Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: యూత్ స్టార్లు పాన్ ఇండియాని కొట్టేదెలా?

By:  Tupaki Desk   |   27 Nov 2022 6:32 AM GMT
టాప్ స్టోరి: యూత్ స్టార్లు పాన్ ఇండియాని కొట్టేదెలా?
X
టాలీవుడ్ లో యువ‌హీరోల న‌డుమ కాంపిటీష‌న్ ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇటీవ‌లి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ లో మ‌రింత‌గా చాప కింద నీరులా చేరిపోతోంది. సీనియ‌ర్ హీరోలు.. స్టార్ డ‌మ్ ఉన్న డ‌జ‌ను మంది హీరోల‌ను ప‌క్క‌న పెడితే మిడ్ రేంజులో ఉండి రైజింగులో ఉన్న హీరోల జాబితా తిర‌గేస్తే ఈ సిగ్మెంట్ లోను డ‌జ‌ను పైగా హీరోలు సైలెంటుగా హిట్టు కొడుతూ ప్ర‌తిభ ప‌రంగా త‌మ‌కమీ త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ అది కాదు. హీరోలు ఎంద‌రు ఉన్నా అందులో పాన్ ఇండియా మార్కెట్ వైపు దూసుకెళ్లే స‌త్తా ఎంద‌రికి ఉంది? అన్న‌దే పాయింట్ గా మారింది.

ఇప్ప‌టివ‌ర‌కూ మిడ్ రేంజులో పాన్ ఇండియా స్టార్లుగా బంప‌ర్ హిట్లు కొట్టిన హీరోల జాబితా వెతికితే అడివి శేష్ ఆ త‌ర్వాత నిఖిల్ సిద్ధార్థ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రూ కాంతార ఫేం రిష‌బ్ శెట్టి కంటే ముందే హిందీ మార్కెట్లోను నిరూపించారు. శేష్ `మేజ‌ర్` తో పాన్ ఇండియా లెవ‌ల్లో బంప‌ర్ హిట్టు కొట్టాడు. `కార్తికేయ 2` తో నిఖిల్ హిందీ ఆడియెన్ కి ఫేవ‌రెట్ హీరోగా మారాడు. తెలుగు-త‌మిళంతో పాటు హిందీ బెల్ట్ లో ఈ సినిమా బాగా ఆడింది. నిఖిల్ లుక్ కూడా పాన్ ఇండియా ఎలివేష‌న్ కి త‌గ్గ‌ట్టుగా కుదిరింద‌ని చెప్పాలి. హిట్టొచ్చిన వేళ‌ ఇప్పుడు నిఖిల్ లో పాన్ ఇండియా అప్పీల్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. శేష్‌- నిఖిల్ న‌టించే సినిమాలకు త‌దుపరి ఇరుగు పొరుగునా మార్కెట్ రేంజు బావుంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే స్థిరంగా వీరంతా పాన్ ఇండియా కంటెంట్ తో మెప్పించాల్సి ఉంటుంది.

అక్కినేని కాంపౌండ్ నుంచి నాగ‌చైత‌న్య‌- అఖిల్ కూడా ఇటీవ‌ల పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. చై లాల్ సింగ్ చ‌డ్డాతో ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కాలేదు. కానీ త‌దుప‌రి వెంక‌ట్ ప్ర‌భుతో సినిమా పాన్ ఇండియా కేట‌గిరీనే. సురేంద‌ర్ రెడ్డి తో ఏజెంట్ ప్ర‌య‌త్నం అఖిల్ ని పాన్ ఇండియా వార్ లో టాప్ లోకి లేపుతుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమా గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో స‌రికొత్త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పుతుంద‌ని సూరి దీనిని బాగా చెక్కుతున్నాడ‌ని టాక్ ఉంది. అయితే బ‌డ్జెట్ మాత్రం అదుపుత‌ప్పింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. ఏది ఏమైనా అఖిల్ కి ఓ బంప‌ర్ హిట్టు ఇవ్వ‌డం అతడి టార్గెట్. సైరాతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా నిరూపించిన సురేంద‌ర్ రెడ్డికి ఇప్పుడు కావాల్సింది పాన్ ఇండియా హిట్టు మాత్ర‌మే. లోక‌ల్ మార్కెట్లో త‌న‌కు స‌త్తా చాటేందుకు అదేమంత విష‌యం కాదు.

యూత్ స్టార్ నితిన్ లో ఎన‌ర్జీ పాన్ ఇండియా స్టార్ల‌కు త‌క్కువేమీ కాదు. కానీ అత‌డి ఎంపిక‌లు కొంత ఇబ్బందిక‌రం. త‌న‌ని తాను ఇరుగుపొరుగు మార్కెట్ల‌లో నిల‌బెట్టుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు? అన్న‌ది ఇక‌పై కీల‌కంగా మార‌నుంది. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఫెయిల్యూర్ త‌ర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. నితిన్ లో స్పీడ్ పెరిగేది ఎప్పుడో చూడాలి. హిందీ మార్కెట్లోను అత‌డు స‌త్తా చాటాల్సి ఉంది.

లైగ‌ర్ చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా మార్కెట్ ని గుప్పిట ప‌ట్టాల‌ని ఆశించి భంగ‌ప‌డ్డాడు. కానీ అత‌డికి పాన్ ఇండియా హీరో అన్న ట్యాగ్ ఇప్ప‌టికే వ‌చ్చేసింది కాబ‌ట్టి మునుముందు నిరూపించి తీరాల్సిన స‌న్నివేశం ఉంది. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా బాలీవుడ్ యువ‌నాయిక‌ల మ‌న‌సు దోచిన యువ‌హీరోగా దేవ‌ర‌కొండ‌కు ఫాలోయింగ్ కి కొద‌వేమీ లేదు. ఇది అతడికి భ‌విష్యత్ లో చాలా పెద్ద ప్ల‌స్ కానుంది. కంటెంట్ ప‌రంగా స‌రైన ఎంపిక‌తో దేవ‌ర‌కొండ పాన్ ఇండియాలోకి మ‌రోసారి దూసుకొస్తాడ‌నే ఆశిద్దాం.

మెగా కాంపౌండ్ నుంచి వ‌ర‌స ప్ర‌యోగాలు చేస్తూ గ్రీకువీరుడిగా వెలిగిపోతున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి పాన్ ఇండియా మార్కెట్ పై గ్రిప్ పెంచుకునే ఛాన్సుంది. అత‌డి ప్ర‌యోగాత్మ‌క శైలి త‌న‌ని ఏదో ఒక రోజు పెద్ద ఎత్తుకు తీసుకెళుతుంద‌ని ఆశిస్తున్నారు. మెగా యువ‌హీరోలైన‌ సాయిధ‌రమ్- వైష్ణ‌వ్ తేజ్ ఇంకా చాలా ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది.

నేచుర‌ల్ స్టార్ నాని- వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ లాంటి హీరోలు వైవిధ్య‌మైన కంటెంట్ తో మెప్పిస్తూనే ఉన్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని విస్త‌రించేందుకు అద‌న‌పు ప్ర‌య‌త్నాలేవీ చేసిన‌ట్టు క‌నిపించ‌లేదు. ఈసారి త‌మ యూనిక్ కంటెంట్ తో పాన్ ఇండియా మార్కెట్లోకి దూసుకెళ‌తార‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇక కార్తికేయ - స‌త్య దేవ్ లాంటి యువ‌హీరోలు తెలివిగా త‌మ మార్కెట్ ప‌రిధిని ఇరుగు పొరుగు భాష‌ల‌కు విస్త‌రించుకునేందుకు ప్లాన్ చేసారు. కానీ వీళ్లు ఇంకా త‌మ స‌త్తా నిరూపించాల్సి ఉంటుంది. సుధీర్ బాబు- సందీప్ కిష‌న్ - రాజ్ త‌రుణ్ లాంటి యువ‌ హీరోలు స‌రైన యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల‌తో ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో నిరూపించుకోవాల్సి ఉంది.