Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ట్రెండ్‌ మ‌న‌కు వ‌ర‌మా శాప‌మా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 12:30 AM GMT
పాన్ ఇండియా ట్రెండ్‌ మ‌న‌కు వ‌ర‌మా శాప‌మా?
X
`బాహుబ‌లి` త‌రువాత నుంచి టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల సంద‌డి మొద‌లైంది. ప్ర‌భాస్ , రానాల కాంబినేష‌న్ లో వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటింది. మేక‌ర్స్ కి వంద‌ల కోట్ల ప్రాఫిట్ ని అందించింది. ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద `బాహుబ‌లి 2` వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

దీంతో ఈ మూవీ త‌రువాత స్టార్ హీరోల నుంచి మినిమ‌మ్ గ్యారెంటీ హీరోల వ‌రకు పాన్ ఇండియా జ‌పం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో విడుద‌లైన క‌న్న‌డ మూవీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా సంచ‌న విజ‌యాన్ని సాధించ‌డంతో మ‌న వాళ్ల ఆలోచ‌న‌లు రెట్టింప‌య్యాయి. మార్కెట్ స్థాయి కూడా పెర‌గిపోవ‌డంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాల‌కు మ‌న వాళ్లు శ్రీ‌కారం చుట్ట‌డం మొద‌లు పెట్టారు.

ఈ నేపథ్యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీ స్టార్ మూవీ `ట్రిపుల్ ఆర్‌` మ‌న వాళ్ల అంచ‌నాల్ని మ‌రింత పెంచింది. క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌లై పాన్ ఇండియా వైడ్ గా భారీ విజ‌యాన్ని సాధించింది. ఇప్ప‌టికీ ఓటీటీలో హాలీవుడ్ స్టార్ ల ప్ర‌శంస‌ల్ని అందుకుంటూ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

ఈ మూవీకి ముందు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన `రాధేశ్యామ్‌` భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. `బాహుబ‌లి` ఇచ్చిన ధైర్యంతో ఈ మూవీకి రూ. 350 కోట్ల‌మేర బ‌డ్జెట్ ని కేటాయించారు. అయితే ఈ మూవీ భారీ న‌ష్టాల‌నే మిగిల్చింది. ఇక `ట్రిపుల్ ఆర్` త‌రువాత భారీ స్థాయిలో విడుద‌లైన `కేజీఎఫ్ 2` ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేసింది. హిందీ బెల్ట్ లో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లోనూ రూ.1250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త దీంతో ఏడాది విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన `పుష్ప‌` సీక్వెల్ బ‌డ్జెట్ ని ఏకంగా రూ. 375 కోట్ల‌కు పెంచేశారు. అంతా బాగానే వుంది. కానీ ఇదే రాను రాను స్టార్స్ మూవీస్ కి, చిన్న సినిమాల‌కు శాపంగా మార‌బోతోందా? అంటే య‌స్ అని ట్రేడ్ వ‌ర్గాలు, ఎగ్జిబిట‌ర్స్ వ‌ర్గాలు అంటున్నాయి. పాన్ ఇండియా మూవీస్ మోజులో బ‌డ్జెట్ లు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమాల‌కు టికెట్ రేట్ల‌ని మేక‌ర్స్ భారీగా పెంచేస్తున్నారు. దీంతో ప్రేక్ష‌కులు చిన్న సినిమాల కోసం థియేట‌ర్ల‌కు రాని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

అప్పుడ‌ప్పుడు బిర్యానీ తినే ప్రేక్ష‌కుడికి పాన్ ఇండియా సినిమా పేరుతో బిర్యానీ పెడుతుండ‌టం తో ప్రేక్ష‌కులు అత్య‌ధికంగా ఈ త‌ర‌హా సినిమాల‌పైనే ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీని వ‌ల్ల చిన్న సినిమాల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతోంది. వీటి కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. ఇదే ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడే థియేట‌ర్లు తెర‌స్తాం అనే ప‌రిస్థితికి చేరినా ఆశ్చ‌ర్యం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.