Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'పేపర్ బాయ్'

By:  Tupaki Desk   |   31 Aug 2018 9:20 AM GMT
మూవీ రివ్యూ: పేపర్ బాయ్
X
చిత్రం : ‘పేపర్ బాయ్’

నటీనటులు: సంతోష్ శోభన్ - రియా సుమన్ - తన్య హోప్ - పోసాని కృష్ణమురళి - బిత్తిరి సత్తి - విద్యుల్లేఖ - మహేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు: సంపత్ నంది
నిర్మాతలు: సంపత్ నంది - రాములు - వెంకట్ - నరసింహ
దర్శకత్వం: జయశంకర్

దర్శకుడిగా కొనసాగుతూనే రచయితగా.. నిర్మాతగానూ అభిరుచిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు సంపత్ నంది. ఇంతకుముందు అతడి కథతో స్వీయ నిర్మాణంలో ‘గాలిపటం’ అనే సినిమా వచ్చింది. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు సంపత్ స్క్రిప్టుతో అతడి నిర్మాణంలో వచ్చిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్.. రియా సుమన్ జంటగా నటించిన ఈ సినిమా ఆహ్లాదకరమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివి ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పేపర్ బాయ్ గా పని చేస్తుంటాడు. తాను పేపర్ వేసే ఒక పెద్ద కుటుంబానికి చెందిన ధరణి (రియా సుమన్)ని అతను ఇష్టపడతాడు. రవి వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఐతే ఇరువురి నేపథ్యాల్లో అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. దీంతో ధరణికి దూరమవ్వాలని రవి అనుకుంటాడు. కానీ ధరణి అతడిని వదులుకోకూడదనుకుంటుంది. ఈ స్థితిలో వీళ్లిద్దరూ మళ్లీ కలవగలిగారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పేపర్ బాయ్ టీజర్లో.. ట్రైలర్లో కనిపించిన ఒక మంచి ఫీల్.. ఈ చిత్ర ప్రథమార్ధమంతా కనిపిస్తుంది. కలర్ ఫుల్ విజువల్స్.. మంచి పాటలు.. నేపథ్య సంగీతం.. కొన్ని అందమైన సన్నివేశాలు.. ఆహ్లాదం పంచుతాయి. ఒక పెద్దింటి అమ్మాయి.. పేదవాడైన కుర్రాడితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ దశాబ్దాలుగా చూస్తున్నప్పటికీ.. ఇందులో హీరోను పేపర్ బాయ్ గా చూపించడం.. సినిమాటిగ్గా కాకుండా సహజంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టేలా సన్నివేశాలు తీర్చిదిద్దుకోవడం.. హీరో కథానాయికకు దగ్గరయ్యే సన్నివేశాలు కొత్తగా ఉండటం.. ఇదంతా చూసి ఒక భిన్నమైన ప్రేమకథ చూడబోతున్న భావన కలుగుతుంది. ప్రేమకథకు చాలా కీలకం అయిన ‘ఫీల్’ తీసుకురావడంలోనూ ‘పేపర్ బాయ్’ విజయవంతమైనట్లే కనిపిస్తాడు. కానీ ఇందులో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేకపోవడంతో వచ్చింది సమస్య.

ఎప్పట్లాగే హీరో హీరోయిన్ల కుటుంబాల్లోని అంతరమే సమస్యగా మారగా.. దాన్ని డీల్ చేసే విధానంలో ఏ కొత్తదనం చూపించలేకపోయారు. ఆసక్తి రేకెత్తించని సింగిల్ పాయింట్ మీద ద్వితీయార్ధం మొత్తాన్ని నడిపించడంతో ప్రథమార్ధంలో కలిగిన మంచి ఇంప్రెషన్ అంతా నెమ్మదిగా వెళ్లిపోతుంది. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం.. కథనం కూడా సాదాసీదాగా తయారవడంతో ‘పేపర్ బాయ్’ ఒక దశ తర్వాత నీరుగారిపోతుంది. మాస్ ను మెప్పిద్దామని.. ఫిల్లింగ్ కోసం పెట్టిన కామెడీ అంతా సినిమాలో ఉన్న ఫీల్ ను కూడా చెడగొట్టేస్తుంది. ప్రేమకథల విషయంలో ప్రధాన పాత్రల పరిచయం.. వారి మధ్య ప్రేమ పుట్టేలా చేయడం వరకు సరదాగా అలా అలా నడిపించేయడం సులువే. కానీ కథ ఒక మలుపు తిరిగే దగ్గర్నుంచి డీల్ చేయడమే చాలా కష్టం. బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి. కొత్తగా ఏమైనా చూపించాలి. ఈ రెండు విషయాల్లోనూ ‘పేపర్ బాయ్’ విఫలమైంది.

