Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘పంతం’

By:  Tupaki Desk   |   5 July 2018 9:56 AM GMT
మూవీ రివ్యూ : ‘పంతం’
X
చిత్రం: ‘పంతం’

నటీనటులు: గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ - సంపత్ రాజ్ - ముకేష్ రుషి - తనికెళ్ల భరణి - శ్రీనివాసరెడ్డి - పృథ్వీ - జయప్రకాష్ రెడ్డి - కౌముది - పవిత్ర లోకేష్ - హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
మాటలు: రమేష్ రెడ్డి
స్క్రీన్ ప్లే : కె.చక్రవర్తి - బాబీ
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ - దర్శకత్వం: కె.చక్రవర్తి

మాస్ సినిమాలతో మంచి స్థాయిని అందుకున్న హీరో గోపీచంద్. ఐతే గత కొన్నేళ్లుగా అతడి ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇప్పుడతడి ఆశలన్నీ ‘పంతం’ మీదే నిలిచాయి. ఇది అతడికి 25వ సినిమా కావడం విశేషం. కొత్త దర్శకుడు చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విక్రాంత్ (గోపీచంద్) హైదరాబాద్ లోని ఒక కాలనీలో మామూలు వ్యక్తిలా తిరుగుతుంటాడు. కానీ అతను ఎవరికీ తెలియకుండా దొంగతనాలు చేస్తుంటాడు. హోం మంత్రి (సంపత్ రాజ్)ను లక్ష్యంగా చేసుకుని అతను ఎక్కడెక్కడో దాచుకున్న వేల కోట్ల రూపాయల్ని తెలివిగా కాజేస్తాడు. తన డబ్బు కొట్టేస్తోంది ఎవరో తెలియక సతమతమైన హోం మంత్రి... తర్వాత విక్రాంత్ గురించి తెలుసుకుంటాడు. అప్పుడే విక్రాంత్ గతమేంటో వెల్లడవుతుంది. అతనొక లక్ష్యంతో ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంతకీ విక్రాంత్ గతమేంటి? అతనెందుకు దొంగతనాలు చేశాడు? ఆ డబ్బుతో ఏం చేశాడు? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

హీరో అందరిలో ఒకడిలా కనిపిస్తాడు. కానీ ఎవ్వరికీ తెలియకుండా బడా బాబుల్ని దోచేస్తుంటాడు. కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్. అందులో ఒక విషాద ఘట్టం. దాన్ని చూసే కదిలిపోయిన హీరో దొంగగా మారతాడు. దోచేసిన డబ్బులతో అభాగ్యుల్ని ఆదుకుంటూ ఉంటాడు. హీరోను పట్టుకోవడానికి నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ ప్రయత్నిస్తాడు. అతడి గుట్టు తెలుసుకుంటాడు. కానీ చివరికి హీరో మంచి ఉద్దేశాల్ని అర్థం చేసుకుని అతడికి సహకరిస్తాడు. హీరో నిర్దోషిగా బయటపడతాడు. దశాబ్దాలుగా చూస్తున్నాం ఈ ‘రాబిన్ హుడ్’ కథల్ని. పాతికేళ్ల కిందట వచ్చిన ‘జెంటిల్మన్’.. పదేళ్ల కిందట చూసిన ‘కిక్’ ఈ తరహాలోనివే. ఇంకా ఇలాంటి సినిమాలు లెక్కలేనన్ని. ఇలాంటి ఫార్ములా కథల్ని ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్న సమయంలో మళ్లీ గోపీచంద్ అదే రొటీన్ ‘పంతం’ పట్టాడు.

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి హీరో నుంచి ప్రేక్షకులు కొత్తదనమే కోరుకుంటున్న రోజులివి. బడా హీరోలు సైతం రొటీన్ సినిమాలతో దిమ్మదిరిగే ఫలితాన్నందుకుని మార్పు వైపు అడుగులేస్తున్నారు. కొత్త తరహా కథలు ట్రై చేస్తున్నారు. కానీ గోపీచంద్ మాత్రం పెద్దగా మారలేదు. తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమాలోనూ ఏ కొత్తదనం లేని కథనే ట్రై చేశాడు. సినిమా ఆరంభమైన కాసేపటికే ఈ కథ.. దాని కమామిషేంటో అర్థమైపోతుంది. ఎక్కడా ప్రేక్షకుల అంచనాలు తప్పవు. ఊహించలేని మలుపులుండవు. ఆద్యంతం ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది ‘పంతం’. స్క్రీన్ ప్లేలోనూ కొత్తదనం ఏమీ లేదు. లెక్కలేనన్ని సినిమాల్లో చూసిన ఫార్మాట్ లోనే కథనమంతా సాగిపోతుంది. సన్నివేశాలు కూడా రొటీన్ గా అనిపిస్తాయి. కాకపోతే మరీ పేలవమైన సీన్లు లేకపోవడం.. మాస్ ప్రేక్షకుల్ని అలరించే కామెడీ.. యాక్షన్ టచ్ ఉండటం.. పతాక సన్నివేశంలో డైలాగులు పేలడం ‘పంతం’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్.

