Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రౌండ‌ప్: 2022లో పాన్ ఇండియా సినిమాల‌దే హ‌వా!

By:  Tupaki Desk   |   20 Dec 2022 1:30 AM GMT
టాలీవుడ్ రౌండ‌ప్: 2022లో పాన్ ఇండియా సినిమాల‌దే హ‌వా!
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి 2015, 2017ల‌లో `బాహుబ‌లి` సిరీస్ తో పాన్ ఇండియా సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టారు. అయితే 2021లో `పుష్ప‌` మూవీతో క్రేజీగా ఊపందుకున్న ఈ ట్రెండ్ 2022లో మాత్రంజోరందుకుంది. ఈ ఏడాది ఏ హీరోని క‌దిలించినా పాన్ ఇండియా.. పాన్ ఇండియా అన‌డం మొద‌లు పెట్టాడు. దీంతో 2022లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ప‌తాక స్థాయికి చేరి ఈ త‌ర‌హా సినిమాల‌కు మ‌రింత ఊత‌మిచ్చాయి. 2022లో తెలుగు నుంచి అర‌డ‌జ‌ను పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల కాగా అంటులో ఒక‌టి రెండు మిన‌హా అన్ని సినిమాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి టాలీవుడ్ పేరు మారుమోగేలా చేశాయి.

`బాహుబ‌లి` సిరీస్ తో పాన్ ఇండియా సినిమాల‌కు రాజ‌మౌళి ఏళ్ల క్రితం శ్రీ‌కారం చుడితే `పుష్ప‌` ఈ త‌ర‌హా సినిమాల‌కు మ‌రింత ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా అందించిన స్ఫూర్తితో టాలీవుడ్ లో 2022లో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం మ‌రింత‌గా ఊపందుకుంది. క‌రోనా భ‌యాల మ‌ధ్య నిర్మాణంలో వున్న పాన్ ఇండియా సినిమాల‌న్నీ ఆ భ‌యాలు తొల‌గిపోవ‌డంతో భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈ వ‌రుస‌లో పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన మూవీ `రాధేశ్యామ్‌`. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీని త‌న‌కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.

`జిల్‌`తో ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన రాధాకృష్ణ కుమార్ కు ఈ మూవీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ప్ర‌భాస్ తో పాటు మేక‌ర్స్ కి కూడా భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫ‌లితంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఒకింత అస‌హ‌నానికి కూడా గురయ్యారు. ఇక ఈ మూవీ త‌రువాత జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా టాలీవుడ్ బిగ్ స్టార్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల తొలి క‌ల‌యిక‌లో రూపొందించిన `RRR` విడుద‌లైంది. లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుని మ‌రో సారి ఇండియ‌న్ సినిమాకు తిరుగులేద‌ని నిరూపించింది.

రూ. 550 కోట్ల‌తో నిర్మిస్తే రూ. రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం విశేషం. ప్ర‌స్తుతం ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డుల్ని ద‌క్కించుకుంటూ ఆస్కార్ పై ఆశ‌లు రేపుతోంది. ఈ మూవీ త‌రువాత మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన మూవీ `మేజ‌ర్‌`. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ మూవీని స్టార్ హీరో మ‌హేష్ బాబు నిర్మించారు. 32 కోట్ల‌తో నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 66 కోట్ల‌కు మించి రాబ‌ట్టడం విశేషం.

వీటితో పాటు రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా స్టార్ గా మారాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు. పూరి డైరెక్ష‌న్ లో మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే డిజాస్ట‌క‌ర్ టాక్ ని సొంతం చేసుకుని విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక `ఫ్యామిలీమ్యాన్ 2`తో పాన్ ఇండియా స్టార్ జాబితాలో చేరిన స‌మంత కూడా ఇదే ఏడాది `య‌శోద‌`తో మ‌ళ్లీ పాన్ ఇండియా స్టార్ గా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. టాక్ మిక్స్డ్ గా వినిపించినా వ‌సూళ్ల ప‌రంగా సూప‌ర్ అనిపించుకుంది.

ఇక నిఖిల్ న‌టించిన `కార్తికేయ 2` పాన్ ఇండియా మూవీగా సంచ‌ల‌నాలు సృష్టించింది. రూ. 15 కోట్ల‌తో రూపొందిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో దాదాపు రూ.120 కోట్లు వ‌సూలు చేసింది. హిందీలో రూ. 30 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం విశేషం. దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన `సీతారామం`ని రూ. 30 కోట్ల‌తో నిర్మిస్తే దాదాపు రూ.100 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.