చివరికి కొన్ని మార్పులు.. కోతలతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణి సేన శాంతించట్లేదు. ఈ సినిమాను ఆడనివ్వబోమని.. థియేటర్లను తగులబెడతామని మరోసారి హెచ్చరించింది. దీంతో విడుదల సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన చిత్ర బృందాన్ని వెంటాడుతోంది.

ఇలాంటి అనిశ్చితి మధ్య సినిమాను రిలీజ్ చేయాల్సి రావడం సంజయ్ లీలా బన్సాలీకి తీవ్ర ఇబ్బందిని కలిగించే విషయమే. నిజానికి ‘పద్మావతి’ ట్రైలర్ చూసి అందరూ షాకైపోయారు. ఓ అద్భుత దృశ్యకావ్యం చూడబోతున్న అనుభూతికి లోనయ్యారు. దీనికి విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హైప్ ఉన్నపుడే సినిమా రిలీజై ఉంటే కథ వేరుగా ఉండేది. ఇప్పుడు సినిమాలో కొన్ని సన్నివేశాలకు కోత పడ్డాయి. ఈ వివాదం చాన్నాళ్లు కొనసాగడంతో జనాలకు కొంత విసుగొచ్చింది. ఈ క్రమంలో సినిమాపై ఆసక్తి కొంచెం తగ్గింది. ఐతే ఆ ఆసక్తిని.. హైప్ ను పెంచాలంటే.. గట్టిగా ప్రమోషన్లు చేయాలి.. సినిమాకు సంబంధించి కొత్త ప్రోమోలు వదలాలి. కానీ ఇప్పుడున్న సెన్సిటివ్ సిచువేషన్లో అలా చేసే పరిస్థితి లేదు. ప్రమోషన్ల హోరు కనిపిస్తే ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లను మళ్లీ రెచ్చగొట్టినట్లవుతుంది. కాబట్టి వాళ్లకు ఈ సినిమా మీద ఫోకస్ పడనివ్వకుండా.. స్తబ్ధత కొనసాగించాలి. హడావుడి లేకుండా సినిమాను రిలీజ్ చేయాలి. దీని వల్ల సినిమా ఓపెనింగ్స్ మీద కచ్చితంగా ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు.