Begin typing your search above and press return to search.

ఆ ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ట‌!

By:  Tupaki Desk   |   7 Sep 2016 7:30 AM GMT
ఆ ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ట‌!
X
దాదాపు రూ. 100 కోట్ల వ్య‌యంతో అత్యంత భారీగా తెర‌కెక్కింది మొహెంజోదారో చిత్రం. హృతిక్ రోష‌న్‌ - పూజా హెడ్గేల‌ను హీరో హీరోయిన్స్ గా పెట్టి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవారిక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సింధు నాగ‌రికత కాలాన్ని ఆవిష్క‌రిస్తున్నా అంటూ ప్రచారం చేశారు. ల‌గాన్‌ - జోథా అక్బ‌ర్ లాంటి చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు మ‌రో భారీ హిట్ కొట్ట‌బోతున్నాడ‌న్న భారీ అంచ‌నాల మధ్య ఈ చిత్రం విడుద‌లైంది. ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక‌పోయింది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో హృతిక్ కెరీర్ లోనే డిజ‌స్ట‌ర్ గా మిలిగిపోయింది. భారీ ఎత్తున న‌ష్టాలు మిగిలించి మొహెంజోదారో. న‌ష్టాల‌ను ఎలా భ‌ర్తీ చేసుకోవాలా అని త‌ల‌ప‌ట్టుకుంటూ ఉంటే... మూలిగే న‌క్క మీద తాటిపండులా పాకిస్థాన్ నుంచి ఈ చిత్రంపై కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతుండ‌టం అద‌న‌పు త‌ల‌నొప్పిగా మారింది!

మొహెంజోదారో చిత్రం చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించిన‌ట్టుగా ఉంద‌ని సింధు ప్రాంత సాంస్కృతిక‌ - ప‌ర్యాట‌క మంత్రి స‌ర్దార్ అలీషా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పాక్ లోని ప్ర‌ముఖ ప‌త్రిక డాన్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ చిత్రంపై విమ‌ర్శ‌లు చేశారు. ఐదువేల ఏళ్ల నాటి సింధు నాగ‌రిక‌త‌ను కించ‌ప‌ర‌చే విధంగా ఈ చిత్రం తెర‌కెక్కించారు అన్నారు. ఈ సినిమాలో వాస్త‌వాల పేరుతో ద‌ర్శ‌కుడి క‌ల్ప‌న‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌నీ, దీంతో సింధు ప్ర‌జ‌లు ఎంతో అసంతృప్తిగా ఉన్నార‌ని అలీషా అన్నారు. ఈ అభ్యంత‌రాల‌ను ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవారిక‌ర్ కు చెబుతా అంటున్నారు.

అంత‌కాదు, చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తూ సింధు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా సినిమా తీసిన ద‌ర్శ‌కుడు అశుతోష్ పాక్ ప్ర‌జ‌ల‌కు ముందుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం విశేషం. సింధు నాగ‌రిక‌త‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో పేరుంద‌నీ, అందుకే యునెస్కో వ‌రల్డ్ హెరిటేజ్ సైట్ గా సింధుకు గుర్తింపు ఉంద‌ని అన్నారు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అలీషా ప‌ట్ట‌బుడుతున్నారు. వంద కోట్లు పెట్టుబ‌డి పెట్టి తీవ్ర న‌ష్టాలతో చిత్ర‌యూనిట్ అంతా కోలుకోల‌ని దెబ్బ‌తిని ఉంటే... పాకిస్థాన్ నుంచి ఈ డిమాండ్ వినిపిస్తూ ఉండ‌టం కాస్త ఇబ్బందిక‌ర‌మైన అంశంగానే మారుతోంది. మ‌రి, పాకిస్థాన్ మంత్రి విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడు అశుతోష్ స్పందిస్తారా..?