‘‘రోడ్డుకు స్పీడ్ లిమిట్ ఉంటుంది కానీ.. నా యాక్షన్ కి నో లిమిట్’’.. ఫైట్ చేస్తూ మధ్యలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇలాంటి డైలాగులు పదేళ్ల కిందట కూడా ఔట్ డేటెడ్ గానే అనిపించేవి. ఇప్పుడు కూడా ఇలాంటి డైలాగ్ పెట్టారంటే ప్రేక్షకుల మారుతున్న అభిరుచిని అర్థం చేసుకోలేకపోతున్నట్లే. అందుకే ‘పంతం’ కథాకథనాలు కూడా అంత రొటీన్ గా లాగించేసినట్లున్నారు. కథ రొటీనే అయినా కథనమైనా కొంచెం కొత్తగా ఉండేలా చూసుకోవాల్సింది. కానీ అలాంటి ప్రయత్నం ‘పంతం’లో పెద్దగా జరగలేదు. హోం మంత్రి దగ్గర ఒక సామాన్యుడు డబ్బులు కొట్టేయాలంటే ఎంత నైపుణ్యం చూపించాలి? కానీ హీరో కాబట్టి ఏమైనా చేసేయగలడన్నట్లుగా ఇలా వెళ్లి అలా వందలు వేల కోట్ల డబ్బు కొట్టుకొచ్చేస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. దీనికి తోడు హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా పేలవంగా తయారవడంతో ‘పంతం’ ప్రథమార్ధం ఏ విశేషమూ లేకుండా సాగిపోతుంది.

కొన్ని మలుపులు.. ఫ్లాష్ బ్యాక్.. పతాక సన్నివేశం వల్ల ద్వితీయార్ధంలో ‘పంతం’ కొంచెం మెరుగనిపిస్తుంది. లెంగ్తీగా సాగే కోర్టు సీన్‌లోనూ కొత్తదనం ఏమీ లేకపోయినా బలమైన డైలాగులు పడటంతో అది నిలబడింది. గోపీచంద్ నుంచి ఆశించే యాక్షన్ సన్నివేశాలకు ఢోకా లేదు. కామెడీ పరంగా పృథ్వీ అక్కడక్కడా ఆదుకున్నాడు. రొమాంటిక్ ట్రాక్.. పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఓవరాల్ గా చూస్తే గోపీచంద్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు ‘పంతం’లో ఉన్నాయి. కానీ కొత్తదనం ఆశిస్తే మాత్రం ‘పంతం’ నిరాశ పరుస్తుంది. గోపీచంద్ తన 25వ సినిమా కోసం సామాజికాంశాలతో ముడిపడ్డ కథను ఎంచుకోవడం ఓకే కానీ.. తన గత సినిమాల ఫలితాలు.. ప్రస్తుత ట్రెండును దృష్టిలో ఉంచుకుని కొత్తదనం మీద కూడా దృష్టిపెట్టాల్సింది.

నటీనటులు:

గోపీచంద్ బాగానే చేశాడు. నటన పరంగా కొత్తదనం చూపించడానికి ఈ సినిమా పెద్దగా అవకాశమివ్వలేదు. ఐతే కోర్టు సీన్లో అతడి నటన.. డైలాగులు చెప్పడంలో ఇంటెన్సిటీ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఎప్పట్లాగే తన అభిమానులకు నచ్చేలా చేశాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పాత్ర పూర్తిగా తేలిపోయింది. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంటే ఆమె ఎంతో కాలం నిలబడలేదు. దర్శకుడు ఆమె పాత్రను మరీ పేలవంగా తయారు చేశాడు. సంపత్ రాజ్ విలనీ కూడా మామూలుగా అనిపిస్తుంది. పృథ్వీ నవ్వించాడు. శ్రీనివాసరెడ్డి పర్వాలేదు. తనికెళ్ల భరణి.. హర్షవర్ధన్ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ముకేష్ రుషి.. జయప్రకాష్ రెడ్డి.. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

ఫీల్ ఉన్న ప్రేమకథలకు తన సంగీతంతో ప్రాణం పోసే గోపీసుందర్.. రొటీన్ కమర్షియల్ సినిమాలకు తాను సూటవ్వనని మరోసారి రుజువు చేశాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలియకుండా వెళ్లి సినిమా చూశాక గోపీసుందర్ పని చేశాడంటే ఆశ్చర్యపోతారు. అలా ఉంది ఔట్ పుట్. ఇలాంటి సినిమాలకు ఎలాంటి సంగీతం ఇవ్వాలో తెలియని గందరగోళంలో అతను పని చేశాడేమో అనిపిస్తుంది. పాటలు.. నేపథ్య సంగీతం రెండూ అలాగే ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు ప్రసాద్. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాధామోహన్ రాజీ లేకుండా ఖర్చు పెట్టాడు. ఇక చక్రవర్తి.. ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే కొత్తదనమేమీ చూపించలేదు. కమర్షియల్ సినిమాల్ని డీల్ చేయడంలో ప్రతిభ కనిపిస్తుంది కానీ.. ఈ ట్రెండుకు తగ్గట్లుగా కథాకథనాల్లో వైవిధ్యాన్ని అతను ప్రదర్శించలేకపోయాడు. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: పంతం.. రొటీన్ మసాలానే

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre