Begin typing your search above and press return to search.

దృశ్యం కన్నా ఇదే బెస్ట్‌ అంటున్నారు

By:  Tupaki Desk   |   6 July 2015 3:30 PM GMT
దృశ్యం కన్నా ఇదే బెస్ట్‌ అంటున్నారు
X
దృశ్యం సినిమా మలయాళంలో సెన్సేషనల్‌ హిట్‌. అక్కడి రికార్డులన్నీ తుడిచిపెట్టేసి ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. ఔరా అనిపించింది. ఆ తర్వాత తెలుగులోకి రీమేక్‌ అయి ఇక్కడా సూపర్‌ హిట్‌ అనిపించుకుంది. త్వరలో హిందీలోనూ విడుదల కాబోతోంది. తమిళంలో గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ నాలుగు సినిమాల్లోకి తమిళంలో కమల్‌ హీరోగా నటించిన వెర్షనే ది బెస్ట్‌ అంటున్నారు విశ్లేషకులు. మిగతా మూడు చోట్లా దృశ్యం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మాత్రం 'పాపనాశం' అనే టైటిల్‌తో రూపొందింది. టైటిల్‌ విషయంలోనే కాదు.. తమిళ వెర్షన్‌ చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉందంటున్నారు జనాలు.

మలయాళంలో మోహన్‌లాల్‌ అదరగొట్టేశాడు. తెలుగులో వెంకీ కూడా బాగా చేశాడు. హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవగన్‌ ఎలాగైనా చేసి ఉండొచ్చు. కానీ అందర్లోకి ది బెస్ట్‌ కమల్‌ హాసన్‌ అని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. ఇలా అంటున్న వాళ్లలో మలయాళం, తెలుగు వెర్షన్స్‌ చూసిన వాళ్లు కూడా ఉన్నారు. కమల్‌ లార్జర్‌ దన్‌ లైఫ్‌ క్యారెక్టర్ల కంటే సామాన్యుడిగా నటించాల్సి వస్తే చెలరేగిపోతాడన్న సంగతి తెలిసిందే. ఇక కంటెంట్‌, కలెక్షన్ల పరంగానూ 'పాపనాశం' ది బెస్ట్‌ అనిపించుకుంటోంది. మలయాళం, తెలుగు వెర్షన్స్‌కు సంబంధించి ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురయ్యారు. ఐతే తమిళంలో ఆ ఇబ్బంది రాకుండా ఇంకొంచెం డీటైలింగ్‌ ఇచ్చారు. దీంతో నిడివి మూడు గంటలకు పెరిగింది. అయినప్పటికీ జనాలు ఏమాత్రం విసుగు లేకుండా ఆసక్తిగా సినిమా చూస్తున్నారు. మలయాళంలో దొర్లిన తప్పుల్ని కూడా సరిదిద్దుకుని తమిళ వెర్షన్‌ తీశానని.. ఇది మరింత బాగా వచ్చిందని డైరెక్టర్‌ జీతు జోసెఫ్‌ స్వయంగా చెప్పాడు. కలెక్షన్ల విషయానికొస్తే తొలి వీకెండ్‌లో 'పాపనాశం' పాతిక కోట్ల దాకా వసూలు చేసింది. ఫుల్‌ రన్‌లో 60 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి విడుదలకు ముందు 'పాపనాశం' మీద పెద్దగా అంచనాలు లేవు కానీ.. ఇప్పుడు మాత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.