రచయిత సంపత్ నంది ప్రథమార్ధం వరకు కొన్ని మంచి సీన్లే రాశాడు. డైలాగులు కూడా బాగా కుదిరాయి. దర్శకుడు జయశంకర్ కూడా లవ్ స్టోరీని ఫీల్ తో నడిపించడంలో బాగానే నేర్పు చూపించాడు. అన్నింటికీ మించి హీరో సంతోష్ శోభన్ సహజమైన నటనతో సన్నివేశాలకు బలం తెచ్చాడు. అతడి వ్యక్తిత్వాన్ని చాటే సీన్లు బాగా పండాయి. కానీ ఈ ముగ్గురూ కూడా ద్వితీయార్ధంలో ఏమీ చేయలేకపోయారు. ధనవంతుడైన హీరోయిన్ తండ్రి.. కూతురి ప్రేమను పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఆమె పెళ్లికి ఓకే చెప్పే సీన్ బాగుంటుంది. కానీ హీరోయిన్ అన్నలు రంగప్రవేశం చేశాక ‘పేపర్ బాయ్’ ట్రాక్ తప్పేసింది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడానికి బిత్తిరి సత్తి-విద్యుల్లేఖలతో చేయించిన కామెడీ అతిగా అనిపిస్తుంది. దాని వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ద్వితీయార్ధమంతా కథ చాలా ఫ్లాట్ గా సాగిపోయి బోర్ కొట్టించేస్తుంది. క్లైమాక్స్ లో మెలోడ్రామా ఎక్కువైపోయి అది కూడా తేడా కొట్టేసింది. మొత్తంగా ప్రామిసింగ్ గా ఆరంభమై.. ఒక దశ వరకు మంచి ఫీల్ తో సాగే ‘పేపర్ బాయ్’ తర్వాత గాడి తప్పేసింది.

నటీనటులు:

‘గోల్కొండ హైస్కూల్’ దగ్గర్నుంచి తాను చేసిన ప్రతి సినిమాలోనూ మెప్పించిన సంతోష్ శోభన్ మరోసారి ఆకట్టుకున్నాడు. ‘పేపర్ బాయ్’కి అతి పెద్ద ఆకర్షణ అతడే. ప్రతి సీన్లోనూ అతను మెప్పించాడు. పాత్రకు తగ్గట్లుగా చాలా సహజంగా నటించాడు. అతడి బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. హీరోయిన్ రియా సుమన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ తండ్రిగా చేసిన నటుడు బాగా చేశాడు. విద్యుల్లేఖ ఓకే. హీరో ఫ్రెండు పాత్రలో మహేష్ అక్కడక్కడా నవ్వించాడు. తన్య హోప్ ది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు.

సాంకేతికవర్గం:

భీమ్స్ సంగీతం బాగుంది. రెండు మూడు పాటలు మంచి ఫీల్ తో సాగుతాయి. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా సినిమాకు బాగానే ఉపయోగపడింది. సౌందర్ రాజన్ కెమెరా పనితనం మరో ఆకర్షణ. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. రచయిత సంపత్ నంది డైలాగుల వరకు మాత్రమే మెప్పించాడు. అతను ఎంచుకున్న కథలో బలం లేదు. స్క్రీన్ ప్లే కూడా మామూలుగానే అనిపిస్తుంది. దర్శకుడు జయశంకర్ అక్కడక్కడా పనితనం చూపించాడు. కానీ బలహీనమైన స్క్రిప్టుతో అతను కూడా ఏమీ చేయలేకపోయాడు.

చివరగా: పేపర్ బాయ్.. మధ్యలో దారి తప్పాడు

